logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

పొట్టి శ్రీరాములు 125 వ జయంతి సందర్భంగా

1901 మార్చి 16న జన్మించిన పొట్టి శ్రీరాములు గారికి ఇది 125వ జయంతి సందర్భం. పొట్టి శ్రీరాములు అనగానే ఆంధ్రరాష్ట్రం ఏర్పాటు గుర్తుకు రావచ్చు. కానీ, 58 రోజులు కఠోర దీక్షకు కూర్చుని ప్రాణాలు కోల్పోయిన పొట్టి శ్రీరాములు నేపథ్యం ఏమిటి? ఎందుకంత సాహసానికి ఒడిగట్టారు అని తరచి చూసి అన్వేషిస్తే ఎన్నో విషయాలు తారసపడతాయి. 1952 అక్టోబరు 19న పొట్టి శ్రీరాములు మదరాసు నగరంతో కూడిన ఆంధ్ర రాష్ట్రం కావాలని చేసిన దీక్ష ఐదవ నిరాహార దీక్ష. అంతకుముందు చేసిన నాలుగు దీక్షలు ఎంతో విజయవంత మయ్యాయి.
▪️బ్రిటిష్ కాలంలో చేసిన తొలి రెండు దీక్షలు:
1946 మార్చి ఏడవ తేదీన హరిజన దేవాలయ ప్రవేశం కోసం నెల్లూరులోని మూలాపేట వేణుగోపాలస్వామి ఆలయంలో 10 రోజులు పాటు నిరాహారదీక్ష చేసి, విజయం సాధించారు. అదే పద్ధతిలో తిరుమల దేవాలయంతో సహా అన్ని దేవాలయాలలో హరిజన ప్రవేశం కోసం అదే సంవత్సరం నవంబరు 25న మొదలుపెట్టిన రెండవ దీక్ష 19రోజులు సంబంధిత బిల్లు ఆమోదింపచేయడంలో విజయం పొందారు. ఈ రెండు దీక్షలు చేసిన కాలంలో గద్దెమీద ఉన్నది తెల్ల దొరలు. హరిజనోద్ధరణకు పాటుపడుతూనే ఖాదీ ప్రచారం, నెల్లూరు మునిసిపల్ ఉద్యోగులు, మరీ ముఖ్యంగా పాకీవారల సమస్యలు, మద్యపాన నిషేధం వంటి ప్రధాన సమస్యలే కాకుండా బిక్షుక సమస్య జైళ్ళలో ఖైదీల సమస్యలు, విద్యార్థుల సమస్యలు, వివాహ సంస్కరణలు వంటి రంగాలలో కూడా కృషి చేసి బొంబాయి దురంతాలకు వ్యతిరేకంగా శ్రమించారు.
▪️స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత చేసిన మరో రెండు దీక్షలు:
హిందూ-ముస్లిం మత సమస్యను ప్రధానంగా తీసుకుని గాంధీజీ హరిజనుల సమస్యకు తక్కువ ప్రాధాన్యత ఇచ్చారేమోనని పొట్టి శ్రీరాములు భావన. హరిజనుల అభ్యున్నతికి దేవాలయ ప్రవేశం ఒక్కటే సరిపోదని, మరింత దృష్టి పెట్టి సాంఘిక సమానత్వం సాధిస్తే తప్పా దక్షిణభారతదేశంలోని అట్టడుగు ప్రజలు స్థిమితపడరని ఆయన భావించి గాంధీజీ గతించిన తర్వాత 1948 సెప్టెంబర్ 10వ తేదీన అప్పటి మదరాసు ప్రెసిడెన్సీ ముఖ్యమంత్రి కార్యాలయం ఎదుట నిరసన వ్రతానికి పొట్టి శ్రీరాములు దిగారు. ఈ దీక్షకు సంబంధించి గాంధీజీ స్థాపించిన 'హరిజన్' పత్రిక సంపాదకులు కిషోరీలాల్ కు 1948 సెప్టెంబర్ 29న పొట్టి శ్రీరాములు ఓ హృదయవిదారక విషయాలతో ఉత్తరం రాశారు. బ్రిటీషు ప్రభుత్వం పూనుకోలేని ఘాతుకానికి అప్పటి ప్రభుత్వం తెగబడిందని పొట్టి శ్రీరాములు మీద 1982లో పరిశోధన చేసి, పిహెచ్.డి. చేసిన బాదం శ్రీరాములు తన సిద్ధాంత గ్రంథంలో ఈ లేఖలోని విషయాలు ఉటంకిస్తూ వ్యాఖ్యానించారు. మూడవ దీక్షలో 11 రోజుల తర్వాత అరెస్టు చేసి జైలుకు పంపారు. అక్కడ ఏడు రోజులు దీక్ష కొనసాగించి మరింత ముందుకు వెడితే తన ఉనికికే సమస్య అవుతుందని దీక్ష మానివేశారు. అలా మూడవ దీక్ష మొత్తం 18 రోజులు చేశారు. గాంధీజీ గతించిన జనవరి 30ని ఒక ప్రాధాన్యతగా గమనించి ప్రతినెలా 30వ తేదీని 'హరిజన సేవా దినోత్సవం'గా ప్రకటించి, ఈ దిశగా చేసిన చర్యల సమీక్ష చేసుకుంటూ మరిన్ని చర్యలు క్రమం తప్పకుండా చేపట్టాలని పొట్టి శ్రీరాముల ఆలోచన. దానికోసమే ఈ 3, 4 దీక్షలు కొనసాగాయి. అర్థాంతరంగా మూడవ దీక్ష ఆగిపోయినప్పుడు నిరాహార దీక్షకు రంగస్థలం వార్ధా ఆశ్రమమని గుర్తించి అక్కడ దీక్షకు పూనుకున్నారు. అతి కష్టం మీద వినోబా భావే జోక్యంతో అనుమతి పొంది 1949 జనవరి 13న మధ్యాహ్నం 12 గం.లకు వీరి కొనసాగింపు దీక్షను వార్ధాలో చేపట్టారు. ఇది 28 రోజులు సాగి విజయవంతంగా ప్రభుత్వం అనుకూలంగా స్పందించడంతో ముగిసింది. తత్ఫలితంగానే ప్రభుత్వ నిర్ణయం తీసుకున్నది. అయితే పొట్టి శ్రీరాములు ఉద్దేశించిన లక్ష్యాన్ని అప్పటి ప్రభుత్వం, తర్వాత ప్రభుత్వాలు పెడచెవిని పెట్టినా పొట్టి శ్రీరాములు త్యాగ బుద్ధినీ, గుండె ధైర్యాన్ని మెచ్చుకోకుండా ఉండలేం.
▪️పొట్టి శ్రీరాములు గురించి తెలిసిన విషయాలకన్నా తెలియని విషయాలే ఎక్కువ:
వాట్సప్ కారణంగా పొట్టి శ్రీరాములు మరణాన్ని ఎవరూ పట్టించుకోలేదన్నట్టు అసత్యాల జాతర వంటి మెసేజ్ ఒకటి నాలుగైదేళ్ళుగా గిరికీలు కొడుతోంది. అందులో చాలా విషయాలు అవాస్తవాలు.‌ పొట్టి శ్రీరాములు గారి నిరాహార దీక్ష కీలక ఉద్దేశ్యం దెబ్బతిని వుండవచ్చు. భారతదేశ చిత్రపటాన్ని పునర్లిఖించిన పొట్టి శ్రీరాములు చేసిన త్యాగాన్నీ, పోరాటాన్ని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తో పాటు కర్ణాటక, తమిళనాడు, బీహార్, మహారాష్ట్ర, గుజరాత్ వంటి భాషా ప్రయుక్త రాష్ట్రాలలోని ప్రజలు కూడా విస్మరించారేమో అని డాక్టర్ రామచంద్ర గుహ ఒక సందర్భంలో అంటారు.
▪️పొట్టి శ్రీరాములు నేపథ్యం:
మెట్రిక్యులేషన్ తప్పిన శ్రీరాములు మదరాసు పట్టణంలో కళాశాలలో సీటు దొరకకపోవడం వల్ల 1920లో బొంబాయిలోని విక్టోరియా జూబిలీ టెక్నికల్ ఇన్ స్టిట్యూట్ లో సీటు సంపాయించి నాలుగేళ్ళ ఇంజనీరింగ్ కోర్సు పూర్తి చేసి అక్కడే నెలకు నూట నలభై ఐదు రూపాయల జీతం ఇచ్చే ఉద్యోగంలో చేరారు. వందేళ్ళ క్రితం విక్టోరియా జూబిలీ టెక్నికల్ ఇన్ స్టిట్యూట్ లో ఇంజనీరింగ్ కోర్సు చెయ్యడం, సెంట్రల్ పెనున్జులర్ రైల్వేలో ఉద్యోగం గడించడం ఏమాత్రమూ చిన్న విషయాలు కాదు. 1930లో గాంధీజీ ప్రభావంతో ఉద్యోగానికి రాజీనామా చేసి స్వతంత్ర్య ఉద్యమంలో దూకారు. అప్పటికి అనారోగ్యంతో భార్య కనుమూసి రెండేళ్ళయ్యింది. అలా స్వతంత్ర్య ఉద్యమంలో పాల్గొని సబర్మతీ జైలులో ఖైదీగా ఉన్నప్పుడు బీహారు భూకంపం పెద్ద ఎత్తున నష్టం చెయ్యడంతో విడుదలయ్యారు. గాంధీజీ సలహామీద బాబూ రాజేంద్ర ప్రసాద్ తో కలిసి సహాయక చర్యలను పెద్ద ఎత్తున చేపట్టారు. అనంతరం రాజ్ కోట ఆశ్రమంలో కొంత కాలం, తారవాడ ఆశ్రమంలో కొంతకాలం ఉన్నారు.
▪️తెలుగు ప్రాంతంలో పొట్టి శ్రీరాములు సంస్కరణ కార్యక్రమాలు:
1937లో మేనమామ నర్సయ్య ఆరోగ్యం బాగా దెబ్బతినిందని మారెళ్ళకు వస్తారు. ఇక అప్పటి నుంచీ సుమారు దశాబ్దిన్నర పొట్టి శ్రీరాములు పలు సేవా కార్యక్రమాలను ఆంధ్రప్రాంతంలో చేయడానికి సిద్ధమయ్యారు. మారెళ్ళలో చేపట్టిన కార్యక్రమాలు చాలా విలువైనవి ప్రభావవంతమైనవి. మామ గతించిన 16వ రోజు చుట్టుపక్కల ప్రాంతాల పురోహితులు గంటల తరబడి దూషించిన తను తన బంధుమిత్రులను సంయమనంతో ఆపారు. చివరకు వారు కనువిప్పు కలిగి ఆ దురాచారాన్ని మానేశారని చరిత్ర చెబుతోంది. మారెళ్ళలో ఉన్న 7 నెలల కాలంలో చరఖాలు పంచి, నూలు వడికించడమే కాకుండా ఆ గ్రామీణుల తాగుడు అలవాటును మానిపించడానికి కృషి చేశారు. కనువిప్పు కలిగిన ప్రజల తోడ్పాటుతో మంచినీటి బావి పూనిక తీయించారు ఆస్పత్రి కోసం ఒక భవనం సైతం నిర్మించారు. కొన్ని నెలల క్రితం నేను మారెళ్ళలోని శ్రీరాములు మామ నర్సయ్య వారసుల కుటుంబాల వారిని కలిసినప్పుడు 1937లో నిర్మించబడిన భవనాన్ని చూపెట్టారు. దిరిశాల వెంకటరమణారెడ్డి అనుమతితో ఆయన స్థలంలో ఆస్పత్రిని నిర్మించారు. ఈ ఆసుపత్రి భవనంలోనే కొంతకాలం పొట్టి శ్రీరాములు తమ్ముడు వైద్యుడైన రంగయ్య గుప్త డాక్టరుగా సేవలందించారని తెలుస్తోంది. ఇప్పటికీ చక్కగా, గంభీరంగా ఉన్న భవనం ప్రభుత్వ ఆసుపత్రిలో అంతర్భాగంగా ఉందని గమనించాను. ఈ భవనాన్ని పొట్టి శ్రీరాములు స్మారకంగా సద్వినియోగం చేస్తే బావుంటుంది. గుడివాడలో ఎర్నేని సుబ్రహ్మణ్యం స్థాపించిన గాంధీఆశ్రమంలో కొంతకాలం ఉన్న తరువాత 1944 అక్టోబరు రెండవ తేదీనుంచి పొట్టి శ్రీరాములు హరిజనుల అభ్యున్నతి కోసం నడుం కట్టి ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. దానికి నెల్లూరు రంగస్థలం అయ్యింది. అమరజీవి పొట్టి శ్రీరాములు జీవితం గురించి తెలిసిన విషయాల కన్నా తెలియని సంగతులు ఎక్కువ ఉన్నాయి

0
0 views

Comment