ఆధ్యాత్మిక, నైతిక, మానవీయ విలువలు మార్గాలను చూపే ఖురాన్ అవతరించిన నెల రంజాన్.
వ్యాస రచయిత:- ఎంఎండి రఫీ గణిత శాస్త్ర అధ్యాపకులు. నంద్యాల ( బలపనూరు).
నంద్యాల (AIMA MEDIA ): రంజాన్ నెల ఇస్లాం క్యాలెండర్ ప్రకారం పవిత్రమైన 9వ మాసము . రంజాన్ నెల విశిష్టత దానధర్మాలు చేయడం, కఠిన ఉపవాసాలు ఉండడం, ఆత్మ నిగ్రహము, దాతృత్వము కలిగి ఉండి, మానవాళి పవిత్ర గ్రంథము ఖురాన్ అవతరించిన మాసము. రంజాన్ నెలలో 30 రోజులపాటు సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు కఠిన ఉపవాసాలు పాటిస్తూ, క్రమశిక్షణ, ఆధ్యాత్మికత, సాంప్రదాయాలు, మరియు పేదల పట్ల దయ, కరుణ చాటి చెప్పి గొప్ప ఆధ్యాత్మిక ఇస్లాం మాసం. ముస్లింలు అత్యధికంగా వారి యొక్క పవిత్ర గ్రంథము ఖురాన్ను చదువుతారు. ఈ మాసములో మానవులు ఆత్మ పరిశీలన, స్వీయ క్రమశిక్షణను, అత్యధికంగా ప్రాధాన్యత నిస్తారు.ఒక నెల రోజులు కఠిన ఉపవాసాల అనంతరం నెల వంక కనిపించిన తర్వాత ఈద్-ఉల్-ఫితర్ ( Eid-Ul- Fithar, రంజాన్ పండుగ) భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకుంటారు. ప్రపంచ వ్యాప్తంగా ముస్లింలు (ఇస్లాం మతాన్ని నమ్మినవారు ) జరుపుకునే అతి ముఖ్యమైన పండుగరంజాన్.*నెలవంక దర్శనముతో మొదలై నెల రోజులపాటు కఠిన ఉపవాసాలు కొనసాగిస్తూ పవిత్ర గ్రంథం ఖురాన్ పటిస్తూ అల్లాను ప్రార్థిస్తారు. రంజాన్ మాసం లో మొహమ్మద్ గారికి ప్రవక్త పదవి లభిస్తుంది. ఇస్లాం మతానికి ఐదు సూత్రాలు మూల స్తంభాలు 1.ఈమాన్ 2.నమాజ్ 3.రోజా 4.జకాత్ 5.హజ్. ఈ ఐదు రంజాన్ మాసంలో పాటిస్తారు. సాధారణంగా ప్రతి మతంలో ఆచార వ్యవహారాలు,సంస్కృతిసాంప్రదాయాలు ఉంటాయి. అలాగే ఇస్లాం మతంలో ముస్లింల జీవన విధానాన్ని దిశా నిర్దేశము చేసేది దివ్య ఖురాన్ మాత్రమే. ఇది వీరికి ఒక దిక్సూచి, అల్లాహు దివ్యమైన వెలుగు లాంటిది. రంజాన్ మాసంలో సూర్యోదయానికి ముందు ఆహారము స్వీకరించి ఆ రోజంతా కఠిన ఉపవాసం పాటించి అల్లా మంచి పనులు కోసము ప్రార్థనలు చేస్తారు. చెడు మాటలు, చెడు విషయాలు, దుష్ట విషయాలు మనసులోనికి రానివ్వరు. కల్మాలు చదవడం, పాపాల గురించి పశ్చాతాపము, స్వర్గ ప్రాప్తి కావాలనుకోవడం తల్లిదండ్రుల కోసం, కుటుంబ సభ్యుల ఆయురారోగ్యాల కోసం, అల్లాను ప్రార్థిస్తారు. "లాఇలాహ - ఇల్లల్లాహు, మొహమ్మద్ రసూలిల్లాహ్ " , ( అల్లాహు తప్ప, వేరే ఆరాధ్యుడు లేడు మొహమ్మద్ (స. అ స ) అని విశ్వసిస్తారు. సకల చరాచర జీవులు, నిర్జీవులు ఈ లోకములోని జీవుల అన్నింటికీ అధిపతి అల్లాహు ఒక్కడే అని ముస్లింల ప్రగాఢ,నిగూఢమైన విశ్వాసం. రంజాన్ మాసంలో ముస్లింలు అందరూ ఆడ -మగ, పెద్ద -చిన్న అనే భేదాలు లేకుండా ఐదు పూటలా నమాజు చదువుతారు. ఖురాన్లో ఉన్న 30 పర్వాలను మసీదులో ఉన్న ఇమామ్ లు చదివిస్తారు. ఉపవాసము ఉన్న ముస్లిం సహోదరులు 14 గంటలపాటు కేవలము మంచినీళ్లు కూడా త్రాగకుండా ఉపవాసము పాటిస్తారు. సూర్యుని గమనాన్ని బట్టి వివిధ దేశాలలో ఉపవాస సమయాలలో కొంత మార్పులు జరుగుతూ ఉంటాయి. ప్రతి ముస్లిం సోదరుడు వారి సంపాదన లో పేదల కోసము కొంత ఖర్చు చేస్తారు దానిని జకాత్ అంటారు. ప్రతి ముస్లిం తన ఆదాయములో రెండున్నర శాతం ధనాన్ని పేదలకు ఖర్చు చేయాలని పవిత్ర ఖురాన్ గ్రంథము చెబుతుంది. రంజాన్ దేవుని సన్నిహిత్యము కోసము ప్రయత్నించే గొప్ప పండుగ మాసం రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందులు సామాజిక కార్యక్రమాలకు ప్రాధాన్యతనివ్వడమే కాదు మానవుడు సంపూర్ణంగా స్పృహతో ప్రపంచము పట్ల తగిన రీతిలో వైరాగ్యభావముతో అనుసరించి ఆకలి దప్పికలను భరించి ఉపవాసాల వేదిక ఆ వేదికలో పేదల ఆకలి బాధను అర్థంచేసుకోవచ్చు. ప్రతి ముస్లిం తమ కోరికలకు కళ్లెం వేసి పరిమితంగా మితంగా వ్యవహరించడానికి చక్కని అవకాశం ఈ ఉపవాసం అనుటలో ఎలాంటి సందేహము లేదు. రంజాన్ నెలలో అధిక సమయము దైవచింతన ఆరాధనలు జరపడము ద్వారా ఈ ప్రపంచమే శాశ్వతము కాదు అనే నమ్మకాన్ని ప్రకటించవచ్చు. రంజాన్ మాసం వల్ల మానవుని జీవితము సముద్రములో ఒక నీటి బుడగ వంటిది అనుటలో అతిశయోక్తి లేదు. రంజాన్ మాసం మనిషి ఆత్మ ప్రక్షాళనకు ఒక సువర్ణ అవకాశం. బడుగు బలహీన వర్గాల పక్షాన నిలబడేలా చేసి ఆధ్యాత్మిక శిక్షణాలయం. ఇంద్రియ వాంఛలకు కళ్లెం వేసి షీలా నిర్మాణానికి సత్ సమాజ మాజ స్థాపనకు పునాదివేసే ధార్మికమైన కాలం. మనసులలో వినయ విదేతలను పెంపొందించి ప్రేమ, శాంతి ,అభిమానము పెంచి, నరకము నుండి రక్షించి స్వర్గ ద్వారాల వైపు నడిపించే అద్భుతమైన కఠిన ఉపవాసాలఆధ్యాత్మిక సాధనం. రంజాన్ నెలలో ప్రతి సత్కార్యానికి 10 నుండి 700 రెట్లు పుణ్యము లభిస్తుందని అల్లా అన్నాడు. అంతేకాక ఉపవాసము నాకోసమే అయితే దానికి ప్రతిఫలం నేను ఇస్తాను అంటాడు. అల్లా కోసమే మీరు మీ ఆహారాన్ని మీ కోరికలను వదులుకున్నందుకు ప్రతిఫలంగా పుణ్యాన్ని అందజేస్తాను.మక్కాయాత్రను కూడా ప్రతి ముస్లిం సోదరుడు పరమ పవిత్రంగా భావిస్తారు. సౌదీ అరేబియాలోని మక్కా దర్శించుకోవాలని ఇస్లాం బోధిస్తుంది. దీనిని ఉమ్రా యాత్ర అంటారు. ముస్లిం సోదరులు మక్కాయాత్ర చేస్తూ నమాజు ఖురాన్ చదవడం, దానధర్మాలు చేస్తూ ఉంటారు.