మత్స్యకారులకు జగనన్న భరోసా – జువ్వలదిన్నె పర్యటనకు సిద్ధమవుతున్న జగన్ 🐟
కావలి నియోజకవర్గంలోని జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ వద్ద మత్స్యకారుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకొని వారికి అండగా నిలిచేందుకు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఏప్రిల్ మొదటి వారంలో పర్యటించనున్నట్లు మాజీ మంత్రి, జిల్లా పార్టీ అధ్యక్షుడు డా. కాకాణి గోవర్ధన్ రెడ్డి వెల్లడించారు.
ఈ నేపథ్యంలో హెలిప్యాడ్‌కు అనువైన స్థలాన్ని గుర్తించడం సహా అవసరమైన ఏర్పాట్లను పరిశీలించేందుకు మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో, ఎమ్మెల్సీలు తలశిల రఘురాం, పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, స్థానిక నాయకులు, మత్స్యకారులతో కలిసి పరిశీలనలు చేపట్టారు.
ఈ సందర్భంగా కాకాణి మాట్లాడుతూ, జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి గతంలో రూ.289 కోట్లు మంజూరు చేసి పనులు ప్రారంభించినది జగన్ మోహన్ రెడ్డి గారేనని గుర్తు చేశారు. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న మత్స్యకారుల కల ఆయన వల్లే సాకారం అయిందన్నారు.
ప్రస్తుతం ఫిషింగ్ హార్బర్‌ను ప్రైవేటీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఇది మత్స్యకారుల హక్కులను హరించే చర్య అని ఆయన ఆరోపించారు. ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తే మత్స్యకారులు అనేక పరిమితులు ఎదుర్కోవాల్సి వస్తుందని, వారి జీవనోపాధి ప్రమాదంలో పడుతుందని హెచ్చరించారు.
అలాగే సముద్రంలో జరిగిన బోట్ల ఘటనపై స్పందిస్తూ, మత్స్యకారులు ప్రాణాలకు తెగించి పట్టుకున్న బోట్లను పోలీసులకు అప్పగించినప్పటికీ, వాటిని రహస్యంగా తరలించారని విమర్శించారు. దీనిపై బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మత్స్యకారులకు జరుగుతున్న అన్యాయాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయాలకు అతీతంగా పోరాడుతుందని, జగన్ మోహన్ రెడ్డి గారు తిరిగి అధికారంలోకి వచ్చిన వెంటనే పూర్తి స్థాయి విచారణ జరిపించి దోషులను శిక్షిస్తారని స్పష్టం చేశారు.
ఏప్రిల్‌లో జరగనున్న జువ్వలదిన్నె పర్యటనలో జగన్ మోహన్ రెడ్డి గారు మత్స్యకారులతో నేరుగా మమేకమై వారి సమస్యలను తెలుసుకుని పూర్తి భరోసా కల్పిస్తారని కాకాణి తెలిపారు.
అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజల పక్షాన నిలబడటమే తమ పార్టీ ధ్యేయమని ఆయన స్పష్టం చేశారు.