📰 పేదల ఇళ్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలి – ఆర్డీవోకు వినతి
📰 పేదల ఇళ్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలి – ఆర్డీవోకు వినతి
కావలి: పేదలు ఎదుర్కొంటున్న గృహనిర్మాణ సమస్యలను తక్షణమే పరిష్కరించి, వారిని ప్రభుత్వాలు ఆదుకోవాలని సీపీఐ జిల్లా కార్యదర్శి దామా అంకయ్య, ఎస్. మల్లి, బాపట్ల సత్యవతమ్మ డిమాండ్ చేశారు. మంగళవారం కావలి ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో ఎలీషాకు వివిధ ప్రజా సంఘాల నాయకులతో కలిసి వారు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా దామా అంకయ్య మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో జరిగిన జగనన్న ఇళ్ల నిర్మాణాల్లో భారీ అవినీతి చోటుచేసుకుందని ఆరోపించారు. అర్హులైన ప్రతి నిరుపేదకు పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల స్థలం కేటాయించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇళ్ల నిర్మాణ వ్యయం పెరిగినందున, ఒక్కో ఇంటికి రూ.5 లక్షల చొప్పున ప్రభుత్వ సాయం అందించాలని కోరారు.
దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షుడు ఎస్. మల్లి, యానాది సమాఖ్య అధ్యక్షురాలు బాపట్ల సత్యవతమ్మ మాట్లాడుతూ టిడ్కో ఇళ్ల లబ్ధిదారులను బ్యాంకర్లు వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఇచ్చిన హామీ ప్రకారం టిడ్కో బకాయిలను మాఫీ చేయకుండా, ఇప్పుడు డబ్బులు చెల్లించాలని ఒత్తిడి తేవడం అన్యాయమన్నారు.
అదేవిధంగా, సచివాలయాల్లో ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకుంటున్న పేదలకు సరైన సమాధానం ఇవ్వడం లేదని, అర్హత లేదంటూ కుంటి సాకులతో ఆన్లైన్ దరఖాస్తులను తిరస్కరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఆర్డీవో ప్రత్యేక చొరవ తీసుకుని అర్హులందరికీ న్యాయం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి నాగరాజు, నాయకులు మాలకొండారెడ్డి తదితరులు పాల్గొన్నారు.