దివ్యాంగ శక్తి పథకం ప్రారంభం – రాష్ట్రంలో దివ్యాంగులకు ఉచిత RTC బస్సు ప్రయాణం
రాష్ట్రంలో దివ్యాంగుల సంక్షేమానికి మరొక కీలక నిర్ణయం తీసుకుంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు “దివ్యాంగ శక్తి పథకం”ను ప్రారంభించారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని అర్హత కలిగిన దివ్యాంగులకు RTC బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తున్నారు.
కోవూరులో నిర్వహించిన పత్రికా సమావేశంలో తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే దివ్యాంగులకు నెలకు రూ.6,000 పెన్షన్ అందిస్తున్నదని తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, దివ్యాంగులకు మరింత వెసులుబాటు కల్పించాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు చెప్పారు.
ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 12.76 లక్షల మంది దివ్యాంగులు లాభపడనున్నారు. 40 శాతం లేదా అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్న వారికి RTC బస్సుల్లో పూర్తిగా ఉచిత ప్రయాణం కల్పించబడుతుంది. అలాగే 100% చూపు లేని వారు, 69% పైగా వైకల్యం ఉన్నవారికి సహాయకుడికి 50% రాయితీ ఇవ్వబడుతుంది.
పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ వంటి ఐదు రకాల RTC బస్సుల్లో ఈ సదుపాయం అందుబాటులో ఉంటుంది.
ఈ పథకం కింద ప్రయాణం చేయాలంటే RTC వారు జారీ చేసిన బస్సు పాస్ తప్పనిసరిగా ఉండాలి. అర్హులైన దివ్యాంగులు తమ సదరం సర్టిఫికేట్, ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకుని సమీప RTC డిపోలో దరఖాస్తు చేసుకోవచ్చు. రూ.100 చెల్లించి బస్సు పాస్ పొందవచ్చు.
అదనంగా, RTC మొబైల్ యాప్ మరియు “మన మిత్ర” వాట్సాప్ సేవల ద్వారా డిజిటల్ పాస్ కూడా పొందే అవకాశం ఉంది. అయితే ప్రయాణ సమయంలో డిజిటల్ పాస్‌తో పాటు అసలు సదరం సర్టిఫికేట్ చూపించడం తప్పనిసరి.
రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశాన్ని దివ్యాంగులు అందరూ వినియోగించుకోవాలని కోరుతూ, ఈ పథకాన్ని ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలిపారు.
---