ప్రతి విద్యార్థికి ఉన్నత చదివే మా లక్ష్యం ఐపీఎస్ అధికారి కిల్లాడ సత్యనారాయణ, వేదా విద్య డైరెక్టర్ పోతల ప్రసాద్ నాయుడు
అనకాపల్లి జిల్లా చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాల్లోని పేద విద్యార్థులకు గొప్ప శుభవార్త వచ్చింది. గ్రామీణ ప్రతిభలు ఉన్నత విద్యను అభ్యసించి అత్యున్నత శిఖరాలు చేరాలనే ఘన లక్ష్యంతో IPS అధికారి కిల్లాడ్ సత్యనారాయణ, వేద విద్యా డైరెక్టర్ మరియు OBC జాతీయ అధ్యక్షుడు పోతల ప్రసాద్ నాయుడు, భారతదేశంలో IIT-NEET కోచింగ్‌లో అగ్రస్థానంలో నిలిచి సుమారు ఐదు కోట్ల మంది విద్యార్థులకు శిక్షణ అందించిన ప్రముఖ సంస్థ 'ఫిజిక్స్ వాలా' సహకారంతో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థికంగా బలహీన ప్రతిభావంతులకు IIT, NEET, JEE వంటి ఖరీదైన కోర్సులను పూర్తిగా ఉచితంగా అందజేస్తున్నారు. గత నెల రోజులుగా వివిధ మండలాల్లో ఉచిత కోచింగ్ ప్రవేశ పరీక్షలు నిర్వహించి, అత్యున్నత ప్రతిభ కలిగిన విద్యార్థులను ఎంపిక చేశారు.
ఈ మహత్కార్యం ద్వారా ముందుగా అనకాపల్లి జిల్లాలోని రోలుగుంట, రావికమతం, మాకవరపాలెం మండలాల్లో IIT-NEET కోచింగ్ సెంటర్లు ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రారంభోత్సవంలో IPS అధికారి కిల్లాడ్ సత్యనారాయణ మాట్లాడుతూ, "ప్రతి మండలం ఒక అవనిగడ్డలా, ఒక నంద్యాలలా ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకోవాలి. పేద విద్యార్థులు ఉన్నత చదువుల కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా సొంత గ్రామంలోనే ఉంటూ ప్రయాణ ఖర్చులు, ఇతర వ్యయాలు లేకుండా అన్ని సదుపాయాలతో ఉన్నత విద్యను అందించడమే నా జీవిత లక్ష్యం" అని తెలిపారు. ప్రవేశ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన వారికి మాత్రమే కాకుండా, ఉత్తీర్ణులు కాని విద్యార్థులకు కూడా అవకాశాలు కల్పిస్తామని స్పష్టం చేశారు.
వేద విద్యా ఫౌండర్ పోతల ప్రసాద్ నాయుడు మాట్లాడుతూ, "నా సొంత జిల్లా అనకాపల్లిలో డబ్బు కారణంగా ఎవరూ చదువును మధ్యలో నిలిపివేయకూడదు. వారికి అండగా నిలుస్తామని తల్లిదండ్రులకు భరోసా ఇచ్చారు. ఢిల్లీలో మా సంస్థలు ఎంతోమంది IAS, IPS అధికారులను తయారుచేశాయి. వారి సహకారంతో మరిన్ని ప్రతిభలను సాఫల్యం చేయడానికి మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాము. ఈ మహత్కార్యానికి తల్లిదండ్రులు, పెద్దలు, ప్రజలు అందరూ సహకరించాలి" అని పిలుపునిచ్చారు.
కోచింగ్ సెంటర్ల ప్రారంభోత్సవానికి హాజరైన నాయకులు మరిన్ని అవకాశాలు ప్రకటించారు. ఏ పోటీ పరీక్షకైనా తమ సంస్థ ద్వారా తక్కువ ఖర్చుతో ఉన్నత విద్య అందించి సహాయం చేస్తామని, చదువు పూర్తయిన తర్వాత చుట్టుపక్కల కర్మాగారాలతో మాట్లాడి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. అదే విధంగా ప్రతి గ్రామంలో మండల కేంద్రంగా పేద ప్రజలకు ఉచిత మెగా వైద్య శిబిరాలు నిర్వహిస్తామని, విద్య, వైద్యం, ఉపాధి - ఈ మూడు లక్ష్యాలే మా ముఖ్య లక్ష్యమని వివరించారు.
ఈ కార్యక్రమం అనకాపల్లి గ్రామీణ పేద విద్యార్థులకు కొత్త ఆశలు, అపార అవకాశాలు తెచ్చిపెట్టింది. గ్రామాల్లోనే ఉన్నత విద్య, ఉపాధి, వైద్య సేవలు అందుబాటులోకి వస్తున్నాయి.