అడబాల గారు 1936
రంగస్థల నటుడు, రూపశిల్పి, లలిత కళా సమితిలో స్థాపక సభ్యుడు, రంగస్థల అధ్యాపకులు. రంగస్థలంతో ఆరుపదుల వసంతాల అనుబంధంలో నటుడిగా 30 నాటకాల్లో పాత్రలు ధరించి, రూపశిల్పిగా దాదాపు నాలుగువేల నృత్య, నాటక ప్రదర్శనలకు మేకప్ చేసిన బహుముఖ ప్రజ్ఞశాలి టి.ఆర్ అడబాల ( తిరుపతి రావు అడబాల) గారి వర్ధంతి జ్ఞాపకం !
అడబాల గారు 1936, ఫిబ్రవరి 9 న తూర్పు గోదావరి జిల్లాలో జన్మించారు. వారి తల్లిదండ్రులు సత్యమ్మ, వెంకన్ననాయుడు. గార్లు.
......
నాటకరంగానికి రూపశిల్పిగా సుపరిచితులు. ఆ శాఖలో లోతుపాతులు కూలంకషంగా, శాస్త్రీయ పద్ధతులలో అధ్యయనం చేసి నైపుణ్యం సంపాదించాడు. జాతీయ స్థాయిలో నాటక విద్యాసంస్థల్లో విద్యార్థులకు ఆహార్యంలో మెళకువలు బోధించాడు. సీనియర్ మేకప్ ఆర్టిస్టులలో ఆడబాల ముఖ్యులు. ఈయన బి.ఏ పట్టభద్రుడు. డాక్టర్ గరికపాటి రాజారావు వద్ద నటనలోను, ఆదర్శ నాట్యమండలి, పాలకొల్లుకి చీఫ్ మేకప్ ఆర్టిస్టు అయిన మెషక్ వద్ద మేకప్‌లోనూ శిక్షణ పొందాడు.
.......
అడబాల బాల్యదశ నుండే నాటకాల్లో వేషాలు వేశారు. విద్యార్థి దశలో భమిడిపాటి 'ఇప్పుడు' అనే నాటికలో శానయ్య పాత్ర ధరించి శభాష్ అనిసించుకున్నారు. 1940 నుంచీ పినిసెట్టి శ్రీరామమూర్తి నిర్వహించిన ఆదర్శ నాట్యమండలి పక్షాన ప్రదర్శించిన పల్లెపడుచు, అన్నాచెల్లెలు తదితర నాటకాల్లో పాల్గొన్నారు. మద్రాస్ లో రైల్వేశాఖ ఉద్యోగం కె. వేంకటేశ్వరరావు శిక్షణలో ర.స.న సమాఖ్యలో ఫణి, రాగరాగిణి వంటి ప్రతిష్ఠాత్మక నాటకాలలో పాల్గొన్నాడు. పలుచోట్ల ఉత్తమ నటుడిగానూ, హాస్య నటుడిగానూ బహుమతులు అందుకున్నారు. ఎన్నో నాటక పరిషత్ పురస్కారాలతోపాటు 2004లో చమన్ లాల్ మెమోరియల్ సొసైటీ - న్యూఢిల్లీ వారి నుండి పాతికవేల నగదుతో జాతీయ పురస్కారాన్ని కూడా అందుకున్నారు.
........
1958లో ఉద్యోగరీత్యా మద్రాసులో ఉన్నప్పుడు కొందరు తెలుగు వాళ్ళతో కలిసి 'ఆంధ్రకళామండలి' స్థాపించాడు. అక్కడి రైల్వే క్యాంటీన్ లోనే నాటకాల రిహార్సల్సు జరిపేవాళ్ళు. మద్రాసు - వాణీమహల్లో జరిగిన పరిషత్ పోటీల్లో ఆత్రేయ 'కప్పలు', భమిడిపాటి రాధాకృష్ణ 'ఇదేమిటి?' ప్రదర్శించారు. 1963లో తిరుపతి - శ్రీ వేంకటేశ్వర నాట్యకళా పరిషత్తులో 'కప్పలు' ప్రదర్శించినపుడు అడబాల 'భద్రయ్య' పాత్ర ధరించి 'బెస్ట్ డైలాగ్ డెలివరి' బహుమతి పొందారు.
......
1966లో సికింద్రాబాద్ కు వచ్చిన అడబాల 1967లో ఆంధ్ర లలిత కళాసమితిని స్థాపించిన వ్యవస్థాపక సభ్యులు. ఎ.ఆర్. కృష్ణ ఆధ్వర్యంలో చాలా నాటకాల్లో పాల్లొన్నారు. అందులో ముఖ్యమైనది మాలపల్లి. నేరము- శిక్ష, కప్పలు, నీలా తెరలు, లేపాక్షి, ఆశ్రయం, అరణి, వీలునామా మొదలైన నాటకాలు, మానవుడు, పెళ్ళిచూపులు, పగ, అమ్మ, రాజీవం, రాతిమనిషి మొదలైన నాటికలు నటుడిగా అడబాలకు పేరు తెచ్చాయి.
......
అనేక రకాల పరిషత్తులతో పాటు , దశాబ్దానికి పైగా రవీంద్ర భారతి , త్యాగరాయ గాన సభలలో ప్రదర్శించిన వేల నాటకాలకు ఈయనే ఆహార్యం. .ప్రముఖ నాటక దర్శకులు అయినా DSN మూర్తి నుంచి విశ్వ విద్యాలయాల విద్యార్థుల ప్రదర్శనలకు కూడా ఈయనే మేకప్ చేశారు , తల్లా వజ్జుల సుందరం, వెంకట్ గోవాడ , ఉదయ్ భాగవతుల , కోటా శంకర్రావు , కోట్ల హనుమత్ రావు , పెద్ది రామారావు , గుమ్మడి గోపాలకృష్ణ , గోపా రాజు , ఎం . స్ . చౌదరి లాంటి ప్రముఖ నాటక దర్శకులు , వారి వారి సంజలతో కూడిన అనుభవం మాత్రమే కాకుండా రాసారంజని , పొట్టి శ్రీరాములు విశ్వ విద్యాలయం , సాంస్కృతిక విభాగం లాంటి సంస్థలతో 30 ఏళ్లకు పైగా మేకప్ మెన్ గా పనిచేసిన అనుభవం వీరికి మాత్రమే ఉన్న చరిత్ర .
.....
అడబాల గారు కొన్ని టీవీ సీరియల్స్‌లో, అగ్నిప్రవేశం, స్టూవర్టుపురం పోలీసుస్టేషన్ మొదలైన చిత్రాల్లో కూడా నటించాడు. న్యూఢిల్లీలోని నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాకి విజిటింగ్ ఫాకల్టీగా చేశారు. ఉస్మానియా, హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లోని రంగస్థల కళల శాఖలో విజిటింగ్ లెక్చరర్ గా పనిచేశారు. టి.ఆర్ అనేక మంది శిష్యులు ఆహార్యంలో నైపుణ్యం సంపాదించారు.
అడబాల గారు 2013, మార్చి 14న మరణించారు.