logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

"పైసలు మావి.. డేటా మీదా?" – టెలికాం కంపెనీల 'కట్-ఆఫ్' విధానంపై సామాన్యుల ఆగ్రహం

​హైదరాబాద్: సెల్ ఫోన్ రీచార్జ్ ధరలు ఆకాశాన్ని తాకుతున్న వేళ, టెలికాం కంపెనీలు అనుసరిస్తున్న 'డేటా గడువు' విధానంపై సామాన్యుల నుండి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. "డబ్బులు చెల్లించి కొన్న డేటా మా ఇష్టం వచ్చినప్పుడు వాడుకునే వీలు లేకుండా, రాత్రి 12 అవ్వగానే తుడిచిపెట్టుకుపోవడం ఏ రకమైన న్యాయం?" అని వినియోగదారులు ప్రశ్నిస్తున్నారు.
​రోజువారీ పరిమితితో తలనొప్పులు
​ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న దాదాపు అన్ని ప్లాన్లు రోజుకు 1.5GB లేదా 2GB పరిమితితో వస్తున్నాయి. అయితే, ఆ రోజంతా పనిలో ఉండి డేటా వాడకపోయినా, లేదా సిగ్నల్ సరిగ్గా లేక ఉపయోగించుకోలేకపోయినా.. ఆ డేటా మరుసటి రోజుకు కలవదు. "మేము కొన్న వస్తువు మిగిలిపోతే అది మాదే కదా? కానీ ఇక్కడ కంపెనీలు మాత్రం తిరిగి తీసేసుకుంటున్నాయి" అని ఒక చిరుద్యోగి తన ఆవేదన వ్యక్తం చేశారు.
​సామాన్యుల ప్రధాన ప్రశ్నలు:
​డేటా రోల్‌ఓవర్ ఎందుకు లేదు?: పోస్ట్‌పెయిడ్ ప్లాన్లలో మిగిలిన డేటా వచ్చే నెలకు యాడ్ అవుతున్నప్పుడు, ప్రీపెయిడ్ వాడుతున్న మెజారిటీ సామాన్యులకు ఆ అవకాశం ఎందుకు ఇవ్వడం లేదు?
​రీచార్జ్ ధరల భారం: ఇప్పటికే టెలికాం కంపెనీలు టారిఫ్ ధరలను పెంచేశాయి. ఈ పెరిగిన ధరలకు తోడు, సగం డేటా వాడకముందే వృథా అయిపోవడం వల్ల సామాన్యులు రెట్టింపు నష్టపోతున్నారు.
​కంపెనీల చాకచక్యం: నెలవారి డేటా పరిమితి కాకుండా, రోజువారీ పరిమితి పెట్టడం వల్ల వినియోగదారులు తమకు అవసరమైనప్పుడు డేటాను పూర్తిగా వాడుకోలేకపోతున్నారని విమర్శలు వస్తున్నాయి.
​పెట్రోల్ లాగే డేటా కూడా..
​పెట్రోల్ బంక్‌లో లీటర్ పెట్రోల్ పోయించుకుంటే, అది వాడనంత కాలం ట్యాంకులోనే ఉంటుంది తప్ప ఎవరూ వెనక్కి తీసుకోరు. కానీ డేటా విషయంలో మాత్రం టెలికాం కంపెనీలు 'పెయిడ్ డేటా'ను రీసెట్ చేయడం దోపిడీ కిందికే వస్తుందని ప్రజలు భావిస్తున్నారు.
​నియంత్రణ సంస్థ (TRAI) పట్టించుకోవాలి
​ప్రభుత్వం టెలికాం నియంత్రణ సంస్థ (TRAI) ఈ అంశంపై స్పందించాలని ప్రజలు కోరుతున్నారు. విద్యుత్ బిల్లు లాగే, ఎంత డేటా వాడితే అంతే డబ్బులు కట్ అయ్యేలా లేదా మిగిలిన డేటా వాలిడిటీ ఉన్నంత కాలం వాడుకునేలా నిబంధనలు మార్చాలని డిమాండ్ చేస్తున్నారు.

21
1253 views

Comment