బాపట్ల జిల్లాలో దివ్యాంగుల సమస్యలపై అధికారులకు వినతి
బాపట్ల జిల్లా:
ఈరోజు బాపట్ల జిల్లాలో దివ్యాంగులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై నవ్యాంధ్ర వికలాంగుల హక్కుల సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు షేక్ కాలేషా ఆధ్వర్యంలో ప్రతినిధులు జిల్లా రెవెన్యూ అధికారి గంగాధర్ గౌడ్ మరియు డి.ఆర్.డి.ఏ ప్రాజెక్టు డైరెక్టర్ బత్తిన సింగయ్యలను కలిసి వినతి పత్రం సమర్పించారు.
వివరాలలోకి వెళితే, జిల్లాలో దివ్యాంగులకు సకాలంలో సదరం సర్టిఫికెట్లు అందడం లేదని వారు పేర్కొన్నారు. కొన్ని చోట్ల సచివాలయ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఫోటో లేకుండా, సంతకాలు లేకుండా, ప్రశ్నార్థక గుర్తులతో సర్టిఫికెట్లు జారీ అవుతున్నాయని డి.ఆర్.ఓ. దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై స్పందించిన డి.ఆర్.ఓ. సమస్యను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.
అలాగే, డి.ఆర్.డి.ఏ ప్రాజెక్టు డైరెక్టర్ బత్తిన సింగయ్యను కలిసి, గత రెండు సంవత్సరాలుగా దివ్యాంగుల స్వయం సహాయక సంఘాల ఏర్పాటులో నిర్లక్ష్యం జరుగుతోందని వివరించారు. మండల స్థాయిలో ఎం.పీ.డీ.వో.లు, ఏ.పీ.ఎం.లు స్పందించడం లేదని, దివ్యాంగుల హక్కుల చట్టం 2016 ప్రకారం సమావేశాలు కూడా నిర్వహించడం లేదని తెలిపారు.
ఈ అంశాలపై వెంటనే స్పందించిన ప్రాజెక్టు డైరెక్టర్, స్వయం సహాయక సంఘాల ఏర్పాటు మరియు దివ్యాంగుల సమైక్యాల ఏర్పాటుకు తగిన ఆదేశాలు ఇస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ఎస్. రమేష్, జిల్లా అధ్యక్షుడు ఇరుపని వెంకటేశ్వర్లు, బాలాజీ, ఉమామహేశ్వర లాల్, ఖాజా తదితరులు పాల్గొన్నారు.