మున్సిపల్ అభివృద్ధికి పెద్దపీట: రూ. 158 కోట్లతో ఆదిలాబాద్ మున్సిపల్ బడ్జెట్ ప్రతిపాదనలు
పత్రికా ప్రకటన
మార్చి 31, 2026_ఆదిలాబాదు:
మున్సిపల్ అభివృద్ధికి పెద్దపీట: రూ. 158 కోట్లతో ఆదిలాబాద్ మున్సిపల్ బడ్జెట్ ప్రతిపాదనలు
పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని జిల్లా కలెక్టర్ రాజర్షిషా అన్నారు. మంగళవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ సమావేశాన్ని మున్సిపల్ చైర్ పర్సన్ బండారి అనూష తో కలిసి ఆయన నిర్వహించారు.
ఈ సమావేశంలో రాబోయే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయ వ్యయాలపై సుదీర్ఘంగా చర్చించి, మొత్తం రూ. 157.97 కోట్లతో (సుమారు రూ. 158 కోట్లు) అంచనా ఆదాయ వ్యయాలకు కౌన్సిల్ ఆమోదంతో ప్రతిపాదనలు సిద్ధం చేయడం జరిగిందన్నారు.
ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, మున్సిపాలిటీ పురోభివృద్ధిలో బడ్జెట్ అత్యంత కీలకమని, గత ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న లక్ష్యాలను ఎంతవరకు చేరుకున్నామో సమీక్షించుకుంటూ, కొత్త సంవత్సరానికి తగిన ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. మున్సిపాలిటీ ఆదాయ వనరులను పెంచుకోవడంతో పాటు, అనవసర ఖర్చులను తగ్గించుకోవాలని కలెక్టర్ సూచించారు. మున్సిపాలిటీలో పారిశుధ్యం, మంచినీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ వంటి మౌలిక సదుపాయాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. అమృత్ పథకం కాలపరిమితిని మరో ఏడాది పొడిగించినట్లు, దీని ద్వారా పెండింగ్‌లో ఉన్న డ్రైనేజీ, మంచినీటి పనులను పూర్తి చేస్తామని తెలిపారు. పారిశుధ్య నిర్వహణలో భాగంగా కార్మికుల జీతాలు, వాహనాల నిర్వహణ కోసం బడ్జెట్‌లో తగిన నిధులు కేటాయించినట్లు వివరించారు. గ్రీన్ బడ్జెట్ కింద మున్సిపల్ చట్టం ప్రకారం 10% నిధులను పచ్చదనం పెంచడానికి కేటాయించడం జరిగిందన్నారు. ప్రభుత్వ గ్రాంట్లు, మున్సిపల్ సొంత ఆదాయం మధ్య సమతుల్యత పాటిస్తూ పారదర్శకమైన బడ్జెట్‌ను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. కౌన్సిల్ సభ్యులు బడ్జెట్ అంశాలపై చర్చించి, వార్డుల్లోని సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక అమలులో వార్డు కౌన్సిలర్లు చురుకైన పాత్ర పోషించాలని, జిల్లా యంత్రాంగం తరపున మున్సిపాలిటీకి పూర్తి సహకారం ఉంటుందని కలెక్టర్ హామీ ఇచ్చారు.
మున్సిపల్ చైర్ పర్సన్ మాట్లాడుతూ, వార్డుల వారీగా వెనుకబడిన ప్రాంతాలు, విలీన గ్రామాల్లో అభివృద్ధి పనుల కోసం బడ్జెట్ లో ప్రత్యేకంగా నిధులు కేటాయించినట్లు తెలిపారు. కొత్తగా విలీనమైన ప్రాంతాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు స్మశాన వాటికల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వనున్నామని, మున్సిపాలిటీకి వచ్చే ఆదాయ వనరులైన ఆస్తి పన్ను, నల్లా పన్ను ఖాళీ స్థలాల పన్ను వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. అందరి సహకారంతో పట్టణాన్ని మరింత అభివృద్ధి చేసుకుందామని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో కమిషనర్ రాజు, వైస్ చైర్మన్ రోహిత్, వార్డుల కౌన్సిలర్లు, మున్సిపల్, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.