logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

“ధర్మ టు డోజో” – మోడర్న్ కుమిటేకు కేంద్ర గుర్తింపు కోసం ఒంగోలు యువకుడి కృషి

ఒంగోలు యువకుడు, మోడర్న్ కుమిటే వ్యవస్థాపకుడు పురిమిట్ల మనోజ్ సాయి తన అభివృద్ధి చేసిన మార్షల్ ఆర్ట్స్ విధానానికి కేంద్ర ప్రభుత్వ గుర్తింపు పొందేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ క్రమంలో ఆయన జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కిషోర్ గునుకుల గారిని వారి నివాసంలో కలిసి తన ప్రణాళికలను వివరించారు.
ఈ సందర్భంగా మనోజ్ సాయి మాట్లాడుతూ, భారతీయ సంస్కృతిలోని మూలాలను ప్రతిబింబించే మార్షల్ ఆర్ట్స్ సంప్రదాయం కాలక్రమేణా విదేశాలకు వ్యాపించి, అక్కడ విభిన్న రూపాల్లో అభివృద్ధి చెందిందన్నారు. మహాశివుని రుద్రతాండవం, పరశురాముడు వంటి పురాణ ప్రముఖుల ప్రస్తావనతో ఈ కళల ప్రాచీనతను వివరించారు. భారతదేశం నుంచి వెలువడిన ఈ సంప్రదాయ కళలకు మళ్లీ దేశంలోనే గుర్తింపు తీసుకురావడం తన ప్రధాన లక్ష్యమని తెలిపారు.
“మోడర్న్ కుమిటే”పై పుస్తకాలు రచిస్తూ, ఈ విద్యను శాస్త్రీయ దృక్పథంతో అభివృద్ధి చేస్తున్నానని చెప్పారు. యువతలో శారీరక దృఢత్వం, మానసిక స్థైర్యం పెంపొందించడమే కాకుండా, ఉద్యోగ అవకాశాల సృష్టిలో కూడా ఈ విద్య పాత్ర పోషిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ అంశాన్ని పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లాలని భావిస్తున్నట్లు తెలిపారు. మార్షల్ ఆర్ట్స్‌కు ఆయన ఎప్పటికప్పుడు ప్రోత్సాహం అందిస్తున్నారని, గతంలో ఆయన ప్రేరణతో ఒక సాధకుడు ప్రభుత్వ ఉద్యోగం పొందిన విషయాన్ని గుర్తు చేశారు.
ఈ సందర్భంగా కిషోర్ గునుకుల మాట్లాడుతూ, “చిన్న వయసులోనే ఇంత గొప్ప లక్ష్యంతో ముందుకు సాగుతున్న మనోజ్ సాయి గారి పట్టుదల అభినందనీయం. యువతకు ఉపయోగపడే ఈ విధమైన మార్షల్ ఆర్ట్స్‌కు గుర్తింపు తీసుకురావడం సమాజానికి మేలు చేసే పని. ఈ అంశాన్ని జనసేన పార్టీ పెద్దలతో పాటు కూటమి నాయకుల దృష్టికి తీసుకెళ్లేందుకు నా వంతు సహకారం అందిస్తాను” అని తెలిపారు.

0
0 views

Comment