పెండింగ్‌లో ఉన్న అటవీ, అసైన్డ్ భూముల సమస్యల పరిష్కారానికి వేగవంతమైన చర్యలు చేపట్టాలి
*భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ ,
తెలంగాణ స్టేట్ **భద్రాద్రి కొత్తగూడెం జిల్లా** ఏప్రిల్ 16**(ఏఐఎంఏ మీడియా ప్రతినిధి)
పెండింగ్‌లో ఉన్న అటవీ, అసైన్డ్ భూముల సమస్యల పరిష్కారానికి వేగవంతమైన చర్యలు చేపట్టాలి - జిల్లా కలెక్టర్ అంకిత్
గురువారం ఐడిఓసి కార్యాలయం సమావేశ మందిరంలో అటవీ శాఖ అధికారి కృష్ణ గౌడ్‌తో కలిసి అసైన్డ్ భూముల అంశంపై జిల్లా స్థాయి సమీక్ష సమావేశాన్ని జిల్లా కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో అసైన్డ్ భూములకు సంబంధించిన వివిధ సమస్యలను సమగ్రంగా పరిశీలించి, వేగవంతంగా పరిష్కరించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
అసైన్డ్ భూములపై అక్రమ ఆక్రమణలను కఠినంగా అరికట్టాలని, ఎక్కడైనా అక్రమాలు గుర్తించిన వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భూముల రికార్డులను సక్రమంగా నవీకరించి, పారదర్శకంగా నిర్వహించాలని అన్నారు .
సర్వే నెంబర్ వారీగా ప్రభుత్వ, అటవీ, అసైన్డ్ భూముల పూర్తి వివరాలను సేకరించి సమగ్ర నివేదికలను తక్షణమే అందజేయాలని సూచించారు. భూముల ప్రస్తుత స్థితి, ఎదురవుతున్న సమస్యలు, ఆక్రమణల వివరాలు వంటి అంశాలను స్పష్టంగా నమోదు చేయాలని తెలిపారు.
ఆక్రమణకు గురైన భూములపై ప్రభుత్వ నిబంధనల ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో మరే ఇతర ప్రభుత్వ భూమి కూడా ఆక్రమణకు గురికాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న అటవీ భూములు, అసైన్డ్ భూములకు సంబంధించిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు తగిన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.
అసైన్డ్ భూములకు సంబంధించిన అన్ని అంశాలలో నిర్లక్ష్యం లేకుండా, సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో భద్రాచలం సబ్ కలెక్టర్ మృనాల్ శ్రేష్ట,అదనపు కలెక్టర్ వేణుగోపాల్ రెవెన్యూ శాఖ అధికారులు, అటవీ శాఖ అధికారులు మరియు సంబంధిత విభాగాల అధికారులు పాల్గొన్నారు