ఆదాయం గోరంత.. ఖర్చు కొండంత..*
* రూ.140 కోట్లతో కొత్తగూడెం కార్పొరేషన్ బడ్జెట్ అంచనాలు..
* కొత్తగూడెం మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి,
తెలంగాణ స్టేట్** భద్రాద్రి కొత్తగూడెం జిల్లా** కొత్తగూడెం** మార్చి 30 **(ఏఐఎంఏ మీడియా ప్రతినిధి)
ఆదాయం గోరంత.. ఖర్చు కొండం
* రూ.140 కోట్లతో అంచనాలు.. అంకెల గారడీ బడ్జెట్
* నగర వాసులకు ప్రయోజనం శూన్యం...
* 60 డివిజన్లకు 96మంది స్వచ్ఛ ఆటో డ్రైవర్లు ఎందుకు..?
* పారిశుధ్య కార్మికుల వేతనాల్లో వ్యత్యాసం దేనికి..!?
* బడ్జెట్ ప్రవేశ పెట్టిన తీరు నిబంధనలకు విరుద్దం..
* కొత్తగూడెం మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి
కొత్తగూడెం :
కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ రూ.140 కోట్ల అంచనాతో ప్రవేశపెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్ అంకెల గారడీతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నమని, నగర వాసులకు ఒరిగేదేమీ లేదని మున్సిపల్ మాజీ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి తీవ్రంగా విమర్శించారు. సోమవారం మేయర్ గణేష్ అధ్యక్షతన కార్పొరేషన్ కార్యాలయంలో తొలిసారి నిర్వహించిన బడ్జెట్ సమావేశంపై ఆమె ధ్వజమెత్తారు. కాగితాలకే పరిమితమైన ఈ బడ్జెట్ కార్యరూపం దాల్చడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నగర అభివృద్ధికి అవసరమైన నిధులను సమకూర్చడంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 107 కోట్ల నిధులు వస్తాయని అంచనా వేస్తూ, 140 కోట్లతో బడ్జెట్ రూపొందించడం ప్రజలను తప్పుదోవ పట్టించే చర్య అని విమర్శించారు. ఈ నిధులు ఎలా సమకూరుతాయో స్పష్టత లేకపోవడం బడ్జెట్‌లో పెద్ద లోపమని పేర్కొన్నారు. కార్పొరేషన్‌లో ఆదాయం కేవలం రూ.33కోట్లు ఉందని, ఆదాయం పెంచే విధంగా ప్రణాళిక లేకుండా ప్రభుత్వ నిధులపై అంచనాలతో గారడి చేయడం సరికాదని, మున్సిపల్ ఆదాయ వనరుల్లో కీలకమైన ఆస్తిపన్ను బకాయిలను కనీసం 70 శాతం వసూలు చేసి ఖజానాలో జమ చేస్తేనే గ్రాంట్లు అందే అవకాశం ఉందని గుర్తు చేశారు. అయితే ఈ అంశంలో నిర్లక్ష్యం కారణంగా నగరానికి రావాల్సిన నిధులు కూడా అందకపోతున్నాయని అన్నారు. అలాగే ఎన్నికల్లో కార్పొరేటర్లు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కదానికి సరైన నిధుల కేటాయింపులు లేవని, కోతులు, కుక్కల సమస్యల పరిష్కారానికి సరైన ప్రణాళిక లేదని, కనీసం ఈ ప్రధాన సమస్యపై సమావేశంలో అంశాన్ని కూడా చేర్చలేదని విమర్శించారు. అలాగే సమావేశంలో ప్రవేశపెట్టిన 16, 17, 18, 19 అంశాలు ఎవరికి ప్రయోజనం కోసమని ప్రశ్నించారు.
*బడ్జెట్ ప్రవేశ పెట్టిన తీరు నిబంధనలకు విరుద్దం..*
మున్సిపల్ కార్పొరేషన్ నిబంధనల ప్రకారం వరుసగా మూడు వర్కింగ్ రోజుల్లో మాత్రమే బడ్జెట్ సమావేశం నిర్వహించాలని, కానీ ఒక రోజు ఆదివారం కాగా, సోమవారం వర్కింగ్ డే, మంగళవారం మహవీర్ జయంతి సందర్భంగా ఆప్షనల్ హాలిడే ఉండగా, సమావేశం ఎలా నిర్వహిస్తారని, ఇది ఖచ్చితంగా నిబంధనలకు విరుద్దమన్నారు. హడావుడిగా బడ్జెట్ సమావేశం పెట్టడం వెనుక ఆంతర్యమేమిటని ప్రశ్నించారు.
*పారిశుధ్య కార్మికుల వేతనాల్లో వ్యత్యాసం దేనికి..?*
కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్‌లో పాల్వంచ, కొత్తగూడెం, సుజాతనగర్ కలిపి 341 మంది పారిశుధ్య కార్మికులు పనిచేస్తున్నారని, వారిలో పాల్వంచలో పనిచేస్తున్న 137 మందిలో 133మందికి 20,460 ఇస్తుండగా, కొత్తగూడెంలో 175మంది, సుజాతనగర్‌లో 29మంది పనిచేస్తుండగా, వారికి మాత్రం 19,298 వేతనాలు ఇవ్వడం దేనికి అని ప్రశ్నించారు. వారు అందరూ చేస్తున్న పని ఒక్కటే అయినప్ప్పుడు పాల్వంచ వారికి ఎక్కువ, మిగతా ప్రాంతాల వారికి తక్కువగా ఇవ్వడం వెనుక ఉన్న మతలబు ఏమిటో వివరించాలని ప్రశ్నించారు. అదే విధంగా 60 డివిజన్లు ఉన్న కార్పొరేషన్‌లో 96 మంది స్వచ్ఛ ఆటో డ్రైవర్లు ఎందుకని, అదనపు సిబ్బంది పేరిట నిధుల దుర్వినియోగం చేస్తూ ఎవరి ఖాతాలో వేస్తున్నారో బహిరంగంగా చెప్పాలని డిమాండ్ చేశారు.
అదేవిధంగా కార్యాలయ ఖర్చులు, ఉద్యోగుల జీతభత్యాలు, ఇతర వ్యయాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఈ బడ్జెట్‌లో “సమాన పనికి సమాన వేతనం” అమలు చేస్తే, పాలక ప్రభుత్వాల నుంచి సరైన మద్దతు లేకపోతే ఆర్థిక భారాన్ని తట్టుకోవడం కష్టమని పేర్కొన్నారు. మొత్తంగా ఈ బడ్జెట్ నగర వాసుల ఆశలను నెరవేర్చే విధంగా లేకపోవడం బాధాకరమని, ప్రజల అవసరాలకు అనుగుణంగా పారదర్శకంగా నిధుల వినియోగం జరగాలని కాపు సీతాలక్ష్మి డిమాండ్ చేశారు.