మహిళల భద్రత కోసం, ముఖ్యంగా విద్యార్థినుల్లో
ఆత్మవిశ్వాసం పెంచడానికి ఒక వినూత్నమైన ఆలోచనతో “పోలీస్ అక్క” పేరిట నిర్మల్ జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో కొనసాగుతున్న స్ఫూర్తిదాయకమైన కార్యక్రమానికి జాతీయ స్థాయిలో స్కోచ్ (SKOCH) అవార్డు లభించడం తెలంగాణకు గర్వకారణమని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు పేర్కొన్నారు.
❇️ ఢిల్లీ వేదికగా ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డును అందుకున్న నిర్మల్ జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జానకి షర్మిల గారికి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు అభినందనలు తెలిపారు. కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా మహిళల భద్రతపై అవగాహన కల్పించే విధంగా శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా దాదాపు 7 వేల మంది విద్యార్థినులు, మహిళలకు అవగాహన కల్పించడం ప్రశంసనీయమని అన్నారు.
❇️ నిర్మల్ లో నిర్వహించిన "పోలీస్ అక్క" కార్యక్రమం యావత్ పోలీసు యంత్రాంగానికి మంచి ప్రేరణగా నిలుస్తుందని కొనియాడారు. సమస్య ఎదురైనప్పుడు దాన్ని ఎలా ఎదుర్కోవాలన్న అంశంపై మహిళా పోలీసు అధికారులు పోలీస్ అక్కలుగా మారి మహిళలు, బాలికలకు ఆత్మవిశ్వాసం కల్పించడం అభినందనీయమన్నారు.