logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ఇళ్ల స్థలాలు ఇచ్చేవరకు పోరాటం కొనసాగిస్తాం – సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు

ఇళ్ల స్థలాలు ఇచ్చేవరకు పోరాటం కొనసాగిస్తాం – సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు

కలెక్టరేట్ ఎదుట భారీ ధర్నా – పెద్ద ఎత్తున పాల్గొన్న వెలుగుమట్ల నిర్వాసితులు

సీపీఐ(ఎం) బృందంతో అదనపు కలెక్టర్ చర్చలు – అర్హులందరికీ స్థలాలిస్తామని హామీ

ఖమ్మం (31.03.2026):
వెలుగుమట్ల ప్రాంతంలో ఇండ్లు కోల్పోయిన పేదలందరికీ ఇళ్ల స్థలాలు, ఇండ్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ(ఎం) ఖమ్మం డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం ఖమ్మం కలెక్టరేట్ ఎదుట భారీ ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో మహిళలు, వృద్ధులు, చిన్నపిల్లలు సహా వందలాది కుటుంబాలు పాల్గొన్నారు. ధర్నా చౌక్‌లో జరిగిన సభలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు మాట్లాడుతూ, వెలుగుమట్ల భూదాన్ భూముల నుండి పేదలను వారి నివాస ప్రాంతాల నుండి తొలగించి, ఇప్పటికీ సరైన పునరావాసం కల్పించకపోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. నెలల తరబడి నిర్వాసితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ఇళ్ల స్థలాలు ఇచ్చేవరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ధర్నాలో పాల్గొన్న నిర్వాసితులు తమ సమస్యలను వెల్లడిస్తూ, తాత్కాలిక షెడ్లలో, అద్దె ఇళ్లలో జీవనం సాగిస్తున్నామని, పిల్లల చదువులు దెబ్బతింటున్నాయని, జీవనోపాధి కోల్పోయామని తెలిపారు. వెంటనే ఇళ్ల స్థలాలు, ఇండ్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. అనంతరం ధర్నా చౌక్ నుండి కలెక్టరేట్ ప్రధాన గేటు వరకు భారీ ప్రదర్శనగా వెళ్లి గేటు వద్ద ఆందోళన నిర్వహించారు. తరువాత సీపీఐ(ఎం) ప్రతినిధి బృందంతో ఖమ్మం అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గంటపాటు చర్చలు జరిపారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ మొత్తం 729 కుటుంబాలు ఇండ్లు కోల్పోయినట్లు గుర్తించామని తెలిపారు. అందులో 300 మందికి ఇప్పటికే ఇళ్ల స్థలాలు కేటాయించామని, మరికొందరికి వారి స్వగ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసినట్లు చెప్పారు. అయితే కేటాయింపుల్లో కొన్ని లోపాలు ఉన్నాయని, అనర్హులు కూడా లబ్ధి పొందిన అంశాలు తమ దృష్టికి వచ్చాయని తెలిపారు. వాటిపై పునఃపరిశీలన (రీ-ఎంక్వయిరీ) నిర్వహిస్తున్నామని చెప్పారు. 729 కుటుంబాల జాబితాను సీపీఐ(ఎం) పార్టీకి అందజేస్తామని, అందులో అర్హులు తప్పిపోయి ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఒక నెలలో పూర్తిస్థాయిలో విచారణ పూర్తి చేసి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అదనపు కలెక్టర్ హామీతో కలెక్టరేట్ గేటు వద్ద కొనసాగుతున్న ఆందోళనను నిర్వాసితులు తాత్కాలికంగా విరమించారు. సమస్య పరిష్కారం కాకపోతే మరింత ఉధృతంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని సీపీఐ(ఎం) నేతలు హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) ఖమ్మం డివిజన్ కార్యదర్శి వై. విక్రమ్, జిల్లా కమిటీ సభ్యులు బండారు రమేష్, షేక్ మీరా సాహెబ్, ఎస్. నవీన్ రెడ్డి, మండల కార్యదర్శులు షేక్ నాగులు మీరా, బోడపట్ల సుదర్శన్, డివిజన్ నాయకులు బేగం, భాగం అజిత, ఏవి రెడ్డి, కూచిపూడి నరేష్ తదితరులు పాల్గొన్నారు.

62
6273 views

Comment