రాజాం రూరల్ సీఐ ఉపేంద్రకు ఎస్పీ ప్రశంసలు
విజయనగరం జిల్లా.రాజాం:
రాజాం రూరల్ సీఐగా విధులు నిర్వర్తిస్తున్న హనుమంతు ఉపేంద్రరావును జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ప్రత్యేకంగా అభినందించారు. ఇటీవల రాజాం పట్టణంలో జరిగిన భారీ దొంగతనం కేసును ఛేదించడంలో చూపిన చాకచక్యానికి గుర్తింపుగా ఆయనకు ప్రశంస పత్రం మరియు ప్రోత్సాహక నగదు అందజేశారు.
ఈ కేసులో అంతర్రాష్ట్ర స్థాయిలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ధారా గ్యాంగ్‌ను పట్టుకోవడానికి మధ్యప్రదేశ్ రాష్ట్రానికి వెళ్లి, కీలక సమాచారాన్ని సేకరించి నిందితులను అదుపులోకి తీసుకురావడంలో సీఐ ఉపేంద్రరావు కీలక పాత్ర పోషించారు. ఆయన చొరవ, దర్యాప్తు నైపుణ్యం పట్ల ఎస్పీ దామోదర్ ప్రశంసలు కురిపించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, పోలీసు అధికారులు తమ విధుల్లో అంకితభావంతో పని చేస్తే మంచి ఫలితాలు సాధ్యమవుతాయని, ఉపేంద్రరావు వంటి అధికారులు శాఖకు గర్వకారణమని పేర్కొన్నారు.