logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

శంకరాభరణం, 46ఏళ్ళ అందమైన జ్ఞాపకం

శంకరాభరణం, 46ఏళ్ళ అందమైన జ్ఞాపకం
కె.విశ్వ‌నాథ్‌, వంశీ ఇద్ద‌రూ నా అభిమాన ద‌ర్శ‌కులు. శంక‌రాభ‌ర‌ణం సినిమాకి వంశీ అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా ప‌ని చేసారు. 1980లో వెండితెర న‌వ‌ల కూడా రాసారు. ఇపుడు రీప్రింట్ చేసారు. శంక‌రాభ‌ర‌ణం షూటింగ్ విశేషాలు, మ్యూజిక్ సిటింగ్స్, విశ్వ‌నాథ్ త‌ప‌స్సు అన్నీ ఈ పుస్త‌కంలో వున్నాయి.
అయితే శంక‌రాభ‌ర‌ణం విడుద‌ల రోజు ఏం జ‌రిగిందో నేను చెప్తాను. చిన్న‌ప్పుడు విశ్వ‌నాథ్ సినిమాలు చాలా చూసాను. పోస్ట‌ర్ మీద హీరో బొమ్మ‌ని మాత్ర‌మే చూసే రోజులు. బాగా న‌చ్చిన‌వి శార‌ద‌, జీవ‌న‌జ్యోతి. అపుడు విశ్వ‌నాథ్ ఎవ‌రో నాకు తెలియ‌దు.
సిరిసిరిమువ్వ సినిమాకి మా నాన్న మొద‌టి రోజు ఉద‌యం ఆట‌కే తీసుకెళ్లాడు. పాట‌లు, క‌థ తెగ న‌చ్చాయి. ఇంట‌ర్వెల్‌లో మురుకులు కొనిస్తూ డైరెక్ట‌ర్ విశ్వ‌నాథ్ చాలా గొప్పోడురా అని నాన్న అన్నాడు. సినిమాలంటే చాలా ఇష్ట‌మ‌ని , ష‌ర్మిలా ఠాగూర్ ఆయ‌న అభిమాన హీరోయిన్ అని నాకు తెలియ‌దు. తండ్రుల క‌ఠిన‌త్వ‌మే త‌ప్ప‌, వాళ్ల‌కి ఇష్టాలు, ప్రేమ క‌థ‌లు కూడా వుంటాయ‌ని తెలియ‌ని జ‌న‌రేష‌న్ మాది. బ‌తికున్న‌పుడే గుర్తు ప‌ట్టాలి, గుర్తుంచుకోవాలి. నాన్నంత వయ‌సు వ‌స్తే త‌ప్ప నాన్న అర్థంకాదు.
సీతామాల‌క్ష్మితో నేను విశ్వ‌నాథ్ వీరాభిమాని.
జ‌న‌వ‌రి 30, 1980. అనంత‌పురం శాంతి థియేట‌ర్ ద‌గ్గ‌ర సైకిళ్లు ఆపాం. చేతిలో వీణ‌తో సోమ‌యాజులు, డాన్స్ చేస్తున్న మంజుభార్గ‌వి చిన్న క‌ట‌వుట్ క‌నిపించింది. విశ్వ‌నాథ్ సినిమా కాబ‌ట్టి చూద్దామ‌న్నాను. నా మిత్రులు ప‌గ‌ల‌బ‌డి న‌వ్వారు.
"వీణ‌తోనే కొట్టి చంపేస్తాడు ఆ ముస‌లోడు" అన్నారు. జ‌య‌మాలిని వేవ్ న‌డుస్తున్న రోజుల‌వి. మంజుభార్గ‌విని మేము వ్యాంప్‌గా కూడా గుర్తించ‌లేదు.
ఫిబ్ర‌వ‌రి 2, శంక‌రాభ‌ర‌ణం విడుద‌ల‌.
ఉద‌యం 11.30కి మొద‌టి ఆట‌. టికెట్ నేనే పెడ‌తానన్నా ఫ్రెండ్స్‌ ఒక్క‌రు కూడా ధైర్యం చేయ‌లేదు. ఎండ‌కి సైకిల్ తొక్కుకుంటూ వెళ్లాను. శాంతి థియేట‌ర్ బోసిపోయి వుంది. సైకిల్ స్టాండ్‌వాడు కూడా చిరాగ్గా వున్నాడు.
1-10 పైస‌ల టికెట్ తీసుకుని లోప‌ల‌కి వెళ్లాను. మొత్తం ఇర‌వై మంది కూడా లేరు. 70 పైస‌ల క్లాస్‌లో ఇద్ద‌రు కూడా లేరు.
సినిమా స్టార్ట‌యింది. అది వేరే లోకం. సంగీత జ‌ల‌పాతం.
ఇంట‌ర్వెల్‌లో మురుకు కొందామ‌ని వెళితే అమ్మేవాడు దిగాలుగా క‌నిపించాడు.
"ఏమ‌ప్పా, ఇట్లా సినిమాలు ఇంకో నాలుగేస్తే మ‌నం అడ‌క్క తినాల్సిందే" అని సోడా వాడితో అంటున్నాడు. అత‌ను త‌లూపుతున్నాడు.
సినిమా అయిపోయే స‌రికి చెంప‌లు త‌డుస్తున్నాయి. ఆరేసుకోబోయి పారేసుకో పాట‌కి చిల్ల‌ర విసిరే బ్యాచ్ నేను. ఎందుకంత‌గా క‌నెక్ట్ అయ్యానో తెలీదు. నా వ‌య‌సు 17 అపుడు.
థియేట‌ర్ నుంచి బ‌య‌టికొస్తే మ్యాట్నీకి ఓ 30 మంది వున్నారు. అంద‌రూ టాక్ కోసం మా ముఖాలు చూస్తున్నారు. అడ‌గ‌ని వాళ్ల‌కు కూడా చెప్పా బ్ర‌హ్మాండ‌మ‌ని.
ఫోన్లు, సోష‌ల్ మీడియా లేని కాలంలో , ఏదో మ్యాజిక్ జ‌రిగింది. సాయంత్రానికి కూల్ డ్రింక్ షాపుల ద‌గ్గ‌ర శంక‌రా అని పాట‌లు వినిపిస్తున్నాయి. ఫ‌స్ట్ షోకి శాంతి థియేట‌ర్ కిట‌కిట‌లాడుతూ వుంది.
మ‌రుస‌టి రోజు ఫ‌స్ట్ షోకి వెళ్లాను. అతి క‌ష్టం మీద టికెట్ దొరికింది. సైకిల్ స్టాండ్ వాడు చిల్ల‌ర వేగంగా లెక్క పెడుతున్నాడు.
హౌస్‌ఫుల్ థియేట‌ర్‌లో ప్రేక్ష‌కులంతా ఏదో ధ్యానంలో వున్న‌ట్టు చూసారు.
ఇంట‌ర్వెల్‌లో మురుకుల వాడికి నాలుగు చేతులున్నా చాలేట్లు లేవు. సోడాలు నాన్‌స్టాఫ్‌గా కుయ్యిమంటున్నాయి. షో వ‌దిలితే ట్రాఫిక్ జాం.
శంక‌రాభ‌ర‌ణం ప్ర‌భావం ఎంత‌లా అంటే అనంత‌పురంలో అంత మంది సంగీతం టీచ‌ర్లున్నార‌ని అప్ప‌టి వ‌ర‌కూ తెలియ‌దు. త‌ల్లితండ్రులు పిల్ల‌ల్ని సంగీతం క్లాసుల్లో చేరుస్తున్నారు.
1980 నాటికి అనంత‌పురం ట‌వున్‌కి రౌడీయిజం అని పేరు. ఫ్యాక్ష‌న్ జిల్లా, క‌రువు ప్రాంతం. రూపాయి కూలీ దొర‌కాలంటే క‌ష్టం. మ‌రి శంక‌రాభ‌ర‌ణం లాంటి క్లాసిక్‌ని అంత‌గా ఎందుకు గుండెల‌కి హ‌త్తుకున్నారు? వూర్లోని వీధుల‌న్నీ ఎందుకు పాట‌ల‌తో ప్ర‌తిధ్వ‌నించాయి?
రాయ‌ల‌సీమ గురించి బ‌య‌ట వినిపించేది వేరు, వాస్త‌వం వేరు. ఇక వంశీ గురించి...
మంచుప‌ల్ల‌కి (1982)ని నేను చిరంజీవి కోసం చూసాను. సితారాని ఇళ‌య‌రాజా పాట‌ల కోసం. సినిమాలు బావున్నాయి కానీ, ద‌ర్శ‌కుడి పేరు అంత‌గా రిజిస్ట‌ర్ కాలేదు.
అన్వేష‌ణ‌తో (85) మైండ్ పోయింది. ఎన్నిసార్లు చూసానో గుర్తు లేదు. లేడీస్ టైల‌ర్ మొద‌టి రోజు నేనూ, మిత్రుడు ప్ర‌సాద్ సెకెండ్ షో చూసాం. రాత్రంతా ఆ సినిమా గురించి ప‌గ‌ల‌బ‌డి న‌వ్వుకున్నాం.
ప్ర‌సాద్ అనారోగ్యంగా వున్న‌పుడు, లేడీస్ టైల‌ర్ రోజులు గుర్తు చేస్తే అర‌గంట సేపు న‌వ్వాడు. అంతలా న‌వ్వడం అదే ఆఖ‌రు. ఇపుడు లేడు.
శంక‌రాభ‌ర‌ణం న‌వ‌ల ఎందుకు చ‌ద‌వాలంటే , పాత‌త‌రం జ్ఞాప‌కాల్ని త‌డుముకోడానికి. కొత్త‌త‌రం ఒక క్లాసిక్ గురించి తెలుసుకోడానికి. చిన్న న‌వ‌ల‌. చ‌దువుతున్నంత సేపు సినిమా చూస్తున్న‌ట్టే వుంటుంది. వంశీ గొప్ప శైలి అది.
ప్ర‌తి సీన్ వెనుక షూటింగ్ క‌ష్టాలు కూడా అర్థ‌మ‌వుతాయి.
కె.విశ్వ‌నాథ్ గంధపు చెక్క‌లాంటివారు. ఆయ‌న స‌హ‌చ‌రం కూడా ప‌రిమ‌ళిస్తుంది. శంక‌రాభ‌ర‌ణానికి ప‌ని చేసిన‌ వాళ్లు త‌రువాత గొప్ప ద‌ర్శ‌కుల‌య్యారు.
వంశీ, జంధ్యాల , బాలూ మ‌హేంద్ర‌.
మార్క్స్‌, అంబేద్క‌ర్ ప‌రిచ‌యం త‌ర్వాత విశ్వ‌నాథ్ భావ‌జాలంతో నాకు విభేదాలున్నాయి. కానీ ఫిల్మ్ మేకింగ్‌, స్టోరీ టెల్లింగ్‌లో ఆయ‌న మాస్ట‌ర్‌. నాన్ లీనియ‌ర్ ప‌ద్ధ‌తిలో ఆయ‌న‌లా క‌థ చెప్పేవాళ్లు భార‌త‌దేశంలో వేళ్ల మీద లెక్క‌పెట్టేవాళ్లు మాత్ర‌మే వున్నారు. ఆయ‌న త‌న‌కి తెలిసింది, చూసిందే చెప్పాడు. ఏం చెప్పినా మంచే చెప్పాడు.
శంక‌రాభ‌ర‌ణాన్ని చాలాసార్లు చూసాను. ఎపుడు చూసినా కొత్త‌గానే వుంటుంది. మంచి సినిమాకి వ‌య‌సుండ‌దు. ప్రేక్ష‌కులే పెద్ద వాళ్ల‌వుతారు.
మ‌హాన‌టిలో న‌రేష్‌కి ఒక డైలాగుంది.
"నాకు తెలిసి సావిత్రి గారిని సావిత్రి అని ఎవ‌రూ అన‌రు"
ఈ వ్యాసంలో విశ్వ‌నాథ్‌కి , వంశీకి గారు అనే గౌర‌వ వాచ‌కం వాడ‌లేదు. గారు, శ్రీ‌, వాడ‌కూడ‌ద‌ని జ‌ర్న‌లిజంలో ప్రాథ‌మిక సూత్రం. అదే అనుస‌రించాను.
నిజానికి విశ్వ‌నాథ్‌, వంశీల‌కి ఒక గారు చాలదు. వాళ్లు "గారు" ఇన్‌ఫినిటీ.
ఈ పుస్త‌కం చ‌ద‌వండి. మామ సంగీతం, బాలు గొంతు, వేటూరి ప‌దాలు అంత‌ర్లీనంగా వినిపిస్తుంటాయి. విశ్వ‌నాథ్ క‌నిపిస్తుంటారు

0
68 views

Comment