logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

1000 ఎకరాల బీసీ భవనం ఎవరి కోసం? రాయలసీమ వాసుల సూటి ప్రశ్న?

AIMA న్యూస్. రాయలసీమ బ్యూరో. గౌరవనీయులైన భారత చైతన్యం యువజన పోరాటం అధ్యక్షులు రామచంద్ర యాదవ్ కు,
నమస్కారం. గత రెండు రోజులుగా బీసీల హక్కుల కోసం, ఆత్మగౌరవం కోసం మీరు చేస్తున్న పోరాటం అభినందనీయం. అయితే, ఇటీవల మీరు అమరావతిలో 1000 ఎకరాల్లో బీసీ భవన్ నిర్మించాలని చేసిన డిమాండ్ విన్న తర్వాత, రాయలసీమ ప్రాంతానికి చెందిన సామాన్య బీసీ బిడ్డలుగా మా మనసులోని కొన్ని సందేహాలను, ప్రశ్నలను మీ ముందు ఉంచుతున్నాము.1000 ఎకరాల విస్తీర్ణం ఎవరి కోసం?ఒక ఇంజనీరింగ్ కాలేజీ లేదా యూనివర్సిటీయే 50-100 ఎకరాల్లో పూర్తవుతుంది. మరి 1000 ఎకరాల్లో భవనం అంటే అది ఒక మహానగరం అంత విస్తీర్ణం. ఇంత భారీ కట్టడాల వల్ల సామాన్య బీసీలకు చేకూరే తక్షణ ప్రయోజనం ఏంటి? ఇది కేవలం రాజకీయ ప్రచారానికే పరిమితం కాదా?అమరావతిలో వేల కోట్ల ఖర్చుతో భవనాలు కడితే, రాయలసీమలోని మారుమూల గ్రామాల్లో ఉన్న మా బీసీ బిడ్డల ఆకలి తీరుతుందా? మా ప్రాంతంలోని వలసలు ఆగుతాయా? మాకు కావాల్సింది రాజధానిలో విలాసవంతమైన భవనాలు కాదు, మా జిల్లాల్లో ఉపాధి కల్పించే పరిశ్రమలు.
ఆ 1000 ఎకరాల భూమి విలువ లేదా ఆ భవనాల నిర్మాణానికి అయ్యే వేల కోట్ల రూపాయలను రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీసీ విద్యార్థుల ఉన్నత చదువులకు, విదేశీ విద్యకు, జిల్లాకో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటుకు ఉపయోగిస్తే బాగుంటుంది కదా?బీసీల ఆత్మగౌరవం రాజధానిలో కట్టే గోడల్లో లేదు. ప్రతి బీసీ బిడ్డకు నాణ్యమైన చదువు అందినప్పుడు, ప్రతి చేతివృత్తి దారుడికి ఆర్థిక భరోసా దొరికినప్పుడు మాత్రమే నిజమైన ఆత్మగౌరవం సిద్ధిస్తుంది.
దయచేసి మీ పోరాటం కేవలం రాజధానిలో స్థలాలు, భవనాల చుట్టూ కాకుండా. వెనుకబడిన రాయలసీమ లాంటి ప్రాంతాల్లో ఉన్న బీసీల జీవన ప్రమాణాలు పెంచే దిశగా సాగాలని కోరుకుంటున్నాము. ఆడంబరమైన డిమాండ్ల కంటే, ఆచరణాత్మకమైన అభివృద్ధి కోసం గళం ఎత్తాలని విజ్ఞప్తి చేస్తున్నాము.
ఇట్లు,
రాయలసీమ బీసీ బిడ్డలు.

34
1034 views

Comment