మత సామరస్యానికి ప్రతీక ఇఫ్తార్ విందు - డాక్టర్ అర్జున్ రెడ్డి
రంజాన్ మాసం క్రమశిక్షణ, సహనం మరియు సేవా భావానికి నిదర్శనమని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారి తనయులు డాక్టర్ అర్జున్ రెడ్డి గారు పేర్కొన్నారు. కోవూరు నియోజకవర్గంలోని బుచ్చిరెడ్డిపాలెం మరియు కోవూరు పట్టణాలలో నిర్వహించిన ఇఫ్తార్ విందులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ అర్జున్ రెడ్డి గారికి స్థానిక మైనారిటీ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన ముస్లిం సోదరులతో కలిసి ఉపవాస దీక్షను విరమించారు. అనంతరం మసీదులో సేవ చేసే మౌజన్ మరియు విపిఆర్ ఫౌండేషన్ తరఫున రంజాన్ తోఫా కిట్లు అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ అర్జున్ రెడ్డి గారు మాట్లాడుతూ.. పవిత్ర రంజాన్ మాసంలో అందరం కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ఉపవాసాల ద్వారా ఆకలి విలువను తెలుసుకుంటూ తోటి వారికి సహాయం చేయాలనే గొప్ప సందేశాన్ని ఈ పండుగ మనకు అందిస్తుందని చెప్పారు. కులమతాలకు అతీతంగా అందరూ ఒకే చోట చేరడం మతసామరస్యం మరియు సోదరభావానికి నిదర్శనమని ఆయన కొనియాడారు.
మైనారిటీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ముస్లిం మైనారిటీల అభివృద్ధిపై కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని ఆయన ఈ సందర్భంగా వివరించారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను మైనారిటీల సంక్షేమం కోసం ప్రభుత్వం భారీగా 5 వేల 434 కోట్ల రూపాయలు కేటాయించిందని తెలిపారు.
మసీదుల్లో సేవలు అందిస్తున్న ఇమామ్‌లకు నెలకు 10 వేల రూపాయలు, మౌజన్‌లకు 5 వేల రూపాయల చొప్పున గౌరవ వేతనాలను అందిస్తున్నట్లు డాక్టర్ అర్జున్ రెడ్డి గారు పేర్కొన్నారు. ముస్లిం యువత సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 173 కోట్ల 57 లక్షల రూపాయలు కేటాయించారని దీని ద్వారా అనేక కుటుంబాలకు మేలు జరుగుతుందని ఆయన వెల్లడించారు.ఈ కార్యక్రమాలలో ముస్లిం మత పెద్దలు, తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, కూటమి నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.