logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ప్రభుత్వ లక్ష్యాలను సమర్థవంతంగా అమలు చేయాలి: జిల్లా కలెక్టర్ రాజర్షి షా

పత్రికా ప్రకటన
మార్చి 23, 2026_ఆదిలాబాదు:


ప్రజావాణి పోర్టల్ లో నమోదైన ఫిర్యాదులను నెల రోజుల్లోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రాజర్షిష అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల అర్జీలను ఆయన స్వయంగా స్వీకరించారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, సామాజిక భద్రతా పెన్షన్లు, ఉపాధి హామీ పనులు, భూభారతి సమస్యలు తదితర అంశాలకు సంబంధించి మొత్తం 93 అర్జీలు రావడం జరిగిందని, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టాలని సంబంధిత శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

ఈ సందర్బంగా వివిధ శాఖల జిల్లా అధికారుల సమీక్షలో కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజావాణి (CPGRAMS) ద్వారా అందే ఫిర్యాదులను 30 రోజుల్లోపు పరిష్కరించాలని, మండల స్థాయిలో ఎంపిడిఓలు, ఇతర అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి, యాక్షన్ టేకెన్ రిపోర్ట్‌లను పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలన్నారు. పదేపదే ఒకే సమస్యపై ఫిర్యాదులు రాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని, అప్పీల్ కేసులను రెండు మూడు రోజుల్లోనే పరిష్కరించాలని సూచించారు. అదేవిధంగా విద్యార్థులకు అందించే భోజన నాణ్యత విషయంలో రాజీ పడకూడదని, కొత్త మెనూ ప్రకారం బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ సకాలంలో అందించాలని, పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. బియ్యంలో పురుగులు వచ్చినట్లైతే సరఫరాదారుల నుంచి సరుకులను తిరిగి పంపించి, నాణ్యమైనవి తెప్పించాలని ఆదేశించారు. పెంచిన రేట్ల ప్రకారం సరుకుల సరఫరా సక్రమంగా ఉండాలని, ప్రత్యేక అధికారులు వారానికి కనీసం రెండుసార్లు హాస్టళ్లను సందర్శించి విద్యార్థులతో కలిసి భోజనం చేయాలని స్పష్టం చేశారు. అలాగే, వివిధ ప్రభుత్వ శాఖల పేరుతో ఉన్న మున్సిపల్ ఆస్తి పన్ను బకాయిలను వెంటనే చెల్లించాలని, సంబంధిత హెచ్.ఓ.డి లు ప్రత్యేక దృష్టి సారించాలని స్పష్టం చేశారు. ఏప్రిల్ 1 నుండి 7 వరకు నిర్వహించే 'ఆరోగ్య వారోత్సవాల'ను విజయవంతం చేయాలని ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగా 'ఫుడ్ సేఫ్టీ మేళాలు' నిర్వహించి ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు.

అనంతరం పవిత్ర రంజాన్ మాసంలో నిరంతరం సేవలందించినందుకు గాను జిల్లా కలెక్టర్, జిల్లా అధికారులు, సిబ్బందిని అమన్ ఫౌండేషన్ స్వచ్చంధ సంస్థ ప్రతినిధులు ఘనంగా సన్మానించారు.

ఈ ప్రజావాణి లో అదనపు కలెక్టర్ రాజేశ్వర్, ఆర్డీఓ స్రవంతి, డిఆర్డీఓ రవీందర్, డివైఎస్ఓ శ్రీనివాస్, డిఏండబ్ల్యూఓ కలీం, డిపిఓ రమేష్, తహసీల్దార్ శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ రాజు, ఫౌండేషన్ అధ్యక్షుడు అర్ఫాత్ ఖాన్, ఫౌండేషన్ ప్రతినిధులు, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది, ప్రజలు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

0
35 views

Comment