logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

మత్స్యకారుల కడుపు నింపింది కూటమి ప్రభుత్వం...మోసం చేసింది జగన్ ప్రభుత్వం*

*మత్స్యకారుల కడుపు నింపింది కూటమి ప్రభుత్వం...మోసం చేసింది జగన్ ప్రభుత్వం*

• మత్స్యకారుల హక్కులను కాలరాసిన జగన్ కు మాట్లాడే నైతిక హ‌క్కు లేదని మంత్రి అచ్చెన్నాయుడు ఫైర్
• హ‌ర్భ‌ర్ల అభివృద్ధికి రాష్ట్ర వాటా ఉప‌యోగించ‌కపోగా, కేంద్రం వాటా రూ.128 కోట్లను ప‌క్క‌దారి ప‌ట్టించిన ఘ‌నుడు జ‌గ‌న్
• వేట నిషేధ భృతి రూ.10 వేలు నుంచి రూ.20 వేలకి పెంపు... లక్షల కుటుంబాలకు భరోసానిచ్చిన కూట‌మి ప్ర‌భుత్వం
• డీజిల్ సబ్సిడీ, పింఛన్ పెంపుతో మత్స్యకారుల ఆర్థిక భద్రత బలోపేతం
• పెండింగ్ క్లెయిమ్స్ క్లియర్ చేసి బాధిత కుటుంబాలకు న్యాయం
• ట్రాన్స్పాండర్లు, రీఫ్స్, హార్బర్లతో మత్స్య రంగానికి కొత్త ఊపు
• అబద్ధాలే జగన్ రాజకీయాలు - మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు


*అమ‌రావ‌తి, ఏప్రిల్ 15:* మత్స్యకారుల సంక్షేమం, వారి కుటుంబాల భద్రత కోసం నిజంగా పని చేసింది కూటమి ప్రభుత్వమేనని రాష్ట్ర వ్యవసాయ, మత్స్యశాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. గత ఐదేళ్లలో మత్స్యకారులను మాటలతో మభ్యపెట్టి వారి హక్కులను కాలరాసింది జగన్ ప్రభుత్వం అని ఆయన తీవ్రంగా మండిపడ్డారు. మత్స్యకారుల జీవనోపాధిని బలోపేతం చేయడంలో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుందని తెలిపారు. బుధ‌వారం జువ్వ‌ల‌దిన్నె హ‌ర్బ‌ర్ వ‌ద్ద నిస్సుగ్గుగా జ‌గ‌న్ ప‌చ్చి అబద్దాలు తెలిపార‌ని మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి గ‌త ప్ర‌భుత్వంలో కేంద్రం వాటా అయిన 128 కోట్ల‌ను ఉప‌యోగించ‌కుండా నిధుల‌ను ప‌క్క‌దారి ప‌ట్టించార‌ని, రాష్ట్ర వాటా కూడా మ‌త్స్య‌కారుల కోసం ఉప‌యోగించ‌కుండా ఇష్టానుసారంగా వ్య‌వ‌హ‌రించార‌ని, కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డ్డాక కేంద్రం వాటా నిధుల‌ను వెంట‌నే క‌ట్టాల‌ని కేంద్రం రాష్ట్రానికి లేఖ రాసింద‌ని, లేక‌పోతే ఇత‌ర స‌బ్సిడీలు అమ‌లు చేసేది లేదంటూ చెప్ప‌టంతో వెంట‌నే రాష్ట్ర ప్ర‌భుత్వం 128 కోట్ల బ‌కాయిల‌ను విడుద‌ల చేసామ‌ని తెలిపారు.నేడు జ‌గ‌న్ నోటికి వ‌చ్చిన అబ‌ద్ధాలు మాట్లాడుతూ ప్ర‌జ‌ల్ని త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నార‌ని అన్నారు. వేట నిషేధ కాలంలో ఇచ్చే భృతిని రూ.10,000 నుండి రూ.20,000కు పెంచి, లక్షలాది కుటుంబాలకు నేరుగా ఆర్థిక భరోసా కల్పించామని చెప్పారు. ఒకే సంవత్సరంలో భారీగా రూ.242 కోట్లకు పైగా సహాయం అందించడం కూటమి ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని అన్నారు. మత్స్యకారుల ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు డీజిల్ సబ్సిడీ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నామని, వేలాది పడవలకు లీటరుకు రూ.9 సబ్సిడీ అందిస్తున్నామని తెలిపారు.

గత ప్రభుత్వం ఐదేళ్లలో ఇచ్చిన సబ్సిడీ కంటే మెరుగైన సహాయం తాము అందిస్తున్నామని పేర్కొన్నారు. నిస్సుగ్గుగా మ‌త్స్య‌కారుల ప్ర‌మాద మ‌ర‌ణ ప‌రిహారాన్ని 10 ల‌క్ష‌ల‌కు పెంచామ‌ని చెప్తున్న జ‌గ‌న్, గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో పెండింగ్‌లో ఉన్న మత్స్యకారుల మరణ పరిహారాలైన 2024-25లో రూ.3.15 కోట్లు చెల్లించామ‌ని, అదే విధంగా 2025-26లో రూ.5.65 కోట్లు చెల్లించామని తెలిపారు. నీ ఇష్టానుసారంగా నీ ప‌త్రిక‌, నీ మ‌నుషులు చెప్పిన మాట‌ల‌ను చ‌ద‌వ‌టం కాకుండా నిజాల‌ను తెలుసుకుని ప్ర‌జ‌ల‌కు చెప్పాల్సిన బాధ్య‌త నీకు లేదా అంటూ మండిప‌డ్డారు. మత్స్యకారుల కుటుంబాలకు న్యాయం చేయడం తమ బాధ్యతగా భావిస్తున్నామని చెప్పారు. సామాజిక భద్రతా పింఛనును రూ.3,000 నుండి రూ.4,000కు పెంచి, వేలాది మంది మత్స్యకారులకు ఆర్థిక భరోసా కల్పించామని అన్నారు. ఈ పథకం ద్వారా ఇప్పటికే భారీ మొత్తంలో నిధులు విడుదల చేశామని తెలిపారు.

మత్స్యకారుల భద్రత కోసం ట్రాన్స్పాండర్లు అమర్చడం, కృత్రిమ రీఫ్‌ల ఏర్పాటు, చేప పిల్లల విడుదల, డీప్ సీ ఫిషింగ్ పడవల పంపిణీ వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని మంత్రి వివరించారు. తీర ప్రాంత గ్రామాల అభివృద్ధి, ఫిషింగ్ హార్బర్లు, ల్యాండింగ్ సెంటర్ల నిర్మాణం ద్వారా మత్స్యకారుల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తున్నామని చెప్పారు. జగన్ ప్రభుత్వం కేంద్ర నిధులను పక్కదారి పట్టించి మత్స్యకారులను మోసం చేసిందని ఆరోపించిన మంత్రి, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రూ.128 కోట్ల కేంద్రం వాటా బకాయిలను కేంద్రానికి చెల్లించి పారదర్శకతను నిరూపించామని తెలిపారు. నిజాలు దాచిపెట్టి అబద్ధాలు ప్రచారం చేయడం జగన్‌కు అలవాటైపోయిందని విమర్శించిన మంత్రి అచ్చెన్నాయుడు, మత్స్యకారుల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

మత్స్యకారుల డిమాండ్ల మేరకు 2015-16లో 8 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించామని, దీనికి సంబంధించిన DPRలను WAPCOS ద్వారా సిద్ధం చేయించామని మంత్రి వివరించారు. ఫేజ్-1లో జువ్వలదిన్నె, ఉప్పాడ, మచిలీపట్నం, నిజాంపట్నం హార్బర్లు నిర్మాణంలో ఉన్నాయని తెలిపారు. ఫేజ్-2లో బుడగట్లపాలెం, పుడిమడక, కొత్తపట్నం, వొడరేవు హార్బర్లు ప్రతిపాదించబడ్డాయని చెప్పారు. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌ను కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు 50:50 నిధులతో ఆమోదించగా, ప్రస్తుతం అది పూర్తి దశకు చేరుకుందని తెలిపారు. ఉప్పాడ, మచిలీపట్నం, నిజాంపట్నం, వొడరేవు హార్బర్లు 2019-20లో ఆమోదించబడినప్పటికీ, అప్పటి ప్రభుత్వం FIDF రుణాన్ని సక్రమంగా వినియోగించకపోవడంతో పనులు మందగించాయని విమర్శించారు. ప్రస్తుతం ఉప్పాడ, మచిలీపట్నం, నిజాంపట్నం హార్బర్ల పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. తదుపరి కేంద్ర ప్రభుత్వం PMMSY పథకం కింద బుడగట్లపాలెం, పుడిమడక, కొత్తపట్నం హార్బర్లను ఆమోదించిందని చెప్పారు. రాష్ట్రంలో మొత్తం రూ.3,328.48 కోట్లతో 10 ఫిషింగ్ హార్బర్ల అభివృద్ధి జరుగుతోందని మంత్రి తెలిపారు. వీటిలో కొన్ని పూర్తి దశకు చేరుకోగా, మరికొన్ని నిర్మాణంలో వేగంగా కొనసాగుతున్నాయని వివరించారు. ఇక 2018-19లో ముంచినీలపేట, బియ్యపుటిప్ప ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల అభివృద్ధి ప్రారంభించినప్పటికీ, 2019 నుంచి 2024 వరకు నిధుల విడుదలలో జరిగిన ఆలస్యం కారణంగా అవి పూర్తికాలేదని చెప్పారు. అలాగే 2021-22, 2022-23లో PMMSY కింద భీమిలి, రాజయ్యపేట, చింతపల్లి, రాయదరువు, దొండవాక, ఉప్పలంక ప్రాంతాల్లో రూ.126.91 కోట్లతో 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లకు ఆమోదం లభించినప్పటికీ, గత ప్రభుత్వం నిర్లక్ష్యంతో పనులు ప్రారంభం కాలేదని మండిపడ్డారు. మత్స్యకారుల అభివృద్ధిపై మాట్లాడే నైతిక హక్కు జ‌గ‌న్ కు లేదని మంత్రి అచ్చెన్నాయుడు తీవ్రంగా విమర్శించారు. కూటమి ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమం, అభివృద్ధి కోసం కట్టుబడి పనిచేస్తుందని స్పష్టం చేశారు.
(సేకరణ)

0
24 views

Comment