వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆధ్వర్యంలో కోవూరులో రైతుల సమస్యలపై మంత్రి సమీక్ష
రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కోవూరు మండలంలోని లేగుంటపాడు గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన స్వయంగా సందర్శించారు. క్షేత్రస్థాయిలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను సమీక్షిస్తూ, రైతులతో నేరుగా మాట్లాడి అధికారుల పనితీరు, మిల్లర్ల సహకారంపై వివరాలు తెలుసుకున్నారు.
ధాన్యం సేకరణలో గోనె సంచుల కొరత, మిల్లులకు తరలించేందుకు లారీల కొరత వంటి ప్రధాన సమస్యలను రైతులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఈ సమస్యలపై స్పందించిన మంత్రి, ఇకపై గోనె సంచుల కొరత ఉండకుండా సరిపడా సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే రైతులు తమకు నచ్చిన మిల్లుకు ధాన్యాన్ని తరలించుకునే స్వేచ్ఛ ఉంటుందని తెలిపారు. 22 శాతం వరకు తేమ ఉన్నా గిట్టుబాటు ధర కల్పిస్తామని ఆయన భరోసా ఇచ్చారు.
కోవూరు నియోజకవర్గం వ్యవసాయాధారిత ప్రాంతమని, ముఖ్యంగా డెల్టా రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను మంత్రి దృష్టికి తీసుకెళ్లగా, ఆయన సానుకూలంగా స్పందించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా మార్కెటింగ్, పౌరసరఫర, వ్యవసాయ శాఖలకు చెందిన అధికారులు, రైతులు, అలాగే స్థానిక తెలుగుదేశం మరియు కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.