అమెరికా గెలవదు - ఇరాన్ ఓడిపోదు : రాందేవ్ బాబా జోస్యం
పశ్చిమాయాసియాలో ఉద్రిక్త పరిస్థితులకు కారణంగా ఉన్న అమెరికా - ఇరాన్ యుద్ధంపై ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా జోస్యం చెప్పారు. ఈ యుద్ధంలో అమెరికా విజయం సాధించలేదని, అలాగని ఇరాన్ ఓడిపోదని అభిప్రాయపడ్డారు.
హరిద్వార్‌లోని పతంజలి యోగాపీఠ్‌లో గురువారం జరిగిన శ్రీరామ నవమి వేడుకల సందర్భంగా ఆయన పాల్గొని మీడియాతో మాట్లాడారు.
ఈ యుద్ధంలో అమెరికా గెలవదు, ఇరాన్ ఓడిపోదని నేను గతంలోనే చెప్పాను. 1000 నుంచి 1200 కిలోమీటర్ల నుంచి 4000 నుంచి 5000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగల బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించడం ద్వారా కేవలం ఆయుధాలతో ఎవరూ ఎవరినీ భయపెట్టలేరని ఇరాన్ నిరూపించిందన్నారు.
ప్రజాస్వామ్యం అంటే ఇతరులను భయపెట్టడం కాదని ఆయన హితవు పలికారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా అమెరికా గర్వపడే అమెరికా ఇతర దేశాల సార్వభౌమత్వాన్ని కూడా గౌరవించాలని సూచించారు. ఇదేసమయంలో ఇలాంటి సంక్షోభ సమయంలో భారత్ కీలక పాత్ర పోషించాలని ఆయన ఆకాంక్షించారు.
వసుదైక కుటుంబం అనే సిద్ధాంతం ఆధారంగా ప్రపంచాన్ని ఏకతాటిపైకి తీసుకురావాలన్న సందేశాన్ని భారత్ ఇస్తూనే ఉండాలని ఆయన సూచించారు. ప్రధాని నరేంద్ర మోడీ రాజకీయంగా, దౌత్యపరంగా చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నారని కొనియాడారు.
ఇజ్రాయెల్ - అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధాన్ని ఎవరైనా మధ్యవర్తిత్వంతో ఆపగలిగితే అది ఒక్క భారతదేశానికి మాత్రమే సాధ్యమవుతుందన్నారు. ఈ యుద్ధం వల్ల తలెత్తిన పెట్రోల్, గ్యాస్ సంక్షోభంతో పాటు ప్రపంచ ఆర్థిక మాంద్యానికి కూడా చర్చల ద్వారానే పరిష్కారం లభిస్తుందన్నారు.