క్యాన్సర్ రహిత సమాజం కోసం అందరం కలిసి పనిచేద్దాం – ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
భారతదేశ మహిళలు ఎదుర్కొంటున్న ప్రధాన ఆరోగ్య సమస్యల్లో బ్రెస్ట్ క్యాన్సర్ ఒకటని కోవూరు ఎమ్మెల్యే మరియు టీటీడీ పాలక మండలి సభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు పేర్కొన్నారు.
తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రి పద్మావతి ఆడిటోరియంలో బ్రెస్ట్ ఇమేజింగ్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ సెమినార్‌లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ, బ్రెస్ట్ క్యాన్సర్ ప్రాణాంతకమైన వ్యాధి అయినప్పటికీ ప్రాథమిక దశలోనే గుర్తిస్తే 90 శాతం వరకు చికిత్స ద్వారా నయం చేసే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. సరైన అవగాహన లేకపోవడం వల్ల చాలా మంది మహిళలు క్యాన్సర్ లక్షణాలను సకాలంలో గుర్తించలేకపోతున్నారని, దాంతో 50 శాతం పైగా కేసులు తీవ్ర స్థాయికి చేరిన తరువాతే గుర్తిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
“వైద్యం కన్నా నివారణే మిన్న” అనే నినాదాన్ని గ్రామ గ్రామానికి తీసుకెళ్లాలని, ముఖ్యంగా గ్రామీణ మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉందని ఆమె సూచించారు. స్వచ్ఛంద సంస్థలు, ఆశా కార్యకర్తలు, మహిళా ఆరోగ్య కార్యకర్తలను సమన్వయం చేసుకుని గ్రామీణ మహిళలను చైతన్య పరచాలని పిలుపునిచ్చారు.
వైద్య రంగంలో ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు డిజిటల్ మమోగ్రఫీ వంటి ఆధునిక సాంకేతికతలు అందుబాటులోకి వచ్చాయని, వీటి ద్వారా క్యాన్సర్‌ను అత్యంత ఖచ్చితంగా గుర్తించవచ్చని ఆమె తెలిపారు. ఈ సాంకేతికతలు కేవలం నగరాలకే కాకుండా మారుమూల గ్రామాలలోని పేద మహిళలకు కూడా అందుబాటులోకి రావాలని సూచించారు.
స్విమ్స్ వైద్యుల సహకారంతో కోవూరు నియోజకవర్గంలో రెండు నెలల పాటు పింక్ బస్సు ద్వారా 35 సంవత్సరాలు పైబడిన మహిళలకు ఉచిత క్యాన్సర్ పరీక్షలు నిర్వహించి, కొందరు మహిళల్లో ప్రాథమిక దశలోనే బ్రెస్ట్ క్యాన్సర్‌ను గుర్తించిన అనుభవాన్ని ఆమె వివరించారు.
భవిష్యత్తులో టీటీడీ మరియు ప్రభుత్వ మద్దతుతో మరిన్ని మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ యూనిట్లు ఏర్పాటు చేసి ప్రతి మహిళకు ముందస్తు గుర్తింపు పరీక్షలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆమె తెలిపారు.
వైద్య శాస్త్రం కేవలం పరిశోధనలకే పరిమితం కాకుండా సామాన్యుల ప్రాణాలను కాపాడే ఆయుధంగా మారాలని వైద్యులను ఆమె కోరారు. మన అందరి లక్ష్యం “క్యాన్సర్ రహిత భారతదేశం” కావాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో రేడియాలజీ విభాగానికి చెందిన పలువురు ప్రొఫెసర్లు మరియు వైద్యులు పాల్గొన్నారు.