దేశ తలరాతను మార్చే మూడు బిల్లులు: నేడే లోక్‌సభలో అసలైన టెస్ట్!
భారత రాజకీయ చరిత్రలో మరో చారిత్రాత్మక ఘట్టానికి తెరలేవనుంది. దశాబ్దాల కల అయిన చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల అమలుతో పాటు, దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది.
గురువారం ఉదయం 11 గంటలకు లోక్‌సభ ముందుకు మూడు కీలక బిల్లులు రానున్నాయి. ఈ బిల్లులు ఆమోదం పొందితే, 2029 సార్వత్రిక ఎన్నికల నాటికి భారత రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోనుంది.
కేంద్రం ప్రవేశపెట్టనున్న 131వ రాజ్యాంగ సవరణ బిల్లు ప్రకారం.. లోక్‌సభ సీట్ల సంఖ్యను ప్రస్తుతం ఉన్న 543 (గరిష్ఠంగా 550) నుంచి 850కి పెంచే ప్రతిపాదన ఉంది. 2011 జనాభా లెక్కల ప్రాతిపదికన ఈ డీలిమిటేషన్ ప్రక్రియను చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. దీని కోసం ప్రత్యేకంగా ఒక డీలిమిటేషన్ కమిషన్‌ను ఏర్పాటు చేసేందుకు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో నియోజకవర్గాల మార్పులకు వీలు కల్పించే మరో రెండు బిల్లులను కూడా ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనుంది.
రాజ్యాంగ సవరణ బిల్లు నెగ్గాలంటే సభలో రెండొంతుల (2/3) మెజారిటీ తప్పనిసరి. ప్రస్తుతం లోక్‌సభలో 540 మంది సభ్యులు ఉండగా, బిల్లు ఆమోదానికి 360 ఓట్లు అవసరం. ఎన్డీయే కూటమికి 292 మంది బలం ఉండటంతో, మరో 68 ఓట్ల కోసం ప్రభుత్వం ఇతర పార్టీలపై ఆధారపడాల్సి ఉంది. అయితే, విపక్ష సభ్యులు గైర్హాజరైతే 'ప్రెజెంట్ అండ్ ఓటింగ్' ప్రాతిపదికన అధికార పక్షానికి కలిసొచ్చే అవకాశం ఉంది.
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ
విపక్షాల గర్జన: "దక్షిణాదికి అన్యాయం జరగనివ్వం"
మహిళా రిజర్వేషన్లను తాము స్వాగతిస్తున్నామని, కానీ డీలిమిటేషన్ పేరుతో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తే ఊరుకోబోమని 'ఇండియా' కూటమి తేల్చి చెప్పింది.
రాహుల్ గాంధీ హెచ్చరిక:
"జనాభా ప్రాతిపదికన సీట్లు పెంచితే దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయి. అలాగే 2026 కులగణన లేకుండా, ఓబీసీలకు ఉప కోటా ఇవ్వకుండా మహిళా రిజర్వేషన్లు అమలు చేయడం అంటే వెనుకబడిన వర్గాల వాటాను చోరీ చేయడమే" అని రాహుల్ గాంధీ మండిపడ్డారు.
జైరాం రమేష్ ధీమా:
రాజ్యాంగ సవరణ బిల్లును ఓడించి తీరుతామని, దేశం ఒక రాజకీయ భూకంపానికి సిద్ధంగా ఉండాలని ఆయన వ్యాఖ్యానించారు.
KCR మాస్ వార్నింగ్! డీలిమిటేషన్ పై కేంద్రానికి స్ట్రాంగ్ మెసేజ్
చంద్రబాబు మద్దతు.. నిర్మల భరోసా!
మరోవైపు ఎన్డీయే భాగస్వామి, తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ఈ బిల్లులను సమర్థిస్తూ అన్ని పార్టీలకు లేఖలు రాశారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. "డీలిమిటేషన్ విషయంలో ప్రతి రాజకీయ పార్టీతో కమిషన్ సంప్రదింపులు జరుపుతుంది. ఎవరికీ అన్యాయం జరగదు" అని భరోసా ఇచ్చారు. రాష్ట్రాల మధ్య సమతౌల్యం దెబ్బతినకుండా అన్ని ప్రాంతాల్లో 50% సీట్లు పెంచుతామని కేంద్ర వర్గాలు చెబుతున్నాయి. మహిళా సాధికారత దిశగా మోదీ ప్రభుత్వం వేస్తున్న ఈ అడుగు విజయవంతం అవుతుందా? లేక విపక్షాల వ్యూహంతో సభలో బ్రేకులు పడతాయా? అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది.