అమరావతి బిల్లు ఆమోదం చారిత్రాత్మక ఘట్టం: నియోజకవర్ వాణిజ్య విభాగం అధ్యక్షులు వల్లూరి గణేష్
విజయనగరం జిల్లా.రాజాం.
రాష్ట్ర రాజధాని అమరావతి చట్టబద్ధత బిల్లు ఆమోదం పొందడం చారిత్రాత్మక ఘట్టమని, ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలకు న్యాయం చేసిన శుభపరిణామమని రాజాం నియోజకవర్గ వాణిజ్య విభాగం అధ్యక్షులు, ఎంపీటీసీ వల్లూరు గణేష్ అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టి, పట్టుదల వల్లే ఈ విజయాన్ని సాధించగలిగామని ఆయన పేర్కొన్నారు.
గురువారం సంతకవిటిలో మాట్లాడుతూ, ఈ బిల్లుకు మద్దతు తెలిపి ఆమోదానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అమరావతి రాష్ట్ర ప్రజల స్వాభిమానానికి ప్రతీకగా నిలిచిందని, ఇకపై ఇది అభివృద్ధి పథంలో మరింత వేగంగా ముందుకు సాగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
ప్రజా రాజధానిగా అమరావతిలో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు కల్పించి, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే లక్ష్యమని ఆయన చెప్పారు. ఈ దిశగా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా అందిస్తున్న సహకారం అభినందనీయమని కొనియాడారు.
అమరావతికి దక్కిన ఈ గౌరవం ప్రతి ఆంధ్రప్రదేశ్ ప్రజల విజయం అని, ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ వల్లూరు గణేష్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు.