జాతీయస్థాయి దివ్యాంగ క్రీడాకారుడు గౌతమ్ ను సత్కరించిన ఐఎంఏ రాష్ట్ర నాయకులు.
నంద్యాల (AIMA MEDIA): మార్చి 18వ తేదీ నుండి 21వ తేదీ వరకు ఒరిస్సా రాష్ట్రంలోని భువనేశ్వర్ లో జరగనున్న 24వ జాతీయ పారా ( దివ్యాంగ) అథ్లెటిక్ ఛాంపియన్ షిప్ పోటీలలో షాట్ పుట్ విభాగంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో విజేతగా నిలిచి రాష్ట్రం తరఫున పాల్గొనేందుకు ఎంపికైన నంద్యాల జిల్లా దివ్యాంగ క్రీడాకారుడు గౌతమ్ ను ఐఎంఏ రాష్ట్ర నాయకులు ఘనంగా సత్కరించారు. నంద్యాల జిల్లా పారా స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు, ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ ఆధ్వర్యంలో స్థానిక మధుమణి సమావేశ భవనంలో నిర్వహించిన అభినందన కార్యక్రమంలో ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ బాలరాజు, రాష్ట్ర ఐఎంఏ ప్రెసిడెంట్ ఎలెక్ట్ డాక్టర్ పి.ఎస్. శర్మ, రాష్ట్ర ఐఎంఏ ఉపాధ్యక్షులు ఏవి సుబ్బారెడ్డి, రాష్ట్ర ఐఎంఏ ప్రధాన కార్యదర్శి సుభాష్ చంద్రబోస్, ఐఎంఏ రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు డాక్టర్ పనిల్ కుమార్, డాక్టర్ సునీల్ కుమార్, రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఫణిధర్ లు గౌతమ్ ను శాలువా, జ్ఞాపికతో ఘనంగా సత్కరించారు. ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ బాలరాజు గౌతమ్ కు రెండు వేల రూపాయల నగదు సహకారం అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ బాలరాజు మాట్లాడుతూ దివ్యాంగులను అన్ని రంగాలలో ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని అన్నారు. నంద్యాల వైద్యులు దివ్యాంగులకు అందిస్తున్న సేవలు దేశంలోనే ఆదర్శప్రాయం అని కొనియాడారు.డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ గౌతమ్ జాతీయస్థాయిలో కూడా విజేతగా నిలిచి రాష్ట్రానికి నంద్యాల జిల్లాకు పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.దివ్యాంగులలో క్రీడల పట్ల ఆసక్తి ఉన్నవారు నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.