రుద్రవరం లో పెద్దమ్మ దేవర ఉత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు....సీఐ రాము
నంద్యాల జిల్లా రుద్రవరం మండల కేంద్రంలో 9 సంవత్సరాల తర్వాత అత్యంత వైభవంగా జరగనున్న పెద్దమ్మ దేవర ఉత్సవాలకు సంబంధించి పోలీస్ మరియు వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్లు సిరివెళ్ల సీ.ఐ రాము తెలిపారు. గురువారం రుద్రవరం లోని మండల పరిషత్ సమావేశ భవనంలో గురువారం నాడు దేవర ఏర్పాట్లపై నిర్వహించిన గ్రామస్తుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఐ రాము మాట్లాడుతూ ఈ ఉత్సవాలకు సుమారు 50 వేల మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున, సిరివెళ్ల, నర్సాపురం, మరియు అప్పనపల్లె మార్గాల నుండి వచ్చే వాహనాల కోసం గ్రామ వెలుపలే పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేశామన్నారు. గ్రామంలోకి ఎటువంటి ప్రైవేట్ వాహనాలను అనుమతించబోమని స్పష్టం చేశారు. భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ బస్సులను ఎంఆర్ఓ ఆఫీస్ మరియు నంద్యాల రూట్ పెట్రోల్ బంక్ వరకు అనుమతిస్తామని, అక్కడ పోలీస్ సిబ్బందితో పాటు ఆర్టీసీ సిబ్బంది కూడా విధుల్లో ఉంటారని తెలిపారు. గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో వీధులన్నీ శుభ్రంగా ఉంచాలని, ఊరేగింపు సాగే దారిలో ఎక్కడా నీరు నిల్వ లేకుండా చూడాలని కోరారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా నీటి సరఫరా త్రాగునీరు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. అలాగే, ఉత్సవాల సమయంలో నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాలని విద్యుత్ శాఖాధికారులకు సూచించారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఎవరికైనా అనారోగ్యం కలిగితే తక్షణమే స్పందించేలా మెడికల్ క్యాంపులు ఉండాలని, ముఖ్యంగా హార్ట్ స్ట్రోక్ వంటి అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాపాయం తప్పించే ప్రత్యేక ఇంజక్షన్లను అందుబాటులో ఉంచాలని వైద్య శాఖను కోరారు. గతంలో ఇస్తేమా సమయంలో ఇటువంటి ముందస్తు జాగ్రత్తల వల్ల ముగ్గురి ప్రాణాలు కాపాడగలిగామని ఆయన గుర్తు చేశారు. ఏదైనా అగ్నిప్రమాదం జరిగితే తక్షణమే అరికట్టేలా ఫైర్ ఇంజన్‌ను సిద్ధంగా ఉంచాలని సూచించారు. ప్రతి విభాగం తమ బాధ్యతలను సక్రమంగా నిర్వహించినప్పుడే ఏ కార్యక్రమమైనా విజయవంతమవుతుంది కావున గ్రామ పెద్దలు కూడా పోలీసులకు సహకరించి, ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించుకోవాలి" అని సీఐ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఎస్సై జయప్ప, డిప్యూటీ ఎంపీడీవో ప్రసాద్ రెడ్డి, విద్యుత్ ఏ ఈ రాజశేఖర్, ఫైర్ అధికారి నాగరాజు, గ్రామ పెద్దలు ఎల్వి రంగయ్య పలువురు గ్రామ పెద్దలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.