అమ్మాయిల ఫోటోలు, వీడియోలు ఫోన్లో ఉన్నందున షీ టీం ఫిర్యాదుతో కేసు, నిందితుడి అరెస్ట్, రిమాండ్.
పత్రికా ప్రకటన
ఆదిలాబాద్ జిల్లా,
మార్చి 24 :-
టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఈనెల 19న రెండు కేసులు నమోదు
చట్టాన్ని ఎవరు కూడా చేతిలోకి తీసుకోవద్దు.
ఎలాంటి సమస్యలకైనా పోలీసులను సంప్రదించాలి.
బలవంతంగా ఫోన్ లాక్కొని తనిఖీ చేసి దాడికి పాల్పడిన కొందరు వ్యక్తులపై కేసు నమోదు.
వివరాలను వెల్లడించిన ఆదిలాబాద్ టూ టౌన్ ఇన్స్పెక్టర్ కె నాగరాజు.
ఆదిలాబాద్ టు టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈనెల 19వ ఆదిలాబాద్ పట్టణం షాద్‌నగర్ కు చెందిన తౌఫీక్ ఉల్లాఖాన్ తన మొబైల్ ఫోన్ నందు జూనియర్ కళాశాలలో విద్యార్థులుగా ఉన్నటువంటి అమ్మాయిల ఫోటోలను వీడియోలను అసభ్యకరంగా తీస్తూ ఉన్నాడనే షీ టీం ఫిర్యాదుతో, అతనిపై టూ టౌన్ పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేసి, సోమవారం అరెస్టు చేసే రిమాండ్ కు తరలించడం జరిగిందని టూటౌన్ ఇన్స్పెక్టర్ కె నాగరాజు తెలియజేశారు.
మరొక కేసు అదేరోజు జరిగిన ఘటనలో నిందితుడిపై దాడిచేసిన కేసులో పలువురిపై నమోదు చేసినట్లు టూటౌన్ సీఐ నాగరాజు తెలిపారు. ఆదిలాబాద్ పట్టణంలోని షాద్‌నగర్‌కు చెందిన తౌఫిక్ ఉల్లాఖాన్ వేదాంత్ అకాడమీ వద్ద ఉండగా, పట్టణానికి చెందిన బండారి సంతోష్, కార్తిక్, అక్షయ్‌తో పాటు మరికొంత మంది వ్యక్తులు అతని వద్దకు వెళ్లి యువతుల ఫొటోలు సెల్ఫోన్లో ఉన్నాయని ఫోన్ లాక్కున్నారు. అతనిపై చెయ్యి చేసుకున్నారు. దీంతో బాధితుడు టూటౌన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా, గురువారం కేసు నమోదు చేసినట్లు సీఐ వివరించారు.
ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ఎవరైనా చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దని, ఏదైన ఉంటే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. యువతులు, మహిళలకు సంబంధించిన ఫొటోలు వారికి తెలియకుండా తీయవద్దని, సెల్ఫోన్లో ఉంచవద్దని పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.