logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

నంద్యాల బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా జి.వి.ఎన్. ప్రసాద్

నంద్యాల కోర్టు ప్రాంగణంలోని బార్ అసోసియేషన్ కార్యాలయంలో శనివారం జరిగిన నాలుగు ప్రధాన పోస్టుల ఎన్నికలు అత్యంత ఉత్కంఠభరితంగా, రసవత్తరంగా సాగాయి. మండుటెండను సైతం లెక్కచేయకుండా న్యాయవాదులు తమ ఓటు హక్కును వినియోగించుకోవడంతో ఏకంగా 90 శాతం పోలింగ్ నమోదైంది. నంద్యాల బార్ అసోసియేషన్ చరిత్రలో ఇంత భారీ స్థాయిలో పోలింగ్ జరగడం ఇదే ప్రథమమని ఎన్నికల అధికారులు వెల్లడించారు. సాయంత్రం వెలువడిన ఫలితాల్లో అధ్యక్ష పదవికి పోటీ చేసిన జి.వి.ఎన్. ప్రసాద్ తన ప్రత్యర్థి జి. రాంప్రసాద్‌పై 261 ఓట్ల భారీ మెజార్టీతో ఘనవిజయం సాధించి సత్తా చాటారు. మొత్తం 460 ఓట్లు పోల్ అవ్వగా, మెజారిటీ స్థానాల్లో విజేతలు ఏకపక్ష మెజార్టీలతో దూసుకుపోయారు. కోశాధికారి పదవికి జరిగిన పోటీలో ఎం. కృపావతి తన సమీప ప్రత్యర్థి ఏ. శ్రీదేవిపై 201 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించగా, జాయింట్ సెక్రటరీగా సయ్యద్ నూర్ అల్లం ఖాద్రి తన ప్రత్యర్థి డి. చిన్న లింగమయ్యపై 238 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. లైబ్రరీ సెక్రెటరీ స్థానానికి జరిగిన హోరాహోరీ పోరులో మద్దిలేటి తన ప్రత్యర్థి సి. కేసన్నపై 211 ఓట్ల మెజార్టీతో విజేతగా నిలిచారు. ఎన్నికల అధికారులుగా హుస్సేన్ భాష, తిరుపతి, ఎం.ఆర్. కృష్ణారెడ్డి, తాలంకి వెంకటప్రసాద్, కృష్ణ లింగమయ్య వ్యవహరించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రక్రియను ప్రశాంతంగా ముగించారు. గెలుపోటములతో సంబంధం లేకుండా న్యాయవాదులందరూ ఐకమత్యం చాటారని, ఈ విజయం న్యాయవాద కుటుంబానిదేనని అభ్యర్థులు ఈ సందర్భంగా ఆనందం వ్యక్తం చేశారు. విజేతలకు తోటి న్యాయవాదులు పూలమాలలతో ఘనస్వాగతం పలికి అభినందనలు తెలియజేశారు.

5
251 views

Comment