logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

అమరావతి అసెంబ్లీ తీర్మానం: అభివృద్ధి వ్యూహమా? రాజకీయ డ్రామాలా? – ఎమ్మెల్సీ ఇసాక్ బాష


నంద్యాల,మార్చి 30,AIMA రిపోర్టర్ ఆర్ఎన్ రెడ్డి:

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అమరావతి అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు కూటమి ప్రభుత్వం 2028 నాటికి రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేస్తామని ప్రకటిస్తుండగా, మరోవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) దీనిని “డైవర్షన్ పాలిటిక్స్”గా అభివర్ణిస్తోంది. ఈ నేపథ్యంలో నేడు నంద్యాలలోని వైసీపీ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఇసాక్ బాష అధ్యక్షతన రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఇసాక్ బాష మాట్లాడుతూ, అమరావతి అంశంపై ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన అసెంబ్లీ తీర్మానం పలు అనుమానాలకు తావిస్తున్నదని అన్నారు. అధికారంలో ఉండి ఎటువంటి అడ్డంకులు లేకపోయినా, తీర్మానాల పేరుతో కాలయాపన చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయని పేర్కొన్నారు. 2028 గడువు విధిస్తూ రాజధాని నిర్మాణంపై ప్రకటనలు చేస్తూనే, “రాజధానిని ఎవరైనా మార్చేస్తారు” అనే ప్రచారం చేయడం కూటమి ప్రభుత్వానికి తమపై నమ్మకం లేదనే సంకేతమని ఆరోపించారు. అమరావతి నిర్మాణానికి భారీగా ఖర్చులు అంచనా వేస్తున్నారని, మొదటి దశకే లక్ష కోట్ల రూపాయలు, రెండో దశకు మరో రూ.50 వేల కోట్లు కలిపి దాదాపు రూ.2 లక్షల కోట్ల భారం రాష్ట్రంపై పడే అవకాశముందని అన్నారు. ఇంత భారీ వ్యయాన్ని రాష్ట్రం భరించగలదా అనే ప్రశ్నను ఆయన లేవనెత్తారు. టెండర్ల వ్యవహారంలో పారదర్శకత లేదని, చదరపు అడుగుకు రూ.11 వేల వరకు ఖర్చు చూపించడం వెనుక ఉద్దేశ్యం ఏమిటో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. 4 శాతం ఎక్సెస్‌తో తమ అనుచరులకే కాంట్రాక్టులు కట్టబెడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయని విమర్శించారు. అమరావతిలో అభివృద్ధి కనిపించడం లేదని, ప్లాట్లు ఎక్కడున్నాయో తెలియని పరిస్థితి, రహదారుల లేమి వంటి సమస్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. రైతులను అమరావతి పేరుతో మభ్యపెడుతున్నారని ఆరోపించారు. “సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్” అని చెప్పుకుంటూనే రూ.47 వేల కోట్ల అప్పులు చేయడం, రూ.5 వేల కోట్ల మొబిలైజేషన్ అడ్వాన్స్‌లు ఇవ్వడం అనుమానాస్పదమని అన్నారు. అమరావతి నిజంగా ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తుందా, లేక అవినీతికి కేంద్రంగా మారుతుందా అన్నది ప్రజలు గమనిస్తున్నారని వ్యాఖ్యానించారు. రెండో విడత ల్యాండ్ పూలింగ్ వెనుక అసలు ఉద్దేశ్యం ఏమిటో ప్రభుత్వం వెల్లడించాలని డిమాండ్ చేశారు. లక్షల కోట్ల వ్యయం, పెరుగుతున్న అప్పులు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గోపవరం సాయినాథ్ రెడ్డి, రామలింగారెడ్డి, రాష్ట్ర అగ్రికల్చర్ జాయింట్ సెక్రటరీ రత్నబాబు చౌదరి, రాష్ట్ర మహిళా విభాగం సెక్రటరీ శశికళ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ మాభూన్నిసా, జిల్లా ఉపాధ్యక్షుడు దాల్మిల్ అమీర్, జిల్లా అధికార ప్రతినిధి అనిల్ అమృతరాజ్, మున్సిపల్ విభాగం అధ్యక్షుడు టైలర్ శివ, లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు రామసుబ్బయ్య, మేధావుల సంఘం అధ్యక్షుడు రసూల్ ఆజాద్, జిల్లా సెక్రటరీలు దేవనగర్ బాషా, శివ నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

6
224 views

Comment