logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ధర్మవరం బీజేపీ ప్రశిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సత్య కుమార్ యాదవ్...



ధర్మవరం పట్టణంలో పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్ ఘనంగా నిర్వహించబడింది.
ధర్మవరం బీజేపీ ప్రశిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సత్య కుమార్ యాదవ్
పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ఆశయాలే బీజేపీ మార్గదర్శకం – మంత్రి సత్య కుమార్ యాదవ్

కార్యకర్తలే బీజేపీ బలం – దేశ సేవే బీజేపీ లక్ష్యం – మంత్రి సత్య కుమార్ యాదవ్
దేశాన్ని శక్తివంతమైన భారతంగా తీర్చిదిద్దడమే లక్ష్యం – మంత్రి సత్య కుమార్ యాదవ్

బీజేపీ ఒక పార్టీ కాదు, ఒక జాతీయ ఉద్యమం – మంత్రి సత్య కుమార్ యాదవ్
బూత్ స్థాయి నుండి పార్టీని బలోపేతం చేయాలి – మంత్రి సత్య కుమార్ యాదవ్ సూచన

ప్రశిక్షణ కార్యక్రమంలో కార్యకర్తలకు పార్టీ చరిత్ర, సిద్ధాంతాలపై అవగాహన కల్పించిన మంత్రి సత్య కుమార్ యాదవ్.
ధర్మవరం, మార్చి 14:– ధర్మవరం పట్టణంలోని పోలా ఫంక్షన్ హాల్‌ నందు మరియు ఆర్.ఆర్.ఆర్. ఫంక్షన్ హాల్ నందు ఆదివారం ధర్మవరం పట్టణ మరియు రూరల్ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్ -2026 కార్యక్రమంలో రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గానికి చెందిన పార్టీ నాయకులు, బూత్ స్థాయి కార్యకర్తలు, వివిధ మోర్చాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి సత్య కుమార్ యాదవ్ మాట్లాడుతూ.... బీజేపీ సాధారణ రాజకీయ పార్టీ కాదని, దేశ సేవను లక్ష్యంగా పెట్టుకుని ఏర్పడిన ఒక జాతీయ ఉద్యమమని పేర్కొన్నారు. పార్టీ చరిత్రను, సిద్ధాంతాలను ప్రతి కార్యకర్త లోతుగా తెలుసుకోవడం అత్యంత అవసరమని అన్నారు. ఈ ప్రశిక్షణ కార్యక్రమాల ముఖ్య ఉద్దేశం కూడా అదే అని ఆయన వివరించారు. బీజేపీ ఒక్కరోజులో ఏర్పడిన పార్టీ కాదని, దీని చరిత్ర చాలా గొప్పదని తెలిపారు. 1951లో మహానేత శ్యాం ప్రసాద్ ముఖర్జీ భారతీయ జనసంఘ్ అనే పార్టీని స్థాపించి జాతీయత, భారతీయ సంస్కృతి ఆధారంగా రాజకీయాలను ముందుకు తీసుకెళ్లారని చెప్పారు. ఆ ఉద్యమాన్ని బలోపేతం చేసిన ప్రముఖ తత్వవేత్త దీన్ దయాల్ ఉపాధ్యాయ గారు ప్రతిపాదించిన సమగ్ర మానవతావాదం(ఇంటెగ్రల్ హ్యుమానిజం) సిద్ధాంతం బీజేపీ ఆలోచనలకు పునాది అని ఆయన తెలిపారు. 1975లో అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ దేశంలో విధించిన భారత అత్యవసర పరిస్థితి(ఇండియన్ ఎమర్జెన్సీ) (1975–1977) సమయంలో ప్రజాస్వామ్య హక్కులు ప్రమాదంలో పడినప్పుడు, ప్రతిపక్ష పార్టీలు కలిసి ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు పోరాటం చేశాయని మంత్రి గుర్తుచేశారు. ఆ పోరాట ఫలితంగా ఏర్పడిన జనతా పార్టీ తరువాత కొన్ని రాజకీయ పరిణామాల వల్ల విభజనకు దారి తీసిందని చెప్పారు. దీంతో 1980 ఏప్రిల్ 6న భారతీయ జనతా పార్టీ అధికారికంగా స్థాపించబడిందని మంత్రి వివరించారు. ఆ పార్టీకి తొలి జాతీయ అధ్యక్షుడిగా దేశ రాజకీయాల్లో విశిష్ట స్థానాన్ని సంపాదించిన అటల్ బిహారీ వాజ్‌పేయి బాధ్యతలు స్వీకరించారని తెలిపారు. ఆయనతో పాటు లాల్ కృష్ణ అద్వానీ, మురళీ మనోహర్ జోషి వంటి నేతలు పార్టీని దేశవ్యాప్తంగా విస్తరించేందుకు కృషి చేశారని చెప్పారు. ప్రారంభంలో చిన్న పార్టీగా ఉన్న బీజేపీ, కార్యకర్తల కష్టపడి పనిచేసే తత్వం వల్ల క్రమంగా బలపడిందని మంత్రి పేర్కొన్నారు. 1998లో అటల్ బిహారి వాజపేయి నాయకత్వంలో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడి దేశ అభివృద్ధికి పలు కీలక నిర్ణయాలు తీసుకుందని ఆయన గుర్తుచేశారు. ప్రస్తుతం దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ నాయకత్వంలో బీజేపీ దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తోందని మంత్రి తెలిపారు. మంత్రి మాట్లాడుతూ, బీజేపీ ప్రభుత్వం దేశ ప్రజల సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని పలు మహత్తర పథకాలను అమలు చేస్తోందని చెప్పారు. దేశంలోని పేద కుటుంబాలకు బ్యాంకింగ్ సేవలు ప్రారంభించిన ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన దేశవ్యాప్తంగా 50 కోట్లకు పైగా ప్రజల బ్యాంకు ఖాతాలు తెరవడం ఆర్థిక వ్యవస్థలో సహకరించారని తెలిపారు. పేద మహిళలకు ఉచిత వంటగ్యాస్ కనెక్షన్లు ప్రారంభించిన ప్రధాన మంత్రి ఉజ్వల యోజన ద్వారా 9 కోట్లకు పైగా కుటుంబాలు లబ్ధి పొందాయని చెప్పారు. పేద ప్రజలకు ఉచిత వైద్య సేవలు ప్రారంభించిన ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా సుమారు 50 కోట్ల మంది ఆరోగ్య భద్రత పొందారు. పేదలకు గృహ వసతి కల్పించేందుకు ప్రారంభించిన ప్రధాన మంత్రి ఆవాస్ యోజన ద్వారా దేశవ్యాప్తంగా 4 కోట్లకు పైగా ఇళ్ల నిర్మాణం చేపట్టామని చెప్పారు. గ్రామీణ పారిశుధ్యాన్ని చేపట్టేందుకు స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా 11 కోట్లకు పైగా మరుగుదొడ్లు నిర్మించబడ్డాయి. ప్రతి ఇంటికి తాగునీరు అందించేందుకు అమలు చేస్తున్న జల్ జీవన్ మిషన్ ద్వారా కోట్లాది కుటుంబాలకు ఇంటి వద్దే పైపు నీటి సౌకర్యం కల్పించబడుతోందని చెప్పారు. రైతులకు ఆర్థిక సహాయం అందించేందుకు అమలు చేస్తున్న ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా దేశవ్యాప్తంగా 11 కోట్లకు పైగా నేరుగా ఆర్థిక సహాయం అందుతుందని మంత్రి వివరించారు. బీజేపీ సిద్ధాంతం ప్రకారం ఈ పథకాలన్నీ సమాజంలోని చివరి వ్యక్తి వరకు అభివృద్ధి ఫలాలు చేరేలా పనిచేయడం ప్రతి కార్యకర్త లక్ష్యంగా పెట్టుకోవాలని మంత్రి సూచించారు. గ్రామ స్థాయి నుండి దేశ స్థాయి వరకు పార్టీని బలోపేతం చేయడంలో కార్యకర్తల పాత్ర అత్యంత కీలకమని ఆయన అన్నారు. ఈ ప్రశిక్షణ కార్యక్రమాల ద్వారా కార్యకర్తలకు పార్టీ చరిత్ర, సిద్ధాంతాలు, సంస్థాగత నిర్మాణం, బూత్ స్థాయి నిర్వహణతో పాటు ప్రభుత్వ పథకాలపై మరియు ప్రజల సమస్యలను పరిష్కరించే విధానాలపై అవగాహన కల్పిస్తున్నామని మంత్రి వివరించారు. ప్రజలతో నేరుగా అనుబంధం పెంచుకుని వారి సమస్యలను ప్రభుత్వానికి తీసుకెళ్లే బాధ్యత కార్యకర్తలపై ఉందని ఆయన అన్నారు. పార్టీకి చెందిన ప్రతి కార్యకర్త దేశ సేవ అనే లక్ష్యంతో పనిచేస్తే భారతదేశాన్ని ప్రపంచంలో శక్తివంతమైన దేశంగా తీర్చిదిద్దడం సాధ్యమవుతుందని మంత్రి సత్య కుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, నియోజకవర్గ స్థాయి బాధ్యులు, యువ మోర్చా, మహిళా మోర్చా నాయకులు, ఎస్సీ/ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ మోర్చాలకు చెందిన అధ్యక్షులు, నాయకులు, బూత్ స్థాయి కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో విజయవంతంగా జరిగింది.

0
0 views

Comment