నాయకుడి కోసం వేటు వేస్తే. మీ కుటుంబం వీధిన పడాల్సిందే.ఆళ్లగడ్డ తీర్పుతో తేలిన నగ్న సత్యం.
AIMA న్యూస్ బ్యూరో.నంద్యాల జిల్లా. రాజకీయ కక్షలు, పాత పగలు పచ్చని సంసారాల్లో ఎలా చిచ్చు పెడతాయో.ఆవేశంతో చేసే నేరాలు జీవితాలను ఎలా అంధకారంలోకి నెట్టేస్తాయో చెప్పడానికి నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం పెద్ద చింతకుంట గ్రామం. ఉదంతమే ఒక సజీవ సాక్ష్యం. దాదాపు 14 ఏళ్ల క్రితం జరిగిన ఫ్యాక్షన్ గొడవల్లో నంద్యాల మూడవ అదనపు జిల్లా జడ్జి అమ్మన్న రాజా చారిత్రాత్మక తీర్పునిచ్చారు. 12 మంది నిందితులకు జీవితకాల కారాగార శిక్ష విధిస్తూ న్యాయస్థానం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు రాయలసీమ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.ఆనాడు రక్తం ఏరులై పారింది.2012 సంవత్సరంలో పెద్ద చింతకుంటలో జరిగిన ఆ దాడి సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేసింది. రాజకీయ ప్రత్యర్థులు ఒక్కసారిగా విరుచుకుపడి ఇంజేటి కృష్ణారెడ్డి ఇంటిని రక్తసిక్తం చేశారు. ఆ దారుణకాండలో
కృష్ణారెడ్డి.ఆయన భార్య గోవిందమ్మ. పెద్ద కుమారుడు మల్లికార్జున రెడ్డి,
మామ రామ సుబ్బారెడ్డి, ఇంటి పనిమనిషి.దారుణంగా హత్యకు గురయ్యారు. నాలుగు ప్రాణాలు గాలిలో కలిసిపోవడం ఆనాడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.ఈ కేసులో పోలీసులు 19 మందిని నిందితులుగా చేర్చారు. సుదీర్ఘ కాలం పాటు సాగిన ఈ విచారణలో ఏడుగురు నిందితులు కాలగర్భంలో కలిసిపోయారు. మిగిలిన 12 మందిపై నేరం రుజువు కావడంతో, వారు తమ జీవితాంతం జైలు గోడల మధ్యే గడపాలని కోర్టు స్పష్టం చేసింది.
నాయకుల కోసం ప్రాణాలు తీస్తే. మీ కుటుంబాల పరిస్థితి ఏంటి.
ఈ తీర్పు ప్రస్తుతం ఫ్యాక్షన్ నీడలో ఉన్నవారికి ఒక గట్టి హెచ్చరిక. నాయకుల మాటలు నమ్మి, వారి అండ చూసుకుని చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారు ఒక్కసారి ఆలోచించాలి.
నాయకుడు బాగుంటాడు.కార్యకర్తే బలైపోతాడు.ఏ నాయకుడి స్వార్థం కోసం అయితే దాడులకు పాల్పడతారో, తీరా శిక్ష పడ్డాక ఆ నాయకులు ఏమీ చేయలేరు. మీరు జైలులో మగ్గుతుంటే, బయట నాయకులు తమ రాజకీయ లబ్ధిని చూసుకుంటూ విలాసవంతంగా గడుపుతారు.ఛిన్నాభిన్నమవుతున్న ఒక వ్యక్తి జైలుకు వెళ్తే అతడితో పాటు ఆ కుటుంబం మొత్తం శిక్ష అనుభవిస్తుంది. తండ్రి లేని పిల్లల భవిష్యత్తు, దిక్కులేని భార్యల వేదనను ఏ నాయకుడూ తీర్చలేడు. ఆర్థికంగా పతనం అవ్వడమే కాకుండా, సమాజంలో తలెత్తుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది.ఈ కేసులో చనిపోయిన వారు ఎలాగూ తిరిగి రారు.కానీ హంతకులుగా ముద్ర పడి జీవితకాలం జైలుకు వెళ్లిన వారి కుటుంబాలు కూడా ఇప్పుడు జీవచ్ఛవాల తో సమానమే. పగ ప్రతీకారాలు కేవలం స్మశానాలను, కన్నీళ్లను మాత్రమే మిగిలిస్తాయి.పెద్ద చింతకుంట తీర్పుతోనైనా ఫ్యాక్షన్ రాజకీయాలకు స్వస్తి పలకాలి. ఆవేశం ఆయుష్షును హరిస్తుందని, పగ జీవితాలను పతనం చేస్తుందని ప్రతి ఒక్కరూ గ్రహించాలి. చట్టం తన పని తాను చేసుకుపోతుందని, నేరం చేసిన వాడు ఎప్పటికైనా మూల్యం చెల్లించక తప్పదని ఈ తీర్పు నిరూపించింది.