logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

బాసర ట్రిపుల్ ఐటీలో తాజా పరిస్థితిపై మంత్రి జూపల్లి సమీక్ష


హైదరాబాద్, మార్చి 23 : బాసర ట్రిపుల్ ఐటీ (ఆర్జీయూకేటీ)లో నెలకొన్న పరిస్థితులు, విద్యార్థుల నిరసనలు, తదనంతరం సెలవులు ప్రకటించడం, తదితర అంశాలపై ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు సోమవారం హైదరాబాద్‌లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. క్యాంపస్‌లో ప్రస్తుత స్థితిగతులను, విద్యార్థుల ఆందోళనల వెనుక ఉన్న కారణాలను బాసర ట్రిపుల్ ఐటీ వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్, ఓఎస్డీ మురళీ దర్శన్ మంత్రికి వివరించారు.
క్యాంపస్‌లో విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో శాంతిభద్రతల దృష్ట్యా, ముందస్తు జాగ్రత్తగా సెలవులు ప్రకటించాల్సి వచ్చిందని వీసీ గోవర్ధన్ మంత్రికి తెలిపారు. విద్యార్థుల ప్రధాన డిమాండ్లు, సెలవుల ప్రకటనకు దారితీసిన పరిణామాలను ఈ సందర్భంగా మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. విద్యార్థులు ఎంతో ప్రతిభావంతులని, కేవలం ఆవేశంతో ఆందోళనలు చేస్తూ తమ ఉజ్వల భవిష్యత్తును అంధకారం చేసుకోవద్దని హితవు పలికారు. సమస్యలు ఏవైనా ఉంటే చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని, విద్యార్థుల ప్రయోజనాలను కాపాడేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. క్యాంపస్‌లో మౌలిక వసతులు, విద్యా ప్రమాణాల మెరుగుదల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ఆయన అధికారులకు తేల్చి చెప్పారు. త్వరలోనే క్యాంపస్‌లో సాధారణ పరిస్థితులు నెలకొనేలా చర్యలు తీసుకోవాలని, విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు భరోసా కల్పించాలని వీసీని మంత్రి ఆదేశించారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత ట్రిపుల్ ఐటిని సందర్శించి, విద్యార్థులతో చర్చిస్తానని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు.

0
57 views

Comment