logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

యువత బాబు జగ్జీవన్ రామ్ ను ఆదర్శంగా తీసుకోవాలి: జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా.

నంద్యాల (AIMA MEDIA ): ఆదివారం నంద్యాల పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న విక్టోరియా రీడింగ్ రూమ్ వద్ద డా. బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఎన్.ఎం.డి. ఫరూక్, జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి కలిసి ఆయన విగ్రహానికి పుష్పమాలలు అర్పించి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాన్ని జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నంద్యాల సబ్ డివిజన్ ఏఎస్పీ ఎం. జావలి ఆల్ఫోన్స్, సాంఘిక సంక్షేమ అధికారి చింతామణి, మున్సిపల్ కమిషనర్ శేషన్న జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ, బాబు జగజ్జీవన్ రామ్ జీవితం సమాజానికి మార్గదర్శకమని పేర్కొన్నారు. అట్టడుగున ఉన్న వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన కృషి స్ఫూర్తిదాయకమని, యువత ఆయనను ఆదర్శంగా తీసుకొని లక్ష్యసాధన దిశగా ముందుకు సాగాలని సూచించారు. సమాజంలో కార్మిక చట్టాల ప్రాముఖ్యతను వివరిస్తూ, చట్టాల సహాయంతో సాధారణ వ్యక్తి కూడా ఉన్నత స్థాయికి ఎదగవచ్చని, దీనికి బాబూజీ జీవితం గొప్ప ఉదాహరణగా నిలుస్తుందని అన్నారు. ప్రస్తుతం వివిధ లేబర్ యూనియన్లు సమస్యల పరిష్కారంలో ఐక్యతతో ముందుకు రావడానికి కార్మిక చట్టాలే పునాది అని కలెక్టర్ పేర్కొన్నారు. అలాగే వ్యవసాయం మరియు ఆర్థిక అభివృద్ధిపై దృష్టి సారిస్తూ, రాయలసీమ ప్రాంతాన్ని హార్టికల్చర్ హబ్‌గా అభివృద్ధి చేయడం ద్వారా జీడీపీ వృద్ధి సాధ్యమవుతుందని, సుస్థిర వ్యవసాయం దిశగా ప్రణాళికాబద్ధ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ అభివృద్ధికి బాబూజీ హయాంలో జరిగిన హరిత విప్లవం పునాది వేసిందని, ఆ అవగాహనను మరింతగా విస్తరించుకోవాలని సూచించారు.బాబు జగజ్జీవన్ రామ్ సేవలను స్మరించుకుంటూ, 1971 ఇండో-పాక్ యుద్ధ సమయంలో రక్షణ మంత్రిగా ఆయన చూపిన నాయకత్వం దేశ చరిత్రలో చిరస్మరణీయమని, అలాగే రైల్వే శాఖా మంత్రిగా మరియు ఉప ప్రధానమంత్రిగా కూడా ఆయన విశిష్ట సేవలు అందించారని కలెక్టర్ కొనియాడారు. పుస్తక పఠనం, అనుభవజ్ఞులతో సంభాషణ మరియు పరిసరాల పట్ల అవగాహన ద్వారా ఆయన జ్ఞానాన్ని పెంపొందించుకుని అంచెలంచెలుగా ఎదిగారని తెలిపారు. సమాజంలోని ప్రతి వ్యక్తి దేశాభివృద్ధిలో భాగస్వామి కావాలన్నది ఆయన ఆకాంక్ష అని గుర్తుచేశారు. జీవితంలో ఎదురయ్యే చిన్న చిన్న ఆటంకాలను అధిగమించే ధైర్యం మరియు పట్టుదల ఉంటే ఎవరికైనా ఉన్నత స్థాయికి చేరుకోవడం సాధ్యమని పేర్కొన్నారు. ఈ సమావేశంలో కొమ్ముపాలెం శ్రీనివాసులు, మేకల లింగస్వామి, ఏ. చిన్న వెంకట సుబ్బయ్య, దండు వీరయ్య, ఎన్. లక్ష్మన్న, బి. బెనర్జీ, ఎస్. జీవన్ రాజ్, చెన్నమ్మ, రవికాంత్, సి.ఏం. శ్రీనివాసులు, జి. బాలస్వామి, జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు బాలనాగన్న, నాగరాజు, కాశన్న, దేవదానం, రవికాంత్ బాబు, వెంకటేష్ నాయక్, మురళి, కర్మచారి సంఘ సభ్యులు తదితరులు పాల్గొని ప్రసంగించారు.

0
787 views

Comment