ఐటీడీఏలో 'డిజిటల్' విప్లవం: ఫిర్యాదుల పరిష్కారానికి 'ఐటీడీఏ పల్స్'
పత్రికా ప్రకటన
మార్చి 23, 2026-ఉట్నూర్ :
గిరిజన ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారంలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంచే లక్ష్యంతో ఉట్నూరు ఐటీడీఏ మరో కీలక మైలురాయిని అధిగమించింది. ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు,
వేగంగా పరిష్కరించేందుకు వీలుగా ఫిర్యాదుల స్వీకరణ వ్యవస్థను పూర్తిగా డిజిటలైజ్ చేశారు. 'ఐటీడీఏ పల్స్' (ITDA Pulse) పేరుతో రూపొందించిన ఈ నూతన ప్లాట్‌ఫామ్‌ను ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి (PO) యువరాజ్ మర్మట్ సోమవారం ప్రారంభించారు.
ఇకపై ఐటీడీఏకు వచ్చే ప్రతి ఫిర్యాదు ఈ నూతన వ్యవస్థలోనే నమోదవుతుందని పీవో స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో ఫిర్యాదుల పరిష్కారానికి నిరంతర పర్యవేక్షణ అత్యంత కీలకమని, ఈ డిజిటల్ వ్యవస్థ ద్వారా ప్రతి అధికారిని జవాబుదారీగా ఉంచే అవకాశం కలుగుతుందని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల స్థితిగతులను ఉన్నతాధికారులు నేరుగా పర్యవేక్షించవచ్చని, దీనివల్ల విధి నిర్వహణలో నిర్లక్ష్యానికి తావుండదని పేర్కొన్నారు.
QR కోడ్‌తో ఫిర్యాదు స్థితిగతుల పరిశీలన:
ఈ వ్యవస్థలో భాగంగా ప్రతి ఫిర్యాదుదారునికి ఒక ఎలక్ట్రానిక్ ఫిర్యాదు కార్డును జారీ చేస్తారు. ఈ కార్డుపై ఉండే క్యూఆర్ (QR) కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా బాధితులు తమ ఫిర్యాదు ఏ దశలో ఉంది? ఏ అధికారి వద్ద పెండింగ్‌లో ఉంది? వంటి వివరాలను నేరుగా తమ మొబైల్ ఫోన్లలోనే తెలుసుకోవచ్చు. దీనివల్ల ప్రజలు పదేపదే కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదని పీవో వివరించారు.
త్వరలో వాట్సాప్, ఆన్‌లైన్ పోర్టల్ సేవలు:
సాంకేతికతను సామాన్యులకు మరింత చేరువ చేస్తూ, త్వరలోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సహాయంతో వాట్సాప్ ద్వారా కూడా ఫిర్యాదులు చేసే వెసులుబాటు కల్పిస్తామని యువరాజ్ మర్మట్ వెల్లడించారు. అలాగే ప్రత్యేక ఆన్‌లైన్ పోర్టల్‌ను కూడా త్వరలో అందుబాటులోకి తీసుకువస్తామని, తద్వారా ప్రజలు ఎక్కడి నుంచైనా తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావచ్చని ఆయన తెలిపారు.