logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

సముద్రాల సీనియర్

ప్రసిద్ధి చెందిన రచయిత, నిర్మాత, దర్శకుడు, నేపథ్యగాయకుడు, తెలుగు సినిమా పరిశ్రమలో సముద్రాల సీనియర్ గా సుప్రసిద్దులు అయిన
సముద్రాల రాఘవాచార్య గారి వర్ధంతి జ్ఞాపకం!
సముద్రాల సీనియర్ గారి ప్రసిద్ధ సినిమా
గీతాలు జయ జయ శ్రీరామా…”
(జయసింహ), “నారాయణ హరి నారాయణ…” (చెంచులక్ష్మి), “దేవదేవ ధవళాచల మందిర గంగాధర…” (భూ కైలాస్), “సీతారాముల కళ్యాణం
చూతమురారండి”(సీతారామకళ్యాణం), “జగదభి రాముడు… శ్రీరాముడే”, “రామకథను వినరయ్యా…”, “వినుడు వినుడు రామాయణగాథ…”, “శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా…”(లవకుశ) – ఇలా భక్తి పారవశ్యం కురిపించే గీతాలు పలికించినా… “జగమే మాయా బ్రతుకే మాయా…” అంటూ విషాదం చిలికించినా, “చిగురాకులలో చిలకమ్మా…” అంటూ పల్లవింప చేసినా ఆయనకే చెల్లింది.
.....
“ఓరోరీ…మాయాద్యూత విజయ, మధుమదన్మోత్తా… దుర్యోధనా…” అంటూ భీమసేనునితోనూ, “బానిసలు… బానిసలకు ఇంత అహంభావమా?…” అని దుర్యోధనునితోనూ జనం మెచ్చేలా ‘పాండవవనవాసము’లో పలికించినా, “దిగ్దిశాంత విశ్రాంత యశోవిరాజితమై… నవఖండ భూమండల పరివ్యాప్తమై…”అంటూ ‘శ్రీక్రిష్ణపాండవీయం’లో సుయోధనుని నోట సమాసభూయిష్టమైన సంభాషణలు వల్లింప చేసినా అనితరసాధ్యం అనిపించేలా చేసిందీ
కూడా సముద్రాల సీనియర్ గారే.
......
సముద్రాల రాఘవాచార్య కుమారుడు సముద్రాల రామానుజాచార్య సముద్రాల జూనియర్ గా తెలుగు చిత్ర పరిశ్రమ పరిచయము. పి.వి.దాసు నిర్మించిన శశిరేఖా పరిణయం సినిమాకు కొన్ని సన్నివేశాలు వ్రాయడంతో సినీ వ్యాసంగాన్ని ప్రారంభించిన సముద్రాల వందకు పైగా సినిమాలకు స్క్రిప్టులను వ్రాసారు. అనేక పాటలు కూడా వ్రాసారు. ఈయన వినాయకచవితి (1957), భక్త రఘునాథ్ (1960), బభృవాహన (1964) సినిమాలకు దర్శకత్వం కూడా వహించారు.
......
సముద్రాల వేంకట రాఘవాచార్య గుంటూరు జిల్లా, పెదపులివర్రు (భట్టిప్రోలు) గ్రామంలో 1902, జూలై 19వ తేదీన పండితవంశంలో జన్మించారు. ఇతడు తొమ్మిదవ తరగతి చదువుతున్నప్పుడే కవిత్వం చెప్పడం ప్రారంభించారు. ఇతడు ప్రాచీన ఆధునిక సాహిత్యాలను విస్తృతంగా చదివి 1925లో "భాషాప్రవీణ" పరీక్ష ఉత్తీర్ణులైనారు. ఉప్పుసత్యాగ్రహంలో పాల్గొని కారాగారశిక్షను అనుభవించారు. 1918 నుండి అవధానాలను చేయడం మొదలుపెట్టారు. వీరి అవధాన ప్రావీణ్యాన్ని గురించి విన్న జాగర్లమూడి కుప్పుస్వామి చౌదరి వీరిని కుమారునికి తెలుగు నేర్పవలసినదిగా కోరారు. వారి అభ్యర్థనను మన్నించిన సముద్రాల తన మకామును గుంటూరుకు మార్చారు. అక్కడ వారికికొసరాజు రాఘవయ్య చౌదరి, గూడవల్లి రామబ్రహ్మంలతో స్నేహం ఏర్పడింది. కట్టమంచి రామలింగారెడ్డి రెడ్ల చరిత్రపై పరిశోధన చేస్తున్నట్టు తెలుసుకున్న కుప్పుస్వామి చౌదరి వీరిని, కొసరాజును, గూడవల్లిని మద్రాసు వెళ్లి కమ్మ చరిత్రపై పరిశోధనలు చేయవలసినదిగా అభ్యర్థించారు. మద్రాసులో వీరు ప్రాచ్యలిఖిత పుస్తక భాండాగారంలో కమ్మచరిత్రపై పరిశోధన చేస్తూ, సమదర్శిని పత్రికలో కూడా పనిచేసారు. సమదర్శిని కారణాంతరాల వల్ల నిలిచిపోగా వీరు మళ్ళీ గుంటూరుకు చేరారు. కృష్ణాజిల్లా ప్రజామిత్ర పక్షం వారు విజయవాడలో ప్రారంభించిన ప్రజామిత్ర పత్రికను మద్రాసుకు తరలించి దానికి సంపాదకునిగా గూడవల్లిని నియమించారు. గూడవల్లి అభ్యర్థన మేరకు సముద్రాల తిరిగి మద్రాసు చేరి ప్రజామిత్రలో సహాయ సంపాదకునిగా చేరారు. ప్రజామిత్ర ప్రచురించే బి.ఎన్.కె ప్రెస్ యజమానులైన బి.యన్.రెడ్డి, బి.నాగిరెడ్డి సోదరులతో వీరికి పరిచయం ఏర్పడింది.
• సినీరంగప్రవేశం...
వేల్ పిక్చర్స్ అధినేత పి.వి.దాస్‌తో గూడవల్లి రామబ్రహ్మంకు ఉన్న పరిచయం వల్ల ఆయనతోపాటు సముద్రాల రాఘవాచార్య
తరచూ స్టూడియోకు వెళుతుండేవాడు. ఆ స్నేహంతో సీతాకళ్యాణం, శ్రీకృష్ణ లీలలు సినిమాలకు ప్రకటనలు వ్రాసియిచ్చాడు. తరువాత వేల్ పిక్చర్స్ వారి మాయాబజార్, ద్రౌపదీ వస్త్రాపహరణం సినిమాలలో కొన్ని మార్పులు చేర్పులు అవసరమైతే సహకరించాడు. ఆ విధంగా ఇతడు సినిమా రచనలో అనుకోకుండా వేలుపెట్టాడు. తరువాత కనకతార సినిమాలో ఇతనికి సంభాషణలు, పాటలు వ్రాసే అవకాశం చిక్కింది. కనకతార నిర్మాణ సమయంలోనే బి.యన్.రెడ్డి, హెచ్.ఎం.రెడ్డిలు రోహిణీ పిక్చర్స్ అనే సినీనిర్మాణ సంస్థను స్థాపించి గృహలక్ష్మి సినిమాకు ఇతడిని రచయితగా పెట్టుకున్నారు. తరువాత బి.యన్.రెడ్డి రోహిణి సంస్థనుండి బయటకు వచ్చి వాహినీ సంస్థను స్థాపించాడు. వాహిని సినిమాలకు సముద్రాల ఆస్థాన రచయితగా మారిపోయాడు. ఇతడు దాదాపు 80 చిత్రాలకు పనిచేసి సుమారు 1000 పాటలను రచించారు.
.....
అనేక చిత్రాలు సముద్రాల రాఘవాచార్య రచనతో విజయకేతనం ఎగురవేశాయి. వినోదవారి ‘దేవదాసు’కు సముద్రాల వారి సాహిత్యమే దన్నుగా నిలచింది. యన్.ఏ.టి. బ్యానర్ లో తొలి విజయంగా నిలచిన ‘జయసింహ’కు, అన్నపూర్ణవారి తొలి చిత్రం ‘దొంగరాముడు’కు కూడా సముద్రాల రచన తోడుగా సాగింది. సముద్రాల ఎన్ని చిత్రాలకు పాటలు, మాటలు రాసినా, ఆయన పేరు వినగానే తెలుగునాట ఈ నాటికీ కోవెలలలో వినిపించే భక్తిగీతాలే గుర్తుకు వస్తాయి. ముఖ్యంగా పౌరాణిక చిత్రాలు “భూకైలాస్, దీపావళి, సీతారామకళ్యాణం, లవకుశ, నర్తనశాల, పాండవవనవాసము, శ్రీక్రిష్ణ పాండవీయం” మన మదిలో ముందుగా మెదలుతాయి.
....
మెగాఫోన్ పట్టి దర్శకునిగా “వినాయక చవితి, భక్త రఘునాథ్, బభ్రువాహన” చిత్రాలు రూపొందించారు. ఈ మూడు చిత్రాలలో యన్టీఆర్ నటించడం విశేషం. ‘భక్త రఘునాథ్’లో సముద్రాల వారి కోరికపైనే యన్టీఆర్ శ్రీకృష్ణునిగా గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చారు. “దేవదాసు, శాంతి, స్త్రీ సాహసం” వంటి చిత్రాల నిర్మాణంలోనూ సముద్రాల పాలు పంచుకున్నారు. ‘భక్త రఘునాథ్’లో ఓ పాటలో గొంతు కూడా కలిపారు. ఆయన కలం నుండి చివరగా జాలువారిన పాట, పద్మనాభం నిర్మించి, నటించిన ‘శ్రీరామకథ’ చిత్రంలోని “రామకథ శ్రీరామకథ…” అంటూ సాగేది. ఈ పాట రాసిన మరుసటి రోజునే అంటే 1968 మార్చి 16న ఆయన కన్నుమూశారు. తెలుగు చిత్రసీమలో చెరిగిపోని, తరిగిపోని స్థానం సంపాదించిన రచయితగా సముద్రాల రాఘవాచార్య నిలిచారు.
......
హైదరాబాద్ ఫిలిమ్ నగర్ లో సముద్రాల రాఘవాచార్య విగ్రహం కూడా నెలకొల్పారు. ఇప్పటికీ సముద్రాల సీనియర్ జయంతి, వర్ధంతి సందర్భాల్లో అభిమానులు విగ్రహాన్ని పూలమాలలతో నింపుతూనే ఉండడం విశేషం!

4
37 views

Comment