logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

కేసీ కెనాల్ ఉద్ధృతం – పోలీస్ కాలనీ మునిగింది. అధికారుల నిర్లక్ష్యంపై ప్రజల ఆగ్రహం.

నంద్యాల (AIMA MEDIA ): కేసీ కెనాల్‌కు అనుబంధమైన సబ్‌ కెనాల్‌లో నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరగడంతో నూనెపల్లి బీఆర్‌ఎస్ పోలీస్ కాలనీ వరద నీటిలో చిక్కుకుంది. కాలనీలోని రహదారులు, ఇళ్లు నీటితో మునిగిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాలనీకి వెళ్లే మార్గాలు పూర్తిగా నీటితో నిండిపోవడంతో రాకపోకలు దాదాపు నిలిచిపోయాయి. రోజువారీ పనులకే బయటకు వెళ్లాలంటే ప్రజలు ప్రాణాల పణంగా పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇళ్లలోకి నీరు చేరడంతో కుటుంబాలు భయాందోళనకు గురవుతున్నాయి. నీరు నిల్వ ఉండటంతో కాలనీలో పాములు, పురుగులు సంచరిస్తున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నప్పటికీ సంబంధిత అధికారులు మాత్రం స్పందించడం లేదని కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యను పలుమార్లు ఇరిగేషన్ సిబ్బంది, స్థానిక అధికారులకు తెలియజేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని వారు ఆరోపిస్తున్నారు. సబ్‌ కెనాల్‌లో నీటి మట్టాన్ని తగ్గించకపోతే పరిస్థితి మరింత విషమించవచ్చని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి కాలనీలోకి చేరిన నీటిని తొలగించడంతో పాటు భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు రాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కాలనీలో నెలకొన్న పరిస్థితి చూస్తే ఎప్పుడైనా వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని స్థానికులు భయపడుతున్నారు. అధికారులు వెంటనే స్పందించకపోతే ఆందోళనకు దిగాల్సి వస్తుందని కాలనీవాసులు హెచ్చరించారు.

10
868 views

Comment