ఆదివాసీ సంస్కృతి దేశానికే గర్వకారణం
జిల్లా కలెక్టర్ రాజర్షి షా
జిల్లాలో ఘనంగా గోండీ ధర్మగురువు హీరాసుక్కా బాబా జయంతి ఉత్సవాలు
పత్రికా ప్రకటన
మార్చి 15, 2026 – ఆదిలాబాద్
ఆదివాసీల ఆరాధ్య దైవం, గోండీ ధర్మగురువు హీరాసుక్కా బాబా జయంతి సందర్భంగా ఆదివారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బస్ స్టాండ్ సమీపంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ముందుగా హిరాసుక్కా చిత్రపటానికి పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలు దేశానికే గర్వకారణమని కొనియాడారు. హీరాసుక్కా జయంతి సందర్భంగా జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం ఆనందదాయకమని పేర్కొంటూ, ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం రూ.4 లక్షల ఆర్థిక సాయం అందజేసిందన్నారు.
పూజా కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా ఆదివాసీల ‘పేన్’, ‘వేన్’ (పూర్వీకుల ఆరాధన) విశిష్టతను తెలుసుకునే అవకాశం లభించిందన్నారు. ప్రకృతిని దైవంగా భావించే ఆదివాసీల జీవన విధానం ఎంతో గొప్పదని చెప్పారు. జల్, జంగల్, జమీన్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని భరోసా ఇచ్చారు.
ఆదివాసీ యువత విద్యపై దృష్టి సారించాలని సూచిస్తూ, ప్రస్తుతం ఆదివాసీ విద్యార్థులు ఎంబీబీఎస్, ఐఐటీ వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో సీట్లు సాధించడం శుభపరిణామమన్నారు. రిటైర్డ్ డీఎస్పీలు, ఎంఆర్ఓలను స్ఫూర్తిగా తీసుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు.
అనంతరం ఆదివాసి సాంప్రదాయాన్ని నృత్యలలో కలెక్టర్ పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో స్టేట్ ప్రెసిడెంట్ దుర్వా నగేశ్, సిడాం రాంకిషన్, ఆదివాసీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.