🏥 వాయువుల ప్రభావంతో మహిళ అస్వస్థత – ఆందోళనలో ప్రజలు
🚫 ఫ్యాక్టరీ కారణంగా గ్రామం విడిచిపెడుతున్న కుటుంబాలు
SPSR నెల్లూరు జిల్లా, కోవూరు నియోజకవర్గం పరిధిలోని విడవలూరు మండలం పెళ్లపాలెం గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
గ్రామంలో ఉన్న బయో ఫ్యూయల్ ఫ్యాక్టరీ కారణంగా స్థానిక ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫ్యాక్టరీ నుంచి వెలువడుతున్న విషపూరిత వాయువులు తమ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
స్థానికుల ప్రకారం… ఈ వాయువుల కారణంగా శ్వాసకోశ సమస్యలు, తలనొప్పి, అస్వస్థత వంటి ఇబ్బందులు తరచూ ఎదురవుతున్నాయి. ఇటీవల ఒక మహిళ ఈ వాయువులను పీల్చి అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరిన ఘటన కూడా చోటుచేసుకున్నట్లు గ్రామస్తులు తెలిపారు.
ఈ పరిణామాలతో గ్రామంలో భయాందోళన నెలకొంది. ఇప్పటికే మూడు కుటుంబాలు గ్రామాన్ని విడిచి వెళ్లిపోయినట్లు సమాచారం.
ప్రజల ఆరోగ్యానికి ముప్పుగా మారిన ఈ ఫ్యాక్టరీపై అధికారులు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని… అవసరమైతే ఫ్యాక్టరీని ఇతర ప్రాంతానికి తరలించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
ఈ ఘటనపై సంబంధిత అధికారులు దృష్టి సారించి… ప్రజలకు న్యాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు.