ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్*
*ప్రపంచ జల దినోత్సవ అవగాహనపై గోడ పత్రిక ఆవిష్కరణ*
తేదీ: 20-03-2026:ఈరోజు ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో హఫీజ్ పేటలో గల జల మండలి జనరల్ మేనేజర్ గారి కార్యాలయములో ప్రపంచ జల దినోత్సవ అవగాహనపై ముద్రించిన గోడపత్రికను హైదరాబాదు మహానగర జలమండలి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ సంతోష్ రెడ్డి, ఛీఫ్ జనరల్ మేనేజర్ శ్రీనివాస్ రెడ్డి, 15వ డివిజన్ జనరల్ మేనేజర్ శ్రీ రమావత్ కృష్ణగార్లు ఆవిష్కరించి తదనంతరం వారు మాట్లాడుతూ " *ఐక్యరాజ్యసమితి వారు మార్చి 22వ తేదీని ప్రపంచ జల దినోత్సవముగా ప్రకటించి ప్రతి సంవత్సరం వివిధ అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశ్యం ప్రకృతి ప్రసాదించిన నీటిని పొదుపుగా వాడుకోవడంతో పాటు, భూగర్భ జలాలు కలుషితం కాకుండా చూడటమే ప్రధాన లక్ష్యంగా ప్రతి సంవత్సరం ఒక నినాదంతో నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరపు నినాదం ' _నీరుప్రహించే చోట - సమానత్వం వికసిస్తుంది_ . రోజురోజుకూ భూతాపం పెరిగిపోతుంది. దానికి కారణం గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలతో పాటు, చెట్లను ఇష్టారీతిని నరకివేయడం, ప్లాస్టిక్ వినియోగం అధికమవడం, ప్రకృతి ప్రసాదించిన వనరులను అవసరానికి మించి వాడటం వలన, భూగర్భ జలాలు కలుషితం అవడంవలన పర్యావరణంలో పెను మార్పులు సంభవించి, మంచు కొండలు కరగి సముద్ర జలాలలో కలవడం వలన, సముద్రమట్టం పెరగడంతో పాటు వరదలు, కరువులు, కొండచరియలు విరిగి పడడం వలన పర్యావరణ వ్యవస్థలు దెబ్బతింటున్నాయి"* అని అన్నారు. " *ప్రపంచ నాగరికత అంతా నదీతీర పరీవాహక ప్రాంతాలలోనే యినుమడించింది"* అని అన్నారు. " *భూగోళంలో 97శాతము ఉప్పునీరే. మిగతా 3శాతము నదులు, సరస్సులు, మంచు పర్వతాలు మరియు భూగర్భ జలాల ద్వారా నీరు లభిస్తుంది. కేవలం నదులు, సరస్సులు మరియు భూగర్భ జలాల ద్వారా లభించే నీరు మాత్రమే త్రాగునీరు, సాగునీరు మరియు పారిశ్రామిక వినియోగానికి ఉపయోగపడుతున్నాయి. సకల జీవకోటికి గాలి తరువాత నీరే ప్రధానమయినది. చెరువుల ద్వారా 0.86%, నదుల ద్వారా 0.02%, భూగర్భ జలాల ద్వారా 0.12% మాత్రమే నీరు లభ్యమవుతున్నది. ఒకవైపు జనాభా పెరిగిపోవడం, మరోవైపు భూగర్భ జలాలు రోజురోజుకూ అడుగంటడంతో పారిశ్రామిక అవసరాలు కూడా పెరగడంతో ప్రపంచలో 80 దేశాలు త్రాగునీటి సమస్యతో కొట్టుమిట్టాడుతున్నాయి. మానవుడు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే త్రాగే నీరు, భుజించే ఆహారం, నివసించే ప్రదేశం మరియు వ్యక్తిగత పరిశుభ్రత ప్రధానమైనమి. లోయ, అటవీ ప్రాంతాలలో నివసించే ప్రజలు పరిశుభ్రమైన త్రాగునీరు లభించక అనేక వ్యాధులకు గురై సంవత్సరానికి ప్రపంచం మొత్తంలో 40 లక్షల మంది మృత్యువాత పడుతున్నారు"* అని అన్నారు. " *ముఖ్యంగా చిన్నపిల్లలు అతిసార వ్యాధితో బాధపడుతున్నారు. అవన్నీ కూడా అభివృద్ధి చెందుతున్న దేశాలలోనే జరుగుతున్నాయి. మనకు పూర్వము నుండి మనదేశంలో నీటి విలువ తెలుసు కాబట్టి నీటిని గంగమ్మ అని నదులు, చెరువులను, కాలువలను పూజలు పునస్కారాలతో గౌరవిస్తున్నాము. పరిస్థితులు ఇదే విధంగా ఉంటే నీరు లేని భూమి మరుభూమికన్నా భయంకరంగా ఉంటుంది. ఇప్పటికే మన గ్రామాలు, జిల్లాలు మరియు రాష్టాల మధ్య వీటికొరకు ఘర్షణ వాతావరణం ఏర్పడింది. భవిష్యత్తులో నీటికోసం దేశాల మధ్య కూడా యుద్ధాలు జరిగే ప్రమాదాలు పొంచి ఉన్నాయి. మనదేశంలో ప్రతిరోజు ప్రతి వ్యక్తికి పట్టణ ప్రాంతంలో కనీసం 135 లీటర్ల నీరు అవసరం ఉంటుంది. అదే గ్రామీణ ప్రాంతాల్లో అయితే 100 లీటర్ల నీరు అవసరం ఉంటుంది. అభివృద్ధి చెందిన అమెరికా వంటి దేశాలలో రోజుకు 500 లీటర్ల నీటిని వినియోగిస్తున్నారు. భవిష్యత్తులో అందరికి పరిశుభ్రమైన త్రాగు, సాగునీరు మరియు యితర పారిశ్రామిక అవసరాలకు సరిపడా నీరు కావాలంటే నీటిని పొదుపుగా వాడటం, వాడిన నీటిని తిరిగి వ్యవసాయానికి ఉపయోగించడంతో పాటు వ్యర్థాలను భూమిలోకి యింకకుండా చేయాలి. అలాగే యింకుడుగుంతలను ఏర్పాటు చేసి భూగర్భ జలాలను పెంచాలి. చెట్లను విరివిగా పెంచాలి"* అని అన్నారు. " *ఇది ఒక సామాజిక బాధ్యతగా భావించి ప్రతి ఒక్కరూ నీటి సంరక్షణతో పాటు యితర రసాయనిక పదార్థాలతో కలుషితం కాకుండా కాపాడుకోవడం వంటి చర్యలు చేపట్టాలి. ఇది ప్రభుత్వంతో పాటు పౌర సమాజం, స్వచ్ఛంద సంస్థలు అందరు కలిసి ఆచరిస్తేనే పర్యావరణ రక్షణతో పాటు సకల జనులు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు"* అని తెలిపారు. ఈ సందర్భంగా అందరిచేతా నీటి సంరక్షణ ప్రతిజ్ఞను చేయించారు. ఈ కార్యక్రమంలో జలమండలి అధికారులు, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు మారబోయిన సదానంద్ యాదవ్, అమ్మయ్య చౌదరి, శివరామకృష్ణ, G.V. రావు, శివరామరెడ్డి, జనార్ధన్, ఉమా చంద్రశేఖర్ మరియు పాలం శ్రీను తదితరులు పాల్గొన్నారు.