అక్రమ సంబంధం కోసం అమానుషం… భార్య, ఇద్దరు కుమారులను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించిన భర్త*
జర్నలిస్టు: మాకోటి మహేష్
*అక్రమ సంబంధం కోసం అమానుషం… భార్య, ఇద్దరు కుమారులను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించిన భర్త*
హైదరాబాద్ నగరంలోని మూసాపేట పరిసర ప్రాంతంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నారని భావించి కట్టుకున్న భార్యతో పాటు ఇద్దరు చిన్న కుమారులను హత్య చేసి, అనంతరం ఆ ఘటనను ఆత్మహత్యగా చిత్రీకరించిన దారుణ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం బోడ మాణిక్యం తండాకు చెందిన బోడ స్రవంతి–ప్రవీణ్ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. బోడ ప్రవీణ్, అదే తండాకు చెందిన బానోతు బద్రి–బిఖ్యా దంపతుల రెండో కుమార్తె స్రవంతిని ప్రేమ వివాహం చేసుకున్నారు. దాదాపు 14 సంవత్సరాల పాటు వారి దాంపత్య జీవితం సజావుగా సాగినప్పటికీ, గత రెండు సంవత్సరాలుగా ప్రవీణ్ మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని భార్యను చిత్రహింసలకు గురి చేస్తున్నట్లు సమాచారం.
ఇదే క్రమంలో ఆ మహిళను రెండో వివాహం చేసుకున్న ప్రవీణ్, భార్యతో తరచూ గొడవలు పడుతూ దూరంగా ఉండేవాడు. కుటుంబ పెద్దలు పలుమార్లు పంచాయతీ నిర్వహించినప్పటికీ అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. రెండు రోజుల క్రితం నర్సంపేట ప్రాంతంలో మరోసారి పంచాయతీ జరగగా, ఇకముందు ఎలాంటి సంఘటనలు జరిగినా పూర్తి బాధ్యత తనదేనని ఒప్పుకొని, బాండ్ పేపర్ రాసి భార్యను తనతో తీసుకెళ్లాడు.
అయితే ఇదంతా ముందే పథకం ప్రకారమే జరిగిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సోమవారం హైదరాబాద్‌కు వెళ్లిన అనంతరం, మంగళవారం రాత్రి భార్యను చిత్రహింసలకు గురిచేసి, బిర్యానీలో విషం కలిపి ఇద్దరు కుమారులతో పాటు భార్యను హత్య చేసినట్లు ప్రాథమిక సమాచారం. అనంతరం వారిని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.