తెలుగువాడి ఆత్మగౌరవానికి 44 ఏళ్లు. పసుపు జెండా.ప్రగతికి అజెండా.
AIMA న్యూస్ బ్యూరో. అమరావతి: తెలుగువాడి ఆత్మగౌరవం తలవంచదు దశాబ్దాల క్రితం మారుమోగిన ఈ సింహనాదం భారత రాజకీయాల్లో ఒక నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. ప్రాంతీయ అస్తిత్వాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్లి, ఢిల్లీ పీఠాన్ని సైతం కదిలించిన ఘనత తెలుగుదేశం పార్టీది. నేడు ఆదివారం రోజున 44వ ఏట అడుగుపెడుతున్న తరుణంలో, ఆ పసుపు జెండా ప్రస్థానం. కేవలం ఒక రాజకీయ పార్టీ ప్రయాణం మాత్రమే కాదు, అది తెలుగు జాతి పునర్వైభవానికి ప్రతీక.
అగ్ర నాయకత్వానికి వేదిక
తెలుగుదేశం పార్టీ కేవలం ఒక రాజకీయ పక్షం మాత్రమే కాదు, అదొక రాజకీయ పాఠశాల. నాయకత్వ నిర్మాణ. వెనుకబడిన వర్గాలకు, సామాన్య కార్యకర్తలకు రాజకీయ ఓనమాలు నేర్పి, వారిని శాసనసభ్యులుగా, మంత్రులుగా తీర్చిదిద్దిన ఘనత ఈ పార్టీకే దక్కుతుంది.సమాజంలో అణగారిన వర్గాలకు రాజకీయ గుర్తింపునిచ్చి, మహి ముఖ్యంగా బీసీలను చట్టసభలకు పంపిన తొలి పార్టీ తెలుగుదేశం.నేడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ, జాతీయ స్థాయిలోనూ చక్రం తిప్పుతున్న ఎంతో మంది అగ్రశ్రేణి నాయకులు తెలుగుదేశం రాజకీయ పాఠశాల లో రాటుదేలిన వారే. సామాన్యుడిని సైతం అసమాన్య నాయకుడిగా మార్చడమే ఈ పార్టీ ప్రత్యేకత.
చరిత్ర సృష్టించిన చైతన్య రథం
1982 మార్చి 29న విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు తెలుగుదేశం ను స్థాపించినప్పుడు అది ఒక రాజకీయ సంచలనం. కేవలం 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి, అప్రతిహత విజయంతో దేశ రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరిచారు. ఆనాడు ఎన్టీఆర్ ఇచ్చిన ఆత్మగౌరవ నినాదం సామాన్యుడి గుండెల్లో ఒక బలమైన ముద్ర వేసింది.
దేశ రాజకీయాల్లో నూతన అధ్యాయం.తెలుగుదేశం పార్టీ భారత రాజకీయాల్లో అనేక తొలి ప్రక్రియలకు వేదికైంది. లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్షంగా నిలిచిన మొట్టమొదటి ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం. ఎన్టీఆర్ మరణం తర్వాత ఆయన అల్లుడు నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ఐటీ రంగంలో రాష్ట్రాన్ని ప్రపంచ పటంలో నిలబెట్టి, నవ్యాంధ్ర నిర్మాణానికి పునాదులు వేశారు.
నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటులో కీలక పాత్ర పోషించి, కేంద్ర ప్రభుత్వాల ఏర్పాటులో నిర్ణయాత్మక శక్తిగా నిలిచింది.రెండు కళ్లు
పేదవాడికి రెండు రూపాయల కిలో బియ్యం, పక్కా ఇళ్లు, జనతా వస్త్రాల నుంచి నేటి అమరావతి నిర్మాణం, సంక్షేమ పథకాల వరకు. తెలుగుదేశం ఎప్పుడూ అభివృద్ధిని, సంక్షేమాన్ని సమతూకంలో నడిపించింది.
సమాజమే దేవాలయం - ప్రజలే దేవుళ్లు అన్న ఎన్టీఆర్ ఆశయం పునాదిగా.ప్రజా సేవలో నిరంతరం చంద్రబాబు దార్శనికత తోడై, నేడు యువ నాయకుడు లోకేష్ నాయకత్వంతో పార్టీ నవశకాన్ని లిఖిస్తోంది. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా, కుట్రలు జరిగినా తెలుగువారి ఆత్మగౌరవం అనే నినాదం మసకబారలేదు. 44 ఏళ్ల ఈ సుదీర్ఘ ప్రయాణంలో తెలుగుదేశం పార్టీ తెలుగు నేల మీద చెరగని ముద్ర వేసింది. ఎందరో నాయకులను దేశానికి అందిస్తూ, తెలుగువారి గొంతుకను ఢిల్లీ పీఠం వరకు బలంగా వినిపిస్తూనే ఉంది.