హమాలీవాడ స్పెషలిస్ట్ మెడికల్ క్యాంప్‌ను సందర్శించిన జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎమ్మెల్యే పాయల్ శంకర్
పత్రికా ప్రకటన
తేదీ: 13 మార్చి, 2026 ఆదిలాబాద్:
రిఫర్ చేసిన రోగుల చికిత్సల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ రాజర్షిషా వైద్యులను ఆదేశించారు. శుక్రవారం పట్టణంలోని హమాలీవాడ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన స్పెషలిస్ట్ మెడికల్ క్యాంప్‌ను స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్ కలిసి ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా శిబిరంలో అందుతున్న వైద్య సేవలను వారు స్వయంగా పరిశీలించి, రోగులతో మాట్లాడారు.
ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో వైద్య సేవలను మరింత బలోపేతం చేసేందుకు ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టులను పూర్తి స్థాయిలో భర్తీ చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే రిమ్స్ ఆసుపత్రిలో అత్యాధునిక వైద్య పరికరాలను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు వెల్లడించారు. హెచ్‌పీవీ టీకాలు మహిళల్లో ప్రాణాంతకమైన క్యాన్సర్‌ను అరికట్టేందుకు ప్రభుత్వం అందిస్తున్న హెచ్‌పీవీ టీకాలను బాలికలు తప్పనిసరిగా వేసుకోవాలని సూచించారు.పాఠశాల విద్యార్థినులకు టీకాలు అందించేందుకు రిమ్స్ వైద్య బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటించి చర్యలు చేపడుతున్నాయని పేర్కొన్నారు.
ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ,కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోట్లాది రూపాయల నిధులు వెచ్చించి పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను రిమ్స్ ద్వారా అందిస్తున్నాయని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజలు చిన్న చిన్న సమస్యలకు కూడా హైదరాబాద్, యావత్మాల్ లేదా నాగ్‌పూర్ వంటి నగరాలకు వెళ్లి లక్షల రూపాయలు వృథా చేసుకోవద్దని కోరారు. రిమ్స్‌లోని అదునాతన వసతులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వైద్య రంగంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా నేరుగా తన దృష్టికి లేదా అధికారుల దృష్టికి తీసుకురావాలని, సమస్యల పరిష్కారానికి తక్షణమే కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బండారి అనూష డిఎం హెచ్ ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్, డిప్యూటి డీఎంహెచ్ ఓ డాక్టర్ సాధన, డీఎంఓ శ్రీధర్, మున్సిపల్ కమిషనర్ జీ.రాజు, కౌన్సిలర్లు పద్మవర్ రాకేష్, గంట జీవన్, మెస్రం విలాస్, తోకల నరేష్, ఇజ్జగిరి సంజయ్, కాలనీవాసులు, వైద్య సిబ్బంది, పాల్గొన్నారు.