అసలు ఇప్పుడు ఈ అత్యవసర అసెంబ్లీ సమావేశాల వెనుక ఉన్న అసలు మర్మం ఏమిటి?
అమరావతి రాజధాని చట్టబద్ధత అంశంపై ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ఈ ఆకస్మిక హడావుడి చూస్తుంటే, అది రాష్ట్ర ప్రయోజనం కంటే కూడా పడిపోయిన రియల్ ఎస్టేట్ గ్రాఫ్‌ను లేపడానికి వేస్తున్న ఒక "పొలిటికల్ స్టంట్" లాగే కనిపిస్తోంది. 14 ఏళ్ల అనుభవం, అంతర్జాతీయ స్థాయిలో విజన్ ఉందని చెప్పుకునే నాయకుడు, తన డ్రీమ్ ప్రాజెక్టుకు కనీసం ఒక గెజిట్ నోటిఫికేషన్ కూడా తెచ్చుకోలేకపోయారంటే అది ఆయన పరిపాలనా వైఫల్యం కాక మరేమిటి?
అసలు ఇప్పుడు ఈ అత్యవసర అసెంబ్లీ సమావేశాల వెనుక ఉన్న అసలు మర్మం ఏమిటి? అమరావతిలో పరిస్థితి చూస్తే దారుణంగా ఉంది. ఒకప్పుడు ఎకరం నాలుగు కోట్లు పలికిన భూములు, ఇప్పుడు సగం ధరకూ కొనేవాడు లేక వెలవెలబోతున్నాయి. పోనీ కొందామన్నా బ్యాంకులేమో అస్సలు లోన్లు ఇవ్వడం లేదు. ఎందుకంటే, అక్కడ చట్టబద్ధత లేదు, గ్యారెంటీ లేదు. ఈ అనిశ్చితిని తొలగించడంలో బాబు గారు ఘోరంగా విఫలమయ్యారు. ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు కేవలం గ్రాఫిక్స్ చూపించి కాలక్షేపం చేశారు తప్ప, అమరావతిని రాజ్యాంగబద్ధంగా పక్కాగా సీల్ చేయాలన్న ఆలోచన ఆయనకు రాలేదు.
ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారులు గొంతు మీద కూర్చుంటున్నారని, అక్కడ భూములు అమ్ముడుపోవడం లేదని తెలిసి, ఏదో ఒక హడావుడి చేసి "చూశారా నేను ఢిల్లీని కదిలిస్తున్నాను, రేపు పొద్దున్నే బిల్లు వచ్చేస్తుంది" అని నమ్మబలికే ప్రయత్నం ఇది. 2014 నుంచి 2019 వరకు ఇదే బిల్లును ఎందుకు పాస్ చేయించలేకపోయారు? ఆనాడు కేంద్రంలో ఈయన మాటే చెల్లుబాటు అయినప్పుడు, మోదీ గారితో అమరావతికి శంకుస్థాపన చేయించినప్పుడే ఒక చట్టం చేయించి ఉంటే ఈ రోజు ఈ గతి పట్టేదా?
హైదరాబాద్ ఉమ్మడి రాజధాని గడువు 2024 జూన్ 2తో ముగిసిపోయింది. అంటే గడిచిన 22 నెలలుగా ఆంధ్రప్రదేశ్‌కు అధికారికంగా రాజధాని లేని పరిస్థితి. ఈ 22 నెలలుగా నిద్రపోయి, ఇప్పుడు హఠాత్తుగా మేల్కొని శనివారం అసెంబ్లీ, ఆదివారం తీర్మానం, సోమవారం పార్లమెంట్ అంటూ పరుగులు తీయడం వెనుక ఉన్నది చిత్తశుద్ధి కాదు, కేవలం రైతుల నుంచి వస్తున్న ఒత్తిడిని తట్టుకోలేక చేస్తున్న ప్రయత్నం. భూసమీకరణలో భూములు ఇచ్చిన రైతులు ఇప్పుడు బాబు గారిని నమ్మే పరిస్థితిలో లేరు. రెండో విడత భూసమీకరణకు నోటిఫికేషన్ ఇచ్చినా రైతులు ముందుకు రావడం లేదంటేనే అర్థమవుతోంది - బాబు గారి మాటల మీద నమ్మకం సడలిందని!
కేంద్రం అడిగిన సందేహాల గురించి మాట్లాడుతున్నారు. అసలు ఆ సందేహాలు ఎందుకు వచ్చాయి? వీళ్ళు పంపిన ప్రపోజల్స్‌లో క్లారిటీ లేకపోవడం వల్లే కదా! 2014 కటాఫ్ డేట్ అడిగితే, పాత బకాయిల కోసం 2014 నుంచి అమరావతే రాజధాని అని రాయమనడం ఏంటి? ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉన్నప్పుడు అమరావతిని ఎలా చూపిస్తారు? ఈ కనీస లాజిక్ తెలియకుండా ఇన్నేళ్లు కాలయాపన చేసి, ఇప్పుడు "కేంద్రం అడ్డుపడింది, మేము క్లియర్ చేశాం" అని కలరింగ్ ఇవ్వడం బాబు గారి మార్క్ రాజకీయం.
నిజానికి అమరావతిలో ఇప్పుడు జరుగుతున్నది డెవలప్‌మెంట్ కాదు, కేవలం హైప్ క్రియేట్ చేసే ప్రయత్నం. విజయవాడ, గుంటూరు ప్రాంతాలు సహజంగానే డెవలప్ అవుతున్నాయి కానీ, అమరావతి కోర్ ఏరియాలో మాత్రం అడుగు ముందుకు పడటం లేదు. వేల కోట్ల రూపాయలు అక్కడ స్ట్రక్ అయిపోయి ఉన్నాయి. ఆ డబ్బులు బయటకు రావాలన్నా, రియల్ ఎస్టేట్ ఊపు అందుకోవాలన్నా ఏదో ఒక చట్టబద్ధత ముసుగు వేయక తప్పని పరిస్థితి. అందుకే ఈ అత్యవసర సమావేశాల డ్రామా!
చారిత్రక తప్పిదాలు చేయడంలో బాబు గారికి ఆయనే సాటి. ఆనాడు విజయవాడ-గుంటూరు నగరాలను కలిపి ఒక పెద్ద మెట్రో పాలిటన్ సిటీగా మార్చి ఉంటే ఈ రోజు ఈ సమస్య ఉండేది కాదు. కేవలం 29 గ్రామాలకు పరిమితం చేసి, అక్కడ తన సామాజిక వర్గం ప్రయోజనాల కోసం పాకులాడటం వల్లే అమరావతి వివాదాల్లో చిక్కుకుంది. ఇప్పుడు ఆ తప్పును సరిదిద్దుకోవడం చేతకాక, మళ్ళీ పార్లమెంట్ మెట్లెక్కి ఏదో సాధిస్తున్నట్లు బిల్డప్ ఇస్తున్నారు.
నిజంగానే ఏప్రిల్ 1 కల్లా చట్టబద్ధత వస్తుందా? లేక ఇది కూడా గతంలో చెప్పిన "ప్రత్యేక హోదా", "రెవెన్యూ లోటు" లాంటి తుస్సుమనే ముచ్చటేనా? కేంద్రం సిద్ధంగా ఉంటే గత సమావేశాల్లోనే ఈ బిల్లు ఎందుకు రాలేదు? ఇప్పుడు ఈ శనివారం పూట స్పెషల్ మీటింగ్ పెట్టి తీర్మానం పంపితే, అది పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోదం పొంది, రాష్ట్రపతి సంతకం అయ్యేసరికి ఎంత కాలం పడుతుందో బాబు గారికి తెలియదా? తెలిసినా సరే, రైతులకు మరియు రియల్ ఎస్టేట్ పెట్టుబడిదారులకు "నేను ఏదో చేస్తున్నాను" అని ఒక గ్యారెంటీ కార్డు చూపించడానికి ఆడుతున్న మైండ్ గేమ్ ఇది.
బాబు గారు తన 'అనుభవం' అనే రికార్డెడ్ సాంగ్‌ను పక్కన పెట్టి, వాస్తవాల్ని అంగీకరించాలి. చట్టబద్ధత లేకపోవడం వల్ల రాష్ట్ర అస్థిత్వం దెబ్బతిన్న మాట వాస్తవం. కానీ ఆ చట్టబద్ధత సాధించడానికి కావాల్సింది స్టంట్లు కాదు, చిత్తశుద్ధి. ఈ ఒక్క రోజు అసెంబ్లీ సమావేశంతో అమరావతి తలరాత మారిపోదు, భూముల రేట్లు ఆకాశానికి అంటవు. ప్రజలు, ముఖ్యంగా అమరావతి రైతులు ఇప్పుడు బాబు గారి గ్రాఫిక్స్ నమ్మే స్థితిలో లేరు, వారికి కావాల్సింది గ్రౌండ్ మీద కనిపిచే అభివృద్ధి, పక్కాగా ఉండే చట్టబద్ధత. ఇవన్నీ జరగకుండా ఎన్ని తీర్మానాలు చేసినా అవి కేవలం కాగితాలకే పరిమితం అవుతాయి.