దివ్యాంగుల ఆత్మగౌరవం, సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ఇది మరో ఉదాహరణగా నిలిచింది.
నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలోని ఆర్టీసీ డిపో ప్రాంగణంలో ‘దివ్యాంగ శక్తి’ పథకం ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపుమేరకు, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించబడింది.
ఈ కార్యక్రమంలో బుచ్చిరెడ్డిపాలెం మున్సిపల్ చైర్పర్సన్ మోర్ల సుప్రజా మురళి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దివ్యాంగుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల ప్రకారం, దివ్యాంగులకు ఇకపై పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో ‘జీరో ఫేర్’ టికెట్ల ద్వారా ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించనున్నట్లు వెల్లడించారు.
ఇప్పటివరకు కొన్ని బస్సు సేవల్లో 50 శాతం రాయితీ మాత్రమే ఉండగా, తాజా నిర్ణయంతో పూర్తిగా ఉచిత ప్రయాణానికి మార్గం సుగమమైందని తెలిపారు. ఇప్పటికే విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో సిటీ ఆర్డినరీ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణం అమల్లో ఉందని గుర్తు చేశారు.
రాష్ట్రంలో సుమారు 11 లక్షల మంది దివ్యాంగులు ఉన్నారని, అందులో కేవలం 2 లక్షల మంది మాత్రమే ఆర్టీసీ పాస్ వినియోగిస్తున్నారని అధికారులు పేర్కొన్నట్లు తెలిపారు. ఈ పథకం ద్వారా మరింత మంది లబ్ధి పొందే అవకాశముందని చెప్పారు.
గుంటూరు బస్టాండ్‌లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాన్ని అధికారికంగా ప్రారంభిస్తున్నారని కూడా ఆమె పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, ఆర్టీసీ డిపో యాజమాన్యం, అలాగే టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల నాయకులు పాల్గొన్నారు