విద్యార్థినుల సాధికారతకు ఆత్మరక్షణ శిక్షణ ఒక గొప్ప వేదిక:
జిల్లా కలెక్టర్ రాజర్షి షా
పత్రికా ప్రకటన
మార్చి 28, 2026- నిర్మల్:
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థినులు ఆపద సమయాల్లో ధైర్యంగా తలపడేలా, వారి రక్షణకు వారే పూనుకునేలా తీర్చిదిద్దడమే లక్ష్యంగా చేపట్టిన 'ఆత్మరక్షణ శిక్షణ' కార్యక్రమం విజయవంతంగా పూర్తికావడం పట్ల శనివారం జిల్లా కలెక్టర్ రాజర్షి షా హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజంలో ఎదురయ్యే అవాంఛనీయ సంఘటనలను ఎదుర్కోవడానికి బాలికలకు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ధైర్యం అత్యవసరమని పేర్కొన్నారు. జిల్లావ్యాప్తంగా ఉన్న 130కి పైగా జిల్లా పరిషత్, కేజీబీవీ, మోడల్, ఆశ్రమ పాఠశాలల్లో సుమారు మూడు నెలల పాటు ఈ శిక్షణను సమర్థవంతంగా నిర్వహించామని ఆయన తెలిపారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ పి.ఎం. శ్రీ పథకం కింద ఎంపికైన 24 పాఠశాలల్లో అత్యధికంగా 72 సెషన్ల పాటు, ఇతర ఉన్నత పాఠశాలల్లో 33 సెషన్ల పాటు నిపుణులైన శిక్షకుల ద్వారా మెళకువలను నేర్పించినట్లు వివరించారు.
విద్యార్థినులు కేవలం పుస్తక జ్ఞానానికే పరిమితం కాకుండా, 'ధైర్యే సాహసే లక్ష్మి' అన్న నినాదంతో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలని కలెక్టర్ ఆకాంక్షించారు. ఈ శిక్షణ ద్వారా బాలికలు ఆకస్మిక దాడుల నుండి తమను తాము కాపాడుకోవడమే కాకుండా, పరిసరాల పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉండే అవగాహనను పొందారని ఆయన అన్నారు. విద్యార్థినుల నుంచి వచ్చిన విశేష స్పందనను చూస్తుంటే, భవిష్యత్తులో వారు ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనే శక్తిని సాధించారని నమ్మకం కలుగుతోందని, బాలికల సాధికారతకు ఇలాంటి కార్యక్రమాలు నిరంతరం దోహదపడతాయని కలెక్టర్ ఈ ప్రకటనలో స్పష్టం చేశారు.