రాజ్యసభ ఆమోదంతో అమరావతికి చట్టబద్ధత – నెల్లూరులో ఘన వేడుకలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతికి రాజ్యసభ ఆమోదంతో చట్టబద్ధత లభించడం చారిత్రాత్మక ఘట్టంగా నిలిచిందని జనసేన పార్టీ నాయకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా నెల్లూరు నగరంలోని ఆత్మకూరు బస్టాండ్ సెంటర్ వద్ద అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద పార్టీ నాయకులు, కార్యకర్తలు దీపాలు వెలిగించి, బాణసంచా కాల్చుతూ సంబరాలు నిర్వహించారు.
“అమరావతి ఒక్కటే రాష్ట్ర రాజధాని” అనే నినాదంతో నాయకులు తమ మద్దతును వ్యక్తం చేశారు. అమరావతి అభివృద్ధి కోసం ఎన్ని ఆటంకాలు వచ్చినా వెనుకడుగు వేయకుండా పోరాడిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారి పాత్ర ప్రశంసనీయమని వారు తెలిపారు.
రాజధాని నిర్మాణంలో రైతులు స్వచ్ఛందంగా భూములు ఇవ్వడం చారిత్రాత్మకమని, అది భవిష్యత్ తరాల అభివృద్ధి దృష్ట్యా తీసుకున్న నిర్ణయమని గుర్తుచేశారు. అమరావతికి చట్టబద్ధత కల్పించే దిశగా లోకసభ, రాజ్యసభల్లో ఆమోదం రావడం రాష్ట్ర అభివృద్ధికి దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు.
ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణలకు కృతజ్ఞతలు తెలిపారు.
ఇక “మూడు రాజధానులు” ప్రతిపాదనపై వారు విమర్శలు వ్యక్తం చేస్తూ, రాష్ట్రంలో గందరగోళం సృష్టించే విధానాలను ప్రజలు తిరస్కరిస్తారని అన్నారు.
ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ తో పాటు నూనె మల్లికార్జున యాదవ్, చిట్టమూరి ప్రవీణ్ రెడ్డి, పప్పు నారాయణ, జమీర్, శివకృష్ణ, సాయి, హేమచంద్ర, నాగేంద్రబాబు, శరవణన్, సుధా మాధవ్, పేనేటి శ్రీకాంత్, గుత్తి శ్రీకాంత్, వర్షన్, ప్రతాప్, సురేష్, కరీం, ప్రసన్న, ఉదయ్, కృష్ణవేణి, మోపురు నందిని, లత, ప్రవళిక, రుక్మిణి తదితరులు పాల్గొన్నారు.