నెల్లూరు జిల్లా యువ క్రీడాకారుడు ఆర్. నవీన్ కుమార్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు
నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ముదివర్తి గ్రామానికి చెందిన యువ క్రీడాకారుడు ఆర్. నవీన్ కుమార్ భారత పురుషుల బీచ్ కబడ్డీ జట్టుకు ఫైనల్ కోచింగ్ క్యాంప్‌కు ఎంపిక కావడం గర్వకారణంగా నిలిచింది.
2026 ఏప్రిల్‌లో చైనాలో జరగనున్న ఆసియా బీచ్ గేమ్స్ కబడ్డీ పోటీలకు ముందుగా గుజరాత్ రాష్ట్రంలోని గాంధీనగర్ ఎస్‌ఏఐ సెంటర్‌లో నిర్వహిస్తున్న శిక్షణ శిబిరానికి ఆయన ఎంపికయ్యారు.
నవీన్ కుమార్ ఈ స్థాయికి చేరుకోవడం పట్ల స్థానిక ప్రజలు మరియు క్రీడాభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆయన అంతర్జాతీయ స్థాయిలో భారతదేశానికి మంచి పేరు తీసుకురావాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు.
కోవూరు నియోజకవర్గ ఎస్‌సి సెల్ అధ్యక్షులు మరియు మాజీ నెల్లూరు జిల్లా కబడ్డీ అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి ముసలి సుధాకర్ నవీన్ కుమార్‌కు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.