ప్రతిభ ఉన్న ప్రతి విద్యార్థి ఎప్పుడూ ఆగిపోకూడదు” – ఐపీఎస్ అధికారి కిల్లాడ సత్యనారాయణ
అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం రోలుగుంట గ్రామంలో ఆదివారం ఐఐటీ, నీట్ కోచింగ్ సెంటర్ ప్రారంభోత్సవం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా హాజరైన ఐపీఎస్ అధికారి కిల్లాడ సత్యనారాయణ చేతుల మీదుగా ఈ కోచింగ్ సెంటర్ను ప్రారంభించారు. పల్లెలే దేశానికి పట్టుకొమ్మలని, ప్రతిభ ఉన్న ప్రతి విద్యార్థి ఏ కారణం వల్ల కూడా స్టాప్ అవ్వకూడదని ఆయన స్పష్టంగా చెప్పారు. పేద, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థుల చదువు, ఎదుగుదల ఎప్పటికీ ఆగరాదని, వారి భవిష్యత్తు కోసం తాను ఏ సహకారం అయినా అందివ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. తల్లిదండ్రులు కూడా పిల్లల భవిష్యత్తు కోసం మంచి ఆలోచన చేసి ముందుకు రావాలని ఆయన కోరారు.
ఐఐటీ, నీట్, ఎన్‌ఐటీ వంటి పోటీ పరీక్షల కోచింగ్ సాధారణంగా ఎక్కువ ఖర్చు కలిగి ఉంటుందని గుర్తు చేసిన ఆయన, పల్లె పిల్లలకు ఉచితంగా ఇటువంటి శిక్షణ అందించాలనేదే లక్ష్యమని చెప్పారు. ఈ కేంద్రం ద్వారా ప్రతి యోగ్య విద్యార్థికి ఫిజిక్స్ వాలా సౌజన్యంతో, “వేదా విద్యా” డైరెక్టర్ పోతల ప్రసాద్ నాయుడు సహకారంతో కలిసి ఐఐటీ, నీట్ కోచింగ్ ఉచితంగా అందించే ప్రయత్నం చేస్తున్నట్లు ప్రకటించారు. జాతీయ ఓబీసీ అధ్యక్షుడు పోతల ప్రసాద్ నాయుడు మాకవరపాలెం మండలాన్ని “దత్తత” తీసుకుని, ఇంకా ఎన్నో ప్రత్యేక విద్యా కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఢిల్లీలో ఉన్న వేద విద్యాసంస్థ ద్వారా ఎంతోమంది అత్యున్నత విద్యావంతులను తయారు చేశామని, వారి ద్వారా గ్రామీణ ప్రాంత విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు. స్థానిక ఎస్‌ఐ జి. రామకృష్ణ చెడు మార్గాల్లో తప్పిపోతున్న విద్యార్థులకు ఈ పల్లె ప్రతిభా కేంద్రం వెలుగు, దిక్సూచీగా పని చేస్తుందని పేర్కొన్నారు. కిల్లాడ సత్యనారాయణ వంటి నిరాడంబర వ్యక్తి గ్రామీణ విద్యార్థుల అభ్యున్నత కోసం ఎంతో కృషి చేస్తున్నారని విద్యార్థులు అవకాశాన్ని వినియోగించుకుని బాగా చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు.